రంగారెడ్డి : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. మన ఐక్యత దెబ్బతిన్ననాడు, మత శక్తుల పిచ్చికి లోనయిన్పపుడు, మనం చెదిరిపోయిన్నాడు మళ్లీ పాత తెలంగాణలాగా తయారవుతాం. బతుకులు ఆగం అవుతాయి. వీళ్లు ఎక్కడా ఉద్దరించింది లేదు. కుట్రలకు కాలు దువ్వుతున్నారు. స్వార్థ, నీచ, మతపిచ్చిగాళ్లను మనం ఎక్కడికక్కడ తరిమికొట్టాలి. అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
మతపిచ్చికి లోనైతే ఒక వంద సంవత్సరాలు తెలంగాణ, భారతదేశం ఆగమైతది. ఒక్కసారి దెబ్బతింటే.. విభజన వస్తే సమాజానికి మంచిది కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రేమతో, గౌరవంతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతది. కానీ కర్ఫ్యూలతో, లాఠీఛార్జీలతో, కోపంతో, అసహ్యాంతో ఏ సమాజం కూడా పురోగమించిన దాఖలాలు లేవు. అలాంటి దానికి మన రాష్ట్రం బలికావొద్దని, ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలి. శాంతియుత తెలంగాణకు నడుం కట్టాలి. దానికోసం మనందరం ముందుకు పోవాలి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి. రంగారెడ్డి జిల్లా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి అగ్రభాగాన ఉండాలని కేసీఆర్ కోరారు.