హుజూరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. హుజూరాబాద్ సభలో భారతీయ జనతాపార్టీపై విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. బీజేపీకి ఓటేస్తే మురిగిపోతుందని హెచ్చరించారు.
‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణకు కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను గానీ, ఒక్క మెడికల్ కాలేజీని గానీ కేటాయించలేదు. మనకు ఒక్క స్కూల్‌ను, కాలేజీని ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టనని తెగేసి చెప్పినందుకు మోదీ సర్కారు ఏటా రూ.5 వేల కోట్ల నిధుల కోత పెట్టింది. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల నిధులు నష్టపోయాం. అలాంటి బీజేపీకి మనం ఓటెందుకు వెయాలె. కౌశిక్ రెడ్డి వాళ్ల నాయిన.. ఈటల రాజేందర్ కూడా లేనినాడు తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండా మోసిన వ్యక్తి. ఇది మీ అందరికి గూడా తెలుసు. కౌశిక్‌రెడ్డి గెలిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతది’ అని సీఎం చెప్పారు.
‘కౌశిక్ రెడ్డి నాకు కొడుకు లాంటి వాడు. హైదరాబాద్‌లో నాతోపాటే ఉంటడు. ఇయ్యాల మామూలు ఎమ్మెల్సీగా లేడు. విప్‌గా కూడా ఉన్నడు. రేపు గెలిస్తే మీ అందరికీ బ్రహ్మాండంగా సేవ చేయగలుగుతడు. బ్రహ్మాండమైన పనులు జరుగుతయ్. కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్‌కు అన్ని రకాలుగా అండదండగ నేనుంటా. నియోజకవర్గంలో కొన్ని మండలాలు కావాలని కౌశిక్‌రెడ్డి నన్ను అడిగిండు. ఇంక కొన్ని పనుల గురించి చెప్పిండు. అవన్నీ గొంతెమ్మ కోరికలు ఏం గాదు. అన్నీ కాదగినయే. కాబట్టి కౌశిక్‌రెడ్డిని గెలిపించండి నేను పర్సనల్‌గా బాధ్యత తీసుకుని ఆ పనులన్నీ చేయిస్తా’ అని సీఎం హామీ ఇచ్చారు.
పాలిచ్చే బర్రెను ఇడిసిపెట్టి దున్నపోతును తెచ్చుకుంటడా ఎవడన్నా..?
‘మంచివైపు పోతే మంచి జరుగుతది. చెడువైపు పోతే చెడు జరుగుతది. కాబట్టి మీ అందరిని కోరేది ఒక్కటే. గతంలో ఒకసారి మీరు నన్ను బాధపెట్టిండ్రు. పర్వాలేదు. ఆ రోజున అట్ల జరిగిపోయింది. ఇప్పుడు మళ్లా అట్ల జరగడానికి వీల్లేదు. నల్లదేదో.. తెల్లదేదో మీకు తెలిసిపోయింది. పాలిచ్చే బర్రెను ఇడిసిపెట్టి దున్నపోతును తెచ్చుకుంటడా ఎవడన్నా..? మరె ఏం జేస్తరో మీరు ఆలోచన చేసి కౌశిక్‌రెడ్డిని గెలిపించండి. నేను అన్ని రకాలుగా అండదండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఈసారి కౌశిక్‌రెడ్డి గెలుస్తడని రిపోర్టులు చెప్తున్నయ్. కాబట్టి మీరందరూ కౌశిక్‌రెడ్డికి ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా’ అని సీఎం అన్నారు.