హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశ దిశదశను మార్చాలని టీఆర్ఎస్ పార్టీ ముక్తఖండంతో ఆకాంక్షించింది. కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నదని రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వేసే అడుగు మోదీ పాలనను అంతం చేసేందుకు పడే పిడుగు అని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో బీజేపీ మత విద్వేష, రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకిలేదని, బీజేపీని భూస్థాపితం చేసే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉన్నదని వారు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనతో దేశంలోని అన్ని వర్గాలు తీవ్ర నిరాశ, నిస్పృహలోకి వెళ్లిపోయాయని, జాతీయస్థాయిలో వివిధ రంగాల నిపుణులు, మేధావులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పండితులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు మారాలంటే జాతికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని నినదిస్తున్న కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం రావాలన్న డిమాండ్ వస్తున్నదని తెలిపారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తీర్మానం చేసి కేసీఆర్‌కు పంపుతామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో తామెలా కేసీఆర్ వెంట నిలిచామో.. అలాగే రాష్ర్ట ప్రజలతోపాటు దేశ ప్రజలూ ఆయన వెంట నిలుస్తారని, కేసీఆర్ చేపట్టే మరో ఉద్యమానికి దేశం సన్నద్ధం అవుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సంబురాలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. జై తెలంగాణ.. దేశ్‌కీ నేత కేసీఆర్‌కు జై అంటూ టీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు హోరెత్తాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ కటౌట్‌ను ఏర్పాటు చేసి నినదించారు.
మోదీ దుర్మార్గ పాలన అంతం..అదే సీఎం కేసీఆర్ పంతం కావాలి
ఎనిమిదేండ్లుగా కేంద్రంలో మోదీ దుర్మార్గ పాలన సాగుతున్నది. అది అంతం కావాలంటే సీఎం కేసీఆర్ జాతి హితం కోసం మరో ఉద్యమానికి నాయకత్వం వహించాలి. ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను దిగజార్చిన దద్దమ్మ మోదీ. బీజేపీ పీడను విరగడ చేసే ధీరుడు సీఎం కేసీఆరేనని దేశ ప్రజలు గుర్తించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఖతమైపోయింది.
– బాల్క సుమన్,మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
సారు సంకల్పించాలె.. దేశం ముందుకు సాగాలి
సీఎం కేసీఆర్ ఒక్కసారి సంకల్పిస్తే దేశం ముందుకు సాగడం ఖాయం. సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన అనేక సభల్లో ‘దేశ్ కీ నేత కేసీఆర్.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి’ అని అశేషజనవాహినీ ఆహ్వానించింది. సంపద సృష్టించటం.. ఆ సంపదను జాతికి పంచటం దేశంలో కేసీఆర్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదు.
– జీవన్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
అఘాయిత్యాలు ఆగాలంటే..
దేశంలో మోదీ మోసాలు, షా ఆగడాలు అం తం కావాలంటే సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలి. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా యి. షీ టీమ్స్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు, విధానాలు దేశానికే నమూనాగా నిలిచాయి.
– మాలోత్ కవిత, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు
అన్యాయాన్ని ఎదిరించే నేత
‘అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు’ అని ప్రజాకవి కాళోజీ చెప్పినట్టు.. దేశంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే నాయకుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఇటీవల ప్రభుత్వరంగ ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ లాంటి విజనరీ నేత రావాలని ఆకాంక్షించారు.
– దాస్యం వినయభాస్కర్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు
ఎదురుచూస్తున్న బడుగులు
దేశంలో బడుగు, బలహీనవర్గాలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురుచూస్తున్నాయి. మోదీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతగా కేసీఆర్‌ను చూస్తున్నారు. దేశానికి మోదీ మాడల్ కాకుండా కేసీఆర్ మాడల్ కావాలని కోరుకుంటున్నారు.
