CM KCR | హుజుర్నగర్ : ఓటును దుర్వినియోగం చేయొద్దు.. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. యువత ఆలోచించాలి. ఈ దేశం, రాష్ట్రం మీది.. రేపటి బతుకుదెరువు మీది. ఓటు అనేది అలవోకగా వేసేది కాదు.. అది మన భవిష్యత్‌ను మారుస్తుంది. ఓటును దుర్వినియోగం చేయొద్దు అని కేసీఆర్ కోరారు. హుజుర్నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మీ అందరూ గతంలో చాలా ఎన్నికలు చూశారు.. చాలా సార్లు ఓట్లు కూడా వేశారని కేసీఆర్ తెలిపారు. నేను ప్రతి సభలో చెప్తున్నా.. ప్రజస్వామ్య పరిణితి సంతరించుకోవాల్సిన లక్షణం ఏంటంటే.. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి చెడులను విచారించి ఓటు వేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. లేదంటే నాయకులు గెలుస్తరు. ప్రజలు గెలిచే ఎన్నికనే నిజమైన ప్రజాస్వామిక ఎన్నిక. అప్పుడే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే.. ఏది నిజమో తేల్చిన తర్వాత ఓటు వేయాలని కోరుతున్నారు. పార్టీకి ఒకరు నిలబడుతారు. కానీ వ్యక్తుల వెనుక పెద్ద పార్టీ ఉంటది. ఆయా పార్టీల చరిత్ర ఏంది..? వైఖరి ఏంది..? దృక్పథం ఏంది..? ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారనే అంశంపై చర్చ జరపాలని కేసీఆర్ సూచించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతదని కేసీఆర్ తెలిపారు.
దళిత బిడ్డలు అనాదిగా, యుగయుగాలుగా వివక్షకు, వెనుకబాటు తనానికి గురువతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఈ దుస్థితి. అణిచివేతకు గురవుతున్నారు. ఎందుకు ఉండాలి ఈఖర్మ. మన లాగా వారు పుట్టలేదా..? వారు సాటి మానవులు కాదా..? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ ఈ ఆలోచన చేసి ఉంటే దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు.. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి దళితులు ఇలా. ఇవన్నీ ఆలోచించి దళితబంధు తీసుకొచ్చాం. గిరిజన బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలని ఏండ్ల పాటు కొట్లాడారు. కానీ ఎవరూ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది. ఎన్నికలు రాగానే గోల్ మాల్ చేయాలి. మందుసీసాలు సరఫరా చేయాలనేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పని. అది ప్రజాస్వామ్యం కాదని కేసీఆర్ పేర్కొన్నారు.