నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకు మాకు తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్లు, కరెంట్ తేలేదనటం కరెక్ట్ కాదు. నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నాం కాబట్టే రాష్ర్టానికి అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజలకు నీళ్లు, విద్యుత్తు సరిగ్గా ఇవ్వటంలేదన్న ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరంతర నాణ్యమైన విద్యుత్తు, సాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ ‘నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకూ మాకూ తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్లు, కరెంట్ తేలేదనేది కరెక్ట్ కాదు. సుంకేసుల నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకురావడానికి కొత్త ప్రాజెక్టు మంజూరు చేశాం. శామీర్‌పేట్ దగ్గర కొత్త రిజర్వాయర్ మంజూరు చేశాం. మల్లన్నసాగర్‌తో అనుసంధానం చేయబోతున్నాం. ఎన్నో స్టెప్స్ తీసుకుంటే ఈ స్థాయికి వచ్చాం. ఇన్నేండ్లు దేశాన్ని పాలించింది మీరే కదా? ఎందుకు చేయలేదు?’ అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ‘మీదాంట్ల ఎంతో మంది సీఎంలుగా చేశారు. అపరమేధావులు ఉన్నరు. ఇంకో పార్టీలో ప్రపంచ మేధావి ఉండే. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ ప్రపంచ మేధావీ ఇవ్వలేదు, మీరూ ఇవ్వలేదు. 30 ఏండ్లు ఏడిపించారు’ అని కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అన్ని సమస్యలను పరిష్కరించుకొంటూ వెళ్తున్నామని, విద్యుత్తు మీద దాదాపు రూ.20 వేల కోట్ల ఖర్చు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం క్లీన్ పవర్ వస్తుండటంతో ప్రజలు ఎంజాయ్ చేస్తున్నరని పేర్కొన్నారు. ‘ఎన్టీపీసీ నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా తెలంగాణ కోసం నాలుగువేల మెగావాట్ల పవర్ స్టేషన్ కావాలని రాష్ట్ర విభజన చేసిననాడు పోరాడినం. అది దాదాపుగా పూర్తయింది. యాదాద్రి, ఎన్టీపీసీ, భద్రాద్రి ఇలా చాలా తెచ్చాం. తెలంగాణ రాకముందు సోలార్ పవర్ ఉత్పత్తి సున్నా ఉంటే ఇప్పుడు మూడున్నర వేల మెగావాట్ల పై చిలుకు తెచ్చాం. అది అడిషన్ కాదా?’ అని ప్రశ్నించారు.
ఉమ్మడి ఏపీలో రోశయ్య విద్యుత్తుశాఖ మంత్రిగా ఉండగా అసెంబ్లీలో కూడా కరెంట్ పోయేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఈ సమస్య ఎక్కడిదాకా పోయిందంటే.. రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్తు సమస్య లేకుండా చేస్తా, లేకుంటే శాసనసభలో ఉరి వేసుకుంటా అని రోశయ్య చెప్పారు. కానీ కాలేదు పాపం. ఒక రోజు మధ్యాహ్నం సెషన్‌కు బ్రీఫ్‌కేస్‌లో తాడు వెంట తెచ్చుకున్నారు. నేను అపోజిషన్‌లో ఉన్న. ‘హే.. నువ్ పెద్ద మనిషివి అలా చేసుకుంటవా’ అని సముదాయించినం’ అని సీఎం తెలిపారు.