– లింగయ్యయాదవ్, సూర్యాపేట జిల్లాఅధ్యక్షుడు
సుస్థిర పాలనకేసీఆర్తోనే
దేశంలో బీజేపీ పాల న నిరంకుశంగా సాగుతున్నది. సామాన్య ప్రజలు బతుకడమే కష్టం అవుతున్నది. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే పార్టీ కంటే అన్ని వర్గాలకు న్యాయం చేయగలిగే కేసీఆర్ లాంటి న్యాయకత్వం అవసరం. కేసీఆర్ తప్పకుండా భారత రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తారనే నమ్మకం ఉంది. ఆయనకు మేమంతా అండగా ఉంటాం. దేశంలో సుస్థిర పాలన కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. మోదీ, అమిత్‌షా లాంటి వాళ్లను ఎదుర్కోవడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. దేశానికి ఉజ్వల భవిష్యత్ ఇవ్వడం కేసీఆర్‌తోనే అవుతుంది. దేశంలోని రైతాంగం కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నది. ఇంతటి గొప్ప నాయకుడు తెలంగాణ నుంచి ఎదుగటం గొప్ప విషయం.
-ఎండీ హబీబ్, వంగపల్లి, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
దేశాభివృద్ధి కోసం కేసీఆర్
సీఎం కేసీఆర్ దూరదృష్టిగల నాయకత్వం దేశానికి అవసరం. ఉచితాలు వద్దు అంటున్న మోదీ ప్రభుత్వం కావాలా.. సంక్షేమ పథకాల తో అన్ని వర్గాలను అక్కున చేర్చుకొనే నేత కావాలా అనే చర్చ దేశంలో సాగుతున్నది.
– మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీని బొందపెట్టే సత్తా..
దేశానికి ద్రోహం చేసే బీజేని బొందపెట్టే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉన్నదని దేశ ప్రజలు గుర్తించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు, మోదీని ఎదుర్కొనే నాయకుడు. దేశం బాగుపడాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
ప్రజలే కేంద్రంగా సుపరిపాలన
దేశమంతా అబ్బురపడే పాలన అందిస్తున్న కేసీఆర్ వస్తే తమ జీవితాలు కూడా బాగుపడతాయని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వంటి ఆదర్శపాలన సాగాలి, దానికి కేసీఆర్ నాయకత్వం వహించాలి.
– పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు
అణగారిన వర్గాల అభ్యున్నతికి
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దళితబంధు పథకం దేశమంతా విస్తరించాలని దళితమేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్‌తోనే అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.
– గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు
సింగరేణి బంగారం జాతిసిగలో
సింగరేణి బంగారు సిరులు జాతిసిగలో మెరవాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. నష్టాల్లో నడిచే సింగరేణి కేసీఆర్ నాయకత్వంలో లాభాల్లో దూసుకుపోతున్నది. సింగరేణి, కోల్ ఇండియాలను సీఎం కేసీఆర్ మాత్రమే రక్షించగలరు.
– గండ్ర జ్యోతిరెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు
పచ్చని పంటలతో దేశం..
కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశ సాగునీటి ముఖచిత్రం మార్చాలి. పచ్చని పంటలతో దేశం తులతూగాలి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలో కేసీఆర్ తమ ప్రాంతానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
– కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
జాతీయ రాజకీయాల్లో కీలకం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రావడం ఎంతో ఆనందంగా ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపి కేసీఆర్ వెంట నడుస్తాం. సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం.
– కుసుమ జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు, ములుగు
రాజకీయ విప్లవం
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే రాజకీయ విప్లవం వస్తుంది. కేసీఆర్ వ్యూహచతురతతో దేశగతిని మార్చగలరన్న విశ్వాసం ప్రజల్లో నెలకొన్నది.
