శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 01:55:12

విద్రోహులారా.. ఖబడ్దార్‌

విద్రోహులారా.. ఖబడ్దార్‌

  • హైదరాబాద్‌లో కల్లోలానికి పెను కుట్ర
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపే పన్నాగం
  • ప్రశాంతత విషయంలో రాజీలేదు
  • పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ
  • సీఎం వెల్లడి.. శాంతిభద్రతలపై సమీక్ష
  • రెచ్చగొడితే యువత రెచ్చిపోవద్దని హితవు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని గత కొన్నిరోజులుగా పేట్రేగిపోతున్న మతోన్మాదులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలను సాగనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొన్నారు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలతో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే నేతల పట్ల ప్రజలు.. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  సురక్షిత నగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన హైదరాబాద్‌ను కల్లోలపరచడానికి జరుగుతున్న కుట్రలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు.  

ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకొన్నాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని నిబద్ధతతో పనిచేసి రాష్ర్టాన్ని ఓ దరికి తెచ్చాం. నేడు హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరిపని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరానికి సేఫ్‌ సిటీ అనే మంచిపేరు వచ్చింది. పెద్దఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయి. దాదాపు 1.60 కోట్ల జనాభా ఉన్నది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటమే ముఖ్యం. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం. అందుకోసం ఎంతటివారినైనా, అధికార పార్టీ నేతలనైనా వదిలే ప్రసక్తే లేదు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తీవ్ర నిరాశానిస్పృహలో ఉన్న కొన్ని అరాచకశక్తులు హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయని, వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచకశక్తుల కుట్రలపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నదని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకొనే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు

‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు చాలా కుట్రలుచేస్తున్నారు. మొదట సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపుచర్యలకు పూనుకొన్నారు. సహజంగానే శాంతికాముకులైన హైదరాబాద్‌ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోవడంలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలనుంచి స్పందన రావడంలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్‌లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారుతున్నారు. 

రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారంచేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఏదో ఒకచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతంరంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. 

పెద్దఎత్తున గొడవలుచేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండాచేయాలని, ఎన్నికలు వాయిదావేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

శాంతి పరిరక్షణకే ప్రాధాన్యం

‘హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయొద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకొన్నాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని నిబద్ధతతో పనిచేసి రాష్ర్టాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబాలాంటి మహమ్మారులను దూరంచేశాం. సంఘవిద్రోహ శక్తుల పట్ల, మాఫియా పట్ల, విచ్ఛిన్న శక్తుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకొన్న చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. శాంతిభద్రతలను కాపాడే విషయంలో, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో ప్రభుత్వం మొదటినుంచి రాజీలేని ధోరణి అవలంబిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరిపని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరానికి సేఫ్‌ సిటీ అనే మంచిపేరు వచ్చింది. పెద్దఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయి. యువతకు ఉపాధి దొరుకుతున్నది. 

హైదరాబాద్‌ మహానగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 1.60 కోట్ల జనాభా ఉన్నది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటమే ముఖ్యం. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం. 

ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడమే ముఖ్యం. ప్రశాంత హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మతఘర్షణలు పెట్టి, రాజకీయ లబ్ధి పొందాలని కొందరు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌ నగర ప్రశాంతతను పణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికారపార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’ అని సీఎం పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు అంజనీకుమార్‌, వీసీ సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, అడిషనల్‌ డీజీపీ జితేందర్‌, ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, వై నాగిరెడ్డి, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, వరంగల్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

కుట్రలను సాగనీయం: పోలీసు అధికారులు

పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘవిద్రోహ శక్తుల కుట్రలు భగ్నంచేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరుగకుండా చూస్తామని స్పష్టంచేశారు. 


అప్రమత్తంగా ఉండాలి

ప్రశాంత హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలుచేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయపార్టీలను కోరారు. 

‘హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయొద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకొన్నాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని నిబద్ధతతో పనిచేసి రాష్ర్టాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. 

మొదట సోషల్‌

మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపుచర్యలకు పూనుకొన్నారు. సహజంగానే శాంతికాముకులైన హైదరాబాద్‌ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోవడంలేదు. 

దాంతో..

నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట, వీలైతే హైదరాబాద్‌లోనే గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు.పౌరులు జాగ్రత్తగా ఉండాలి..



logo