CM KCR | హైదరాబాద్ : మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చేరికతో పార్టీకి బలం చేకూరిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ అన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ కోసం నాగం జనార్ధన్ రెడ్డి పోరాటం చేశారని కేసీఆర్ తెలిపారు. 1969 ఉద్యమంలో పోరాటం చేసి నాగం జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అనేక పోరాటాల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ పదేండ్లలో అద్భుతంగా పురోగమించాం. తెలంగాణ గురించి పోరాడిన వారు.. తెలంగాణ భవిష్యత్ కోసం మీరు తోడుగా రావాలని నాగంను కోరితే పార్టీలో చేరారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులకు మనవి.. ఇప్పుడు నాగం మనకు మంచి అసెట్. వారి సలహాలు, సూచనలు తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 గెలిచే విధంగా కలిసి పని చేయాలి. రాబోయే రోజుల్లో మళ్లీ కలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్‌కు మనవి చేస్తున్నా. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వారి అనుచరులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. పాత కొత్త కలిసి కొత్త శక్తితో ముందుకు పురోగమించాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది అని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగతి సాధించింది. కొన్ని వ్యతిరేక శక్తులు ఉంటాయి. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారు. భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పింది. సేఫ్‌గా ఉన్నాడు. హేయమైన దాడులు సరికాదు. మీరంతా తగిన బుద్ధి చెప్పాలి. అద్భుతమైన విజయం సాధించాలి. ఐకమత్యంతో ముందుకు పోవాలని కోరుతున్నాను అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.