– పాగాల సంపత్‌రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు
పొరుగు రాష్ర్టాల కన్నీళ్లు తుడిచిన నేత కేసీఆర్
హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతిరూపంగా.. గంగాజమునా తెహజీబ్ మాడల్ దేశానికి అవసరమని దేశ ప్రజలు గుర్తించారు. గుజరాత్ మాడల్ అంటే అదానీ, అంబానీలు దోచుకునే మాడల్‌గా మారింది. జై జవాన్…జై కిసాన్ నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్ మాడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– ముజీబ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
వికాసం వైపు దేశం
దేశ ప్రతిష్టను దిగజార్చిన మోదీని సాగనంపి సరికొత్త దశదిశను ఇచ్చే కేసీఆర్ లాంటి నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశంలో సుపరిపాలన కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. కేసీఆర్ నిర్ణయం కోసం దేశమంతా ఆసక్తి నెలకొన్నది.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
ఆశావహ వాతావరణం
దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలిపే విజన్ ఉన్న నేత కేసీఆర్. దేశంలోని వనరులను అద్భుతంగా వినియోగిస్తే దేశం ప్రపంచానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదుగుతుందన్న కేసీఆర్ మాటలపై దేశమంతా ఆశావహ వాతావరణం నెలకొన్నది.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ప్రజాస్వామ్య పరిరక్షణ
దేశభవిష్యత్తును ప్రమాదంలో పడేసిన మోదీని, బీజేపీని తరిమికొట్టగల నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి కేసీఆర్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. సమైక్య విలువలను కాలరాచిన మోదీని, బీజేపీ పాలనను హిందూమహాసముద్రంలో విసిరేయాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
-తాతా మధు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
చేతల ప్రభుత్వం కావాలి
బీజేపీ మత విద్వేషాలను కూకటివేళ్లతో పెకిలించి వేయగల నాయకుడు దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమే. మోదీది మాటల ప్రభుత్వమైతే కేసీఆర్‌ది చేతల ప్రభుత్వమని తేలిపోయింది., దేశ ప్రజలు చేతల ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
విషం కక్కే బీజేపీకి విరుగుడు మంత్రం
దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల మధ్యన చిచ్చుపెడుతున్న బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే అందుకు సీఎం కేసీఆరే సరైన నాయకుడు. మోదీ పాలనలో అన్ని వర్గాలు సతమతమవుతున్నాయి. అందరి సంక్షేమం కోసం పాటుపడే సీఎం కేసీఆర్ నాయకత్వం, దక్షత దేశానికి అవసరం.
-ఆరూరి రమేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు
బంగారు దేశం కావడం ఖాయం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశం బంగారు దేశంగా మారుతుంది… దేశంలోని పేదలకు కూడా మంచిరోజులొస్తయ్. తెలంగాణల అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ మంచిగ చేస్తుండు.. తరువాత దేశంల గూడ అందరూ బాగుపడతరు. పింఛన్లు పెంచినంక ముసలోల్లకు సుకూనుంది. రైతులకు గూడ మంచిగ చేస్తుండు. దేశంల కూడా మత, కుల పిచ్చి పోయి అందరు సుఖంగ ఉండే రోజులొస్తయ్. కేసీఆర్ సార్‌కు తెలంగాణల అన్ని వర్గాల మద్దతు ఉంది. అట్లనే దేశంల కూడా ఇక్కడి పథకాలు తెలుసుకాబట్టి ఆయనకు ఎటువంటి డోకా ఉండదు.
– మల్లికార్జున్, టీ కొట్టు యజమాని,తాండూరు
దేశమంతా సుస్థిర పాలన
తెలంగాణలో రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు, బీమా, 24 గంటల కరెంట్, ఊరూరా కొనుగోలు కేంద్రాలను చూసి ఇతర రాష్ర్టాల రైతులంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నరు. ఇక్కడ వ్యవసాయం పండగలా సాగుతుంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతు సంక్షేమ పథకాలేవీ అమలైతలేవు.
– విద్యాసాగర్‌రావు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
జాతీయ రాజకీయాల్లో మలుపు
కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారు. కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యం. కేసీఆర్‌తో వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు మలుపు తిరగడం ఖాయం. ఎంతో పరిణితి కలిగిన ఉద్యమనేత జాతీయ రాజకీయాల్లో రావాలన్న డిమాండ్లు ఇప్పటికి నిజం కాబోతున్నాయి.
– లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ చక్రం తిప్పాలి
బీజేపీ, మోదీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ, సంపన్న వర్గాల కొమ్ముకాస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బీజేపీనీ గద్దె దింపడానికి దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలి. ఇందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
– గట్టు యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు
రైతు రాజ్యం రావాలి..
దేశంలో రైతు రాజ్యం రావాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. అది కేసీఆర్ ఒకరి ద్వారానే సాధ్యమవుతుంది. బీజేపీ నాయకులు చెబుతున్నట్టుగా డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మా అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు తప్పకుండా విజయం సాధిస్తారు.
– రాజేందర్‌రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు
దార్శనిక నేత
విజన్ ఉన్న నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ ప్రజల రాత మారుతుంది. బీజే పీ పాలనలో కుదేలైన వ్యవసాయ రంగం ఊపిరిపోసుకుంటుంది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు.
-రేగా కాంతారావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
సమర్థుడైన పాలకుడు
దేశ అభివృద్ధిని దిగజార్చిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే సమర్థుడు సీఎం కేసీఆర్. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ప్రజల సమస్యలపై గొంతెత్తి నిలదీసే సత్తా ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్లడం శుభ పరిణామం.
– రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్‌తోనే దేశం బాగుపడుతది
ఎనిమిదేండ్లలో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి చెందిందంటే ప్రధాన కారణం సీఎం కేసీఆర్ సుపరిపాలనే.. దేశంలో కూడా ఇలాంటి పెనుమార్పు కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. జాతీయస్థాయిలో లీడ్ చేసే సరైన వ్యక్తి లేక ఆయా రాష్ర్టాల్లోని ప్రజలు, నాయకులు సరైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి దశలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం.. సరైన నాయకత్వం కోసం ఎదురు చూసిన వారందరికీ గొప్ప అండ లభించినట్లవుతుంది.
-నవీన్, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు, ధర్పల్లి, నిజామాబాద్ జిల్లా
దేశ నాయకత్వాన్ని కేసీఆర్ తీసుకోవాలి
మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో అమలైతేనే బడుగు, బలహీన వర్గాల బతుకులు బాగుపడుతాయి. ఇందుకోసం దేశ నాయకత్వాన్ని కేసీఆర్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో దేశంలో కేవలం సంపన్న వర్గాలకే మేలు జరిగింది. పేద, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడ్డాయి.
-విఠల్‌రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
దేశంలో మార్పు తథ్యం..
కేంద్రంలో బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారి పేదలు, రైతులు, కార్మికులు, ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశానికి నాయకత్వం వహించడం ఎంతో అవసరం. రాష్ట్రంలో ఐదేండ్లలో మార్పు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ దేశాన్ని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించగలరు.
– జోగు రామన్న, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
ప్రజల సంక్షేమానికి..
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలి. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో రాణించే సామర్థ్యం ఉంది.
-కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్‌తో దేశం అభివృద్ధి
అపార రాజకీయ పరిజ్ఞానం, విశేష పాలనాదక్షత ఉన్న సీఎం కేసీఆర్‌తో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయత్వం వహించాల్సిందేనని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.
-తోట ఆగయ్య, రాజన్న సిరిసిల్లా అధ్యక్షుడు
సారునే కోరుకుంటున్నరు
జనం సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిష్కరించడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా దేశాన్ని కూడా సంక్షేమ, అభివృద్ధి పథంలోకి తేవాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం.
-కంచర్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు
మినీ ఇండియా అనుభవం మెగా ఇండియాను మెరిపిస్తుంది
హైదరాబాద్‌లో అన్ని రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్న విషయాన్ని దేశం గమనిస్తున్నది. మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ మాడల్ దేశానికి అవసరం. తెలంగాణను నడిపించినట్టే దేశాన్ని నడిపించాలని దేశమంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నది.
-శంబీపూర్ రాజు, మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు,
కరీంనగర్ నుంచే మరో గర్జన
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తరువాత దేశానికి నాయకత్వం వహించే తెలంగాణ వ్యక్తిని సీఎం కేసీఆర్ రూపంలో దేశం చూడబోతున్నది. తెలంగాణ ఉద్యమాన్ని కరీంనగర్ గడ్డ నుంచి సింహగర్జన చేసి ప్రారంభించినట్టే దేశ రాజకీయాల్లో అడుగుపెట్టేముందు ఇక్కడే బహిరంగ సభ నిర్వహించాలి.
– రామకృష్ణారావు,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు