CM KCR | ప్రస్తుతం అడ్డంపొడువు మాట్లాడుతునోళ్లంతా.. నాడు ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో ప్రజలకు తెలుసునని సీఎం కేసీఆర్ అని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికలు వచ్చేశాయ్. తెలంగాణ సాధన తర్వాత పదో సంవత్సరం జరుగుతున్నది. ఈ పదేళ్లలో ఏం జరిగిందో అదంతా నిలువెత్తుగా మీ కళ్ల ముందు ఉన్నది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే. ఎలక్షన్లు చాలాసార్లు వస్తుంటాయ్.. పోతుంటాయ్. నేను చెప్పే నాలుగుమాటలను మీ గ్రామాలు, బస్తీలకు పోయిన తర్వాత చర్చ జరుపాలని కోరుతున్నాను. నిజానిజాలు తేల్చాలని కోరుతున్నాను. కారణం ఏంటంటే మీరు పేపర్లలో చూస్తున్నరు’ అన్నారు.
‘24ఏళ్ల నాడు పిడికెడు మందిమి.. ఇందులో నిరంజన్‌రెడ్డి ఒక్కరూ. ఎవరూ లేనినాడు ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ నాడు ఎవరు ఎక్కడ ఉన్నరో తెలుసు. ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో మీకు తెలుసు. కానీ, ఇవాళ కేసీఆర్ నువ్వు కొడంగల్‌కు రా.. అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మకాడికి ఇంకొకడు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారు. వనపర్తి కేసీఆర్ నా పక్కన నిలబడి ఉన్నడు కాదా? నీ దమ్ము.. నా దమ్ము ఏంటంటే.. ఏ దమ్ము లేకుండా.. దమ్ము కోల్పోయి.. గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్‌నగర్ జిల్లా ఆ నాడు వలసపడి, గోసపడి ఎవరో వచ్చి గంజి, అంబలి కేంద్రాలు పెడితే బతకాలని ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆ నాడు పక్షుల్లా తిరుగుతుంటే ఈ నాడు ఉన్న నాయకులు ఎక్కడున్నరో మీకు తెలుసు’ అని చెప్పారు.
‘అవాకులు, చెవాకులు.. చిన్న పెద్దంతరం లేకుండా నోటికి వచ్చేది వాగేది ఎవలో.. వాళ్లు ఏం పనిలో ఉన్నరో మీకు తెలుసు. మేం తిరిగిన నాడు.. ధైర్యం లేదు.. మంది లేరు.. నాయకులు లేరు. మంత్రి పదవులు లేవు అయినా పక్షుల్లా రాష్ట్రం నలుమూలల కలియదిగిరి.. జానాన్ని చైతన్యపరిచి.. అద్భుతమైన పాటలు రాసి.. ఇవాళ లేడు కానీ.. నా తమ్ముడు సాయిచంద్, గోరటి వెంకన్నలాంటి కవులు కళాకారులు.. ఎందరో బిడ్డలను ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అదికూడా 2004లో మన పొత్తుతో గెలిచి.. మన ఆగం చేయాలని చూసి.. 14 సంవత్సరాల తర్వాత నేను చావునోట్లో తలకాయపెట్టి చావునోట్లో ఆమరణ నిరాహార దీక్షకు కూసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ మాట్లాడేది ఎవరో.. ఆ నాడు పోట్లాడింది ఎవరో ఆలోచన చేయాలని కోరుతున్నా’నన్నారు.
‘ఆ నాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? గొడగొడ ఏడుస్తుంటే.. తెలంగాణకు నీళ్లల్లో, నిధుల్లో, నియామకమాల్లో, కరెంటులో అన్నింట్లో అన్యాయం జరుగుతుంటే నోరుమూసుకొని కూర్చున్నది ఎవరు? గొంతుపెగిల్చి.. నినాదం ఇచ్చి కోట్లాడింది ఎవరు? ఆలోచన చేయాలి. ఒక్కటే ఒక్క మాట. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు అని పడావు పెడితే ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీరు వస్తుంది’ అన్నారు.