CM KCR | తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్ ఆరాటమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ, కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ నుంచి నోరుపెట్టుకొని వస్తున్నరు. 157 మెడికల్ కాలేలు దేశంలో కడితే.. మనకు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. చట్టం ఉన్నది. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. నేను నూరు ఉత్తరాలు రాసిన నరేంద్ర మోదీకి. ఒక్క పాఠశాల కూడా ఇయ్యలే. మాకు వస్తే గద్వాలకు నవోదయ పాఠశాల వస్తుండే. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వనటువంటి బీజేపీకి పార్టీకి ఓటు ఎందుకు వేయాలి’ అంటూ ప్రశ్నించారు.
‘అందుకే మిమ్మల్ని అందుకే నేను మిమ్మల్ని కోరేది. ఎలక్షన్లలో ఆగమాగం ఓటువేయొద్దు. వ్యక్తి చరిత్ర, వాళ్ల పార్టీ చరిత్ర, నడకవడిక, ప్రజలు గురించి ఎలా ఆలోచిస్తరని ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు. మీరు గెలవాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ కాంగ్రెస్ రెండుమాటలు చెబుతున్నది. రైతుబంధు అవసరం లేదు.. దుబార చేస్తున్నడు కేసీఆర్ అని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షులవారేమో కేసీఆర్ బేకార్‌గా వేస్ట్ చేస్తున్నడు. రైతులకు మూడుగంటల కరెంటు చాలు. మొత్తం దుబారా చేస్తున్నడు అని మాట్లాడుతున్నరు. కరెంటు కరెంటు మూడు గంటలు చాలా? 24 గంటలు కావాల్నా..? రైతుబంధు దుబారనట? నేను దుబార చేస్తున్ననట. నేను కాపోడినే. నాకు వ్యవసాయం ఉన్నది’ అన్నారు.
‘కాపోళ్ల బాధలు నాకేంటో తెలుసుకాబట్టి.. నేను 24 గంటల కరెంటు ఇస్తున్న. ఇష్టం ఉన్నప్పడు రైతులు పొలం పారించుకుంటరు. మునుపు సగం రాత్రి, సగం పగలు ఇస్తే నిద్రలు కాచి.. బాయిలకాడ పండుకొని ఎంతో మంది పాములు కరిచి, కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఇవాళ ఆ బాధ లేదు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా. గ్యారంటీగా కరెంటు ఆగం చేస్తరు.. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరటా? రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నడు. రాహుల్ గాంధీకి ఎద్దు ఉన్నదా? ఎవుసం ఉన్నదా? ఆయనకు ఏమన్న తెలుస్తదా? ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తరట? మళ్లీ మీ భూములు పట్వారులు, గిర్దావర్లు.. మళ్లీ కిందిమీద చేడయం.. ఆగమాగం చేయడం’ జరుగుతుందన్నారు.
‘రైతుబంధు డబ్బులు మీకు ఇస్తున్నం. దర్జాగా ఎలా వస్తున్నయ్. అక్కడ వేయంగనే టింగ్ టింగుమని ఫోన్లు మోగుతున్నయ్. ఏ పెట్టుబడికి అవసరమైతే దానికి పెట్టుకొని మంచి పంటలు తీస్తున్నరు. ధరణి తీసివేస్తే రైతుబంధు ఎలా రావాలి? రైతుబీమా ఎలా రావాలి? ధాన్యం డబ్బులు ఎలా రావాలి? మళ్లీ దళారీలు.. పహానీ నకళ్లు.. మళ్లీ మండలాఫీసుల చుట్టూ తిరుగుడు.. నీకు ఎన్ని ఎకరాలున్నది..? రూ.60వేలు వస్తే.. రూ.20వేలు ఇవ్వమంటడు.. మళ్లీ అక్కడికి వస్తుంది కదా? ఇవాళ దళారీ లేడు.. దరఖాస్తు లేదు.. ఆఫీసుకు వెళ్లే పని లేదు. మీరు కాలుమీద కాలు వేసుకొని కుసుంటే డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడుతున్నయ్. ధరణి ఉండలా లేదా? ధరణిని వేస్తామనోళ్లను ఏం చేయాలి?’ ప్రశ్నించిన ఆయన.. వారినే బంగాళాఖాతంలో వేయాలన్నారు. ఆ పని చేస్తనే తెలంగాణ బాగుపడుతుందన్నారు.
‘మనం గొడగొడ ఏడుసుకుంట వలసపోయిన నాడు ఒక్క కాంగ్రెస్, బీజేపోడు ఎవడన్నా జై తెలంగాణ అన్నడా? మన చెవులతో విన్నామా? మనం జై తెలంగాణ అంటే.. మనల్నే జైళ్లో వేశారు. చంపారు, కొట్టారు. లాఠీచార్జీలు చేసి అనేక కేసులు పెట్టారు. వాళ్లు ఎన్నడూ అనలే. వాళ్లకు ఎందుకు కడుపునొప్పి ఉంటది ? తెలంగాణపై మళ్లీ పెత్తనం కావాలి? పచ్చపడ్డది కదా? మళ్ల కరగనాకాలి ఇగ.. ఏం లేకుంట మళ్లీ ప్రజలకు గుండుకొట్టాలి. దాని కోసమే వాళ్ల ఆరాటం తప్ప.. తెలంగాణ బతుకుల కోసం కాదు. తెలంగాణ పోరాటం కోసం కాదు. ఏమాత్రం పొరపాటు చేసినా వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లయితది. మళ్లీ మొదటికే వస్తం. చాలా ఇబ్బందులు వస్తయ్. దయచేసి ఆలోచించి గద్వాల అభివృద్ధి కోసం అనుక్షణం తపించే వ్యక్తి కృష్ణమోహన్‌రెడ్డి. మంచి పట్టున్న నాయకుడు. ఆయనను గతంలో కంటే పదివేల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.