CM KCR | వనపర్తి : తెలంగాణలోని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి పంపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దాన్ని అక్కడ పెట్టుకుని కూర్చున్నది తప్ప.. చేయడం లేదు. ఈసారి కూడా కచ్చితంగా వాల్మీకి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తదని కేసీఆర్ హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతాంగం, ముస్లిం, దళిత వర్గం ఒకటే ఆలోచించాలి.. ముస్లింలను, దళితులను ఓటు బ్యంకుగా వాడుకొని పేదవాళ్లను చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో స్థాపించిన గురుకులాల నుంచి వజ్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. అన్ని వర్గాలకు గురుకులాలు పెట్టుకున్నాం. అగ్రవర్ణ పేదలకు పెట్టాలని మేనిఫెస్టోలో ప్రకటన చేశాం అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణను ఒక పూల పొదరిల్లు మాదిరిగా తయారు చేశాం అని కేసీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ఇదే జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్లేవారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. మేం బాధ్యతగా ఒక సంసారం ఎలా చేస్తరో పద్దతిగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని, రూపాయికి రూపాయి కూడబెట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల కోసం పిచ్చి మాటలు మాట్లాడలేదు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. ఆగమాగం చేయలేదు. రూ. 1000తో పెన్షన్లు ప్రారంభించాం. ఆ తర్వాత రూ. 2 వేలు చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ చేస్తామని చెప్పాం. ఒకటేసారి చేస్తామని అబద్దాలు చెప్పం. ఓట్ల కోసం అడ్డం పొడవు మాట్లాడం. అధికారంలోకి రాగానే రూ. 3 వేలు చేస్తాం. ఆ తర్వాత ఏడాదికి రూ. ఐదువందలు పెంచుకుంటూ రూ. 5 వేలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.
రైతులకు ఉల్టా ఏ ప్రభుత్వం పైసలు ఇవ్వలేదు.. రైతుబంధు అనే పదాన్ని పుట్టించినవాడే కేసీఆర్ అని సీఎం తెలిపారు. నాకు కూడా వ్యవసాయం ఉంది. వ్యవసాయం బాధలేందో మాకు తెలుసు. రైతులకు ప్రభుత్వ సహకారం ఉండాలని చెప్పి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుల కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుంది. రాయి ఏందో రత్నం ఏందో మీకు తెలుసు. ప్రభుత్వం దగ్గర రైతుల భూముల అధికారం ఉండే. అంటే వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి వద్ద అధికారాలు ఉండే. కానీ ఇవాళ మీ బొటనవేలితో మీ భూమి హక్కు మారుతుంది. ఇంతకుముందు రైతు బతుకు ఘోరంగా ఉండే. ఇవాళ ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ధరణి కోసం రెండేండ్లు కష్టపడ్డాం. దయచేసి రైతులు ఆలోచించాలి. ధరణి లేకపోతే కోర్టు కేసులు, హత్యలు జరిగేవి. ధరణి వల్ల సమాజం ప్