CM KCR | అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ మహనీయుడిని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని.. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దళిత జాతికి నాదోక విజ్ఞప్తి. దళితులు అనేక సంవత్సరాలుగా వెనుకపడి ఉన్నారు. యుగయుగాల నుంచి అణచివేతకు గురయ్యారు. సామాజిక వివక్షకు గురయ్యారు. వారిని ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 75 ఏళ్ల కిందనే ఎదన్న స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే దళిత జాతి బాగుపడుకపోవునా’ అంటూ ప్రశ్నించారు.
‘దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్పా ఏనాడూ ఏం చేయలేదు. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే పెద్ద పొలికేక దళితబంధు కార్యక్రమం. ఆ కార్యక్రమం బీఆర్ఎస్ స్వయంగా తీసుకువచ్చింది. ఈ దళితబంధు ప్రతి కుటుంబానికి అందే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది. కాంగ్రెస్ 75 సంవత్సరాల కింద ఈ పథకం మొదలుపెట్టి ఉంటే ఇవాళ్టికి మన దరిద్రం పోకపోవునా? దళితబంధు వచ్చిన పిల్లలు ఎంత బాగా పని చేసుకుంటున్నరు. ఎంత బాగా బతుకుతున్నరు ? అద్భుతంగా ఉంటుంది. ఆ స్కీమ్‌ను కొనసాగించాలి. దళితులపై పెదవులపై ప్రేమ. ధైర్యంగా ఒకనాడు ఎవరూ ఏం చేయలేదు’ అన్నారు.
‘ఆ నాడు అంబేద్కర్ మహాశయుడు అనేక పోరాటాలు చేశారు. ఆయనను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టే. తెలుసుకోండి చరిత్ర. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల అమలు కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఆకాశమంత ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో పెట్టుకున్నాం. దానికి దీనికి చిల్లరమల్లరదానికి కాదు. తెలంగాణ గుండెకాయ అయిన తెలంగాణ పరిపాలన కేంద్రమైన, ముఖ్యమంత్రి, మంత్రులు కూర్చుండే సెక్రటేరియట్‌కు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరుపెట్టుకున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మీదికి మాట్లాడుతరు. నటన, తమాషా కోసం చేస్తరు తప్పా. కానీ, తాము సెక్రటేరియట్‌కు పేరు పెట్టున్నాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం’ అని గుర్తు చేశారు.
‘పరిపాలకులకు ఎప్పటికీ అంబేద్కర్ వేలు కనిపిస్తుండాలి.. వాళ్లకు సోయి ఉండాలని సెక్రటేరియట్‌కు దగ్గరలో పెట్టుకున్నాం. ఒక నిబద్ధతో, పద్ధతితో తెలంగాణలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూపోతున్నాం. కొత్త మేనిఫెస్టోనూ కూడా చూశారు. పెన్షన్లు చూశారు. గతంలో రూ.200 పెన్షన్ ఉండేది. తెలంగాణ వచ్చాక తొలుత మానవకోణంలో రూ.1000 ఇచ్చాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆదాయం పెరిగిన కొద్దీన రూ.2వేలు ఇచ్చుకున్నాం. మొన్న మేనిఫెస్టోలో ఐదేళ్లలో రూ.5వేలకు పెంచుతామని చెప్పాను. మార్చి తర్వాత రూ.3వేలు ఇస్తం. సంవత్సరానికి రూ.500 పెరుగుకుంటూ పోయి ఐదేళ్లలో రూ.5వేలు అవుతుంది. 93లక్షల మంది రేషన్‌కార్డుదారులున్నారు. తెలంగాణ ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పడుతున్నది. వారందరికీ సన్నబియ్యం సరఫరా చేస్తాం. రైతుబంధు, పెన్షన్, ఆరోగ్యశ్రీ లిమిట్‌ను పెంచబోతున్నాం. ఏ పార్టీ వైఖరి ఏంటో, ఆలోచన సరళి ఏంటో ఆలోచన చేసి జాగ్రత్తగా ఓటు వేయకపోతే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.