CM KCR | హైదరాబాద్ : ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతి విశిష్టమైంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు( Iftar Party )లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 9 ఏండ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు. తలసరి ఆదాయం తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. మనం అభివృద్ధి చెందుతున్నంతగా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నాం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఘనస్వాగతం లభించింది. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.