
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గుజరాత్ మోడల్ అంటే.. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎద్దేవాచేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్‌పై నిప్పులు చెరిగిన సీఎం.. బీజేపీ అన్నింటా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
గుజరాత్ మోడల్ దొంగ ప్రచారం
గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా విఫలమైంది. వాళ్లు స్వతంత్రం వచ్చిన కొత్తలో కొత్త కొత్తవి తీసుకువచ్చిండ్రు కానీ గొప్పగా ఏమీ చేయలేదు. ఈ నరేంద్రమోదీ వచ్చిండు.. గుజరాత్లో ఏమో పొడిచినట్లు! నాలుగు దొంగ బొమ్మలు సోషల్ మీడియాల ప్రచారం. ఇక్కడ దొంగ సోషల్ మీడియా పెట్టిండ్రు. పూర్తి అధర్మమైనటువంటి, ఒకే అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పే, ఇతరులను కించపరిచే దిక్కుమాలిన, దరిద్రపు గొట్టు సోషల్ మీడియా ఉన్నది. అట్లాంటి దొంగ ప్రచారాలతోని గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం. తలా తోకా లేనటువంటి, పేదలను పూర్తి హీనంగా చూసే దిక్కుమాలిన మోడల్ అది. గుజరాత్ మోడల్ అంటే ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’. అంటే పైన పటారం లోన లొటారం. నేను ఊరికే ఆరోపణలు చేస్తలేను. ఆ గుజరాత్ మోడలేమో పెడతమంటే.. ఈయనేమో దేశాన్ని ఉద్ధరిస్తడని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు 8 ఏండ్లు గడిచిపోయింది. ఈయన బండారం బయటపడింది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 8వది. ఇంకో సంవత్సరం ఉన్నది. మోదీ బృందానికి, ఆయన పార్టీకి ఉన్న తెలివి ఏందో.. దేశ అభ్యుదయం కోసం ఆయన పంథా ఏందో స్పష్టంగా బయట పడిపోయింది. వీళ్లకు మ్యాండేట్ వచ్చింది పదేండ్లకు కదా! 80 శాతం టైమ్ అయిపోయింది. 80 శాతం టైమ్ గడిపిన మోదీ ప్రభుత్వం ఇవాళ పెట్టిన బడ్జెట్ ఇంత దిక్కుమాలినతనంగా, దరిద్రంగా ఉన్నది. ఎంతో భావ దారిద్య్రం తోని ఉన్న కురచ ప్రభుత్వమున్నది.
కరోనా కాలంలో లక్షల మందికి రైలు టిక్కెట్లు కూడ ఇవ్వలేదు
కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమైంది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. దరిద్రపు గొట్టు వ్యవహారం చేసింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేటట్లు చేశారు. గంగానదిలో శవాలు ఎప్పుడూ తేలలేదు.. లక్షల మంది ప్రజలకు కనీసం రైలు టికెట్లు కూడ ఇవ్వలేదు. అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేస్తే, వేల కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారుల మీద అనేకమంది చనిపోయారు. కరోనాలో వీళ్లు చేసిన వ్యవహారం ఎంత దరిద్రంగా ఉన్నదో మనందరికీ తెలుసు.