CM KCR | ఖమ్మం : పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే, నియోజకవర్గానికి మొత్తం దళితబంధు తీసుకొచ్చే బాధ్యత తనది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దళిత మిత్రులకు నమవి చేస్తున్నా. పాలేరు నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు.. మాకు దళితబంధు ఇవ్వాలని ఉపేందర్ రెడ్డి అడిగారు. ఉపేరంద్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపించుకుంటే.. మొత్తం నియోజకవర్గానికి దళితబంధు పెట్టించే బాధ్యత నాది. నేనే స్వయంగా వచ్చి హుజురాబాద్లో మాదిరిగానే ఈ పథకాన్ని అమలు చేస్తాను. ఈ కోట్లు, నోట్లు పట్టుకువచ్చేతోడు ఏం చేయడు. అదే దళితబంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు వస్తాయి. దళిత సమాజం ఆలోచించాలి. ఈ దేశంలో ఒక్క నాయకుడైనా.. ప్రధాని కానీ, సీఎం కానీ దళితబంధు గురించి ఆలోచించారా..? ఎవరి కన్నా బుర్రకు వచ్చిందా..? తరతరాల నుంచి అన్యాయానికి గురైన దళిత బిడ్డలు ముందుకు రావాలని చెప్పి దళితబంధు తీసుకొచ్చాం. దశలవారీగా అయినా సరే చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీకి పంపించండి.. దళితబంధు తీసుకొచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.