ఆర్టీసీని మరింత అభివృద్ధి చేస్తం
సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అయినప్పటికీ ఏటా రూ.1,500 కోట్లు ఇస్తూ దానిని ప్రభుత్వమే సాకుతున్నదని చెప్పారు. బయట ఉండి ఆర్టీసీని సాకడం ఎందుకని, ప్రభుత్వంలో కలిపి మరింత బలోపేతం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.
- ఉద్యోగులకు భద్రత..ప్రజలకు మెరుగైన రవాణా
- అన్నీ క్షుణ్ణంగా ఆలోచించే సంస్థ విలీన నిర్ణయం
- పేరుకే కార్పొరేషన్.. దాన్ని సాకుతున్నది సర్కారే
- ఆర్టీసీ బాగు కోసం నిర్ణయం తీసుకుంటే ఆస్తులపై కన్నేశామంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నరు
- బిల్లును ఆమోదించిన గవర్నర్‌కు కార్మికుల పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు: శాసనసభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అయినప్పటికీ ఏటా రూ.1,500 కోట్లు ఇస్తూ దానిని ప్రభుత్వమే సాకుతున్నదని చెప్పారు. బయట ఉండి ఆర్టీసీని సాకడం ఎందుకని, ప్రభుత్వంలో కలిపి మరింత బలోపేతం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
లాభాల కోసం విశ్వప్రయత్నం
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై తెలిసినోడు ఒకటి, తెలియనోడు మరొకటి మాట్లాడుతున్నారు. ఆ గవర్నర్.. తెలిసీ తెలియక అనవసర వివాదం కొనితెచ్చుకున్నారు. ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు రవాణా అందించాలనే ఉద్దేశంతో. కాల క్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. నేను కూడా గతంలో రవాణాశాఖ మంత్రిగా పని చేశా. చాలా నిబద్దతతో పని చేశా. నేను బాధ్యతలు తీసుకునే సమయానికి నాటి ఏపీఎస్ ఆర్టీసీ రూ.14 కోట్ల నష్టాల్లో ఉన్నది. వివిధ రకాల సంస్కరణలు అమలు చేసి ఆ నష్టాలను పూడ్చుతూ.. మరో రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చినం. ఇక్కడ కూడా నష్టాలు పూడ్చొచ్చు, కానీ కొన్ని రోజులుగా డీజిల్ ధర భారీగా పెరిగింది. మేం ఏ పని చేసినా అశామాషీగా చేయబోం. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని కోరుతూ గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కానీ ‘మీకు అవసరమైన నిధులిస్తాం. సంస్థను నడిపించి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి’ అని చెప్పినం. అందుకే మంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ఎండీగా, అనుభవం గల బాజిరెడ్డి గోవర్ధన్‌ను చైర్మన్‌గా వేసి విశ్వప్రయత్నం చేశాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ధరల పెరుగుదల ఇబ్బందిగా మారింది. ఈ డీజిల్ ధర నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ.. 6 లక్షల లీటర్ల డీజిల్‌ను కాల్చుతాయి. గతంలో లీటర్‌కు రూ.60 ఉన్న డీజిల్ ధర ఇప్పుడు రూ.100 దాటింది. దీంతో రోజుకు డీజిల్ వల్లే రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థ ఎలా ముందుకు పోతుంది. అందుకే మొన్నటి క్యాబినెట్లో ఐదారుగంటలపాటు చర్చించి చివరికి ఈ నిర్ణయానికి వచ్చాం. ఏటా బడ్జెట్లో పెట్టి మరీ ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ఇస్తున్నాం. అది ప్రభుత్వంలో లేదన్నమాటే గానీ, దాన్ని సాదుతున్నది మాత్రం ప్రభుత్వమే. వచ్చే ఆదాయం ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో ఇక తప్పదని, ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని, ఏ కారణం కోసమైతే ఆర్టీసీని ఏర్పాటు చేశారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేమని, ఆర్టీసీ తప్పకుండా ఉండి తీరాల్సిందేనని ప్రభుత్వంలోకి తీసుకోవాలని నిర్ణయించినం. కార్మికులకు కూడా భద్రత వస్తుంది. అందరికీ బాగుంటుందని భావించి క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకున్నాం.
పిచ్చివాళ్ల మాటలు పట్టించుకోం
గతంలో వద్దన్నోళ్లే ఇప్పుడు మళ్లీ ఎలా నిర్ణయం తీసుకున్నరంటూ మాట్లాడే పిచ్చివాళ్లు కూడా ఉన్నారు. కానీ వారితో మాకు సంబంధం లేదు. ఏ పని చేసినా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. లోతైన దృక్పథం, పరిశీలన ఉంటుంది. వీటి ఆధారంగానే ముందుకెళ్తాం. ఇందులో భాగంగానే అక్కడ సగం, ఇక్కడ సంగం ఎందుకు బయట మేనేజ్మెంట్ ఎందుకని, ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి.. ఓ ఇద్దరు యంగ్ ఐఏఎస్ అధికారులను పెట్టి.. సంస్థకు ఇంకో పది రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు చేద్దామని, ఎలాగూ నష్టాలు మనమే భరిస్తున్నాం కాబట్టి.. ప్రభుత్వంలో కలిపేస్తే ఆ అకౌంట్స్ కూడా ఇక్కడికే వస్తాయని నిర్ణయించినం.
ఇంత నీచులుంటారా?
కొంత మంది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే.. రాజకీయాల్లో ఇంత నీచులు కూడా ఉంటారా? అనిపించేలా.. మేము ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఉంటుందా? ప్రభుత్వం ఏం చేసినా అడ్డంపొడుగు మాట్లాడుతామంటే ఎలా. ఇదే దుఃఖం కలిగిస్తుంది. ఇంత బాధ్యాతయుతంగా పని చేసే ప్రభుత్వం.. ముందుకొచ్చి ఆర్టీసీ సేవల్ని పెంచేందుకు, బస్టాండ్లను బాగు చేస్తం, సౌకర్యాలు పెంచుతం, అవసరమైతే ఇంకో పదెకరాల స్థలం తీసుకుంటం. ఇప్పుడు అక్బరుద్దీన్ బండ్లగూడలో బస్‌డిపో కావాలని కోరారు. అక్కడ అక్బరుద్దీన్ వ్యక్తిగత లాభం ఏం లేదు. అక్కడి ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కావాలనేది ఆయన ఉద్దేశం. కచ్చితంగా చేస్తం. సంస్థ ఉద్యోగులు మా ఇంటి మనుషులు.. వాళ్లను ఎందుకు వదులుకుంటాం.
గవర్నర్‌కు ధన్యవాదాలు
ఇప్పుడు ఆ ఉద్యోగులకు భద్రత కలుగుతుంది. పీఆర్సీ ఇస్తం. వాళ్లకు జీతాలు పెరుగుతాయి. ప్రభుత్వం ఉద్యోగులకు ఏ సదుపాయం కల్పించినా.. ఆర్టీసీలోని 43 వేల మంది ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసే ఈ బిల్లును గవర్నర్ ఎందుకు తన వద్ద ఉంచుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగి ఆమె పనిలేని పని పెట్టుకున్నారు. అయితే ఆమెకు జ్ఞానోదయం అయ్యి మధ్యాహ్నమే బిల్లుపై సంతకం చేసి పంపించారు. చాలా సంతోషం. ఆర్టీసీ కార్మికుల పక్షాన, నా పక్షాన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు.
కేసీఆర్ పంచ్
- మొన్న హైదరాబాద్ వరదలు- ఎన్నికల ప్పుడు బండిపోతే బండిస్తం, గుండు పోతో గుండిస్తం అని మాట్లాడినోడు బండి లేదు, గుండు లేదు, యాడికి వోయిండో పత్త లేడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనకు
ఏకాన కొత్త ఇచ్చింది లేదు. - 9 ఏండ్ల కిందట దుమ్ముగొట్టుకుపోయి కనిపించిన 250 కిలోమీటర్ల గోదావరి నది ఇప్పుడు సజల, సుజల సజీవ గోదావరి. ఇప్పుడు గోదావరిలో ఏ కాలంలో చూసినా 100 టీఎంసీల నీళ్లు నిలువ ఉంటాయి. రేపటి రోజుల్లో దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమే!
- మొన్న కరువు వచ్చేట్టు కనిపించింద. ప్రాణహిత నీళ్లు ఎత్తి శ్రీరాంసాగర్‌లో పోసినం. కింద గోదావరి నీళ్లు మీదికి పోసే సరికి గోదావరి తల్లికి కోపమొచ్చిందో ఏమో, ఒక్కసారి ఉప్పొంగింది. కరువు తీరిపోయింది.
- అదొక పిచ్చి పేపర్. వెకిలి పేపర్. నిలువెల్ల విషం. వాడేదో రాస్తడు. ఇంకొకాయన పిచ్చి మేధావి. ఈక తెల్వదు, తోక తెల్వదు. మన ప్రాంతం మనిషి కాడు. మన స్టేట్ మనిషి కాడు. విషయం అర్థం చేసుకోవడానికి
బుర్ర కావాలి కదా. అది లేదు. వాళ్లేదో అంటరు. కాంగ్రెసోళ్లు మాట్లాడతరు. తలా తోకా తెల్వదు. - కాంగ్రెస్ బంగారు పాలనలో వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం 15. బీఆర్ఎస్ పాలనలో వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం నంబర్ వన్. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు. ఇప్పుడు 3 కోట్ల టన్నులు. పండించుండ్రి అనంగనే పంజాబ్‌ను దాటిపోయిన తెలంగాణ రైతన్నకు నా శాల్యూట్.
- 9 ఏండ్ల కింద 7 లక్షల టన్నుల యూరియా వాడేది తెలంగాణ. ఇప్పుడు 27 లక్షల టన్నులు వాడుతున్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినం? ఎరువుల బస్తలైతే మనుషులు తినరు కదా! అవి కూడా తింటమంటే కాంగ్రెసోళ్లకు పంపిస్తం. రాష్ట్రంల ఇప్పుడు ఎరువులకు కరువు లేదు.
- రైతు బంధు విడుదల ఎంత సుందర దృశ్యం. జూన్ వచ్చింది, పెట్టుబడులు పెట్టే సమయం ఆసన్నమైంది అని రైతన్న అనుకోగానే అతడి సెల్‌ఫోన్ టింగుటింగు మంటుంది. లక్షలాది రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతాయి.
- కాంగ్రెసోళ్లు వస్తే, కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జై భీమ్.
- కేసీఆర్ రుణమాఫీ చేయలేదని రైతులను రెచ్చగొట్టాలనుకున్నరు. కానీ అది కూడా ప్రకటించినం. నెల రోజుల్లో అవిపోతయ్. దాంతో కాంగ్రెసోళ్లు సల్లబడుడే.
- రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ఓపెన్ చేసి కూడా జాతికి అంకితం చేస్తామంటున్నరు. దవఖానలో లిఫ్టు పెట్టి కూడా దాన్ని జాతికి అంకితం అంటరు. ఒక్కటే వందేభారత్ రైలుకు వందసార్లు జెండా ఊపుతరు. సిటీ నిండా కటౌట్లు. అంతా హడావుడి. అదంతా తెలంగాణ ప్రజలకు తెలియాలి.
- దేశంలో ఎవ్వరివ్వని 24 గంటల కరెంటు తెలంగాణ ఎలా ఇస్తున్నది? దానికొక నిబద్ధత కలిగిన పాలసీ ఉన్నది. నిధుల కూర్పు ఉన్నది. నిరంతర మానిటరింగ్ ఉన్నది. నా ఐపాడ్లో ఎన్ని సైకిల్స్ మీద విద్యుత్తు పోతున్నది? 50 సైకిల్స్ పోతున్నదా? లేదా? అనేది నేనే స్వయంగా చూస్తా. పోకపోతే వాకబు చేస్తా. గ్రిడ్ కొలాప్స్ కాకుండా చూసుకుంటం.
మనమే.. మనం మాత్రమే! - భారతదేశంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- భారతదేశంలో రైతులు పండించిన పంట మొత్తం కొని 5,6 రోజుల్లో అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- భారతదేశంలో వీధి నల్లాలు (పబ్లిక్ స్టాండ్ పోస్టు) లేని ఒకే ఒక్క నగరం మన హైదరాబాద్.
- భారతదేశంలో ప్రతి ఇంటికి నల్లాతో, ఇంటికి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- దేశంలో జీరో ఫ్లోరోసిస్ స్టేట్ (ఫ్లోరోసిస్ ఏమాత్రం లేని) ఏకైక రాష్ట్రం తెలంగాణ.
- భారత దేశంలో అత్యుతమ పునరావాస కాలనీలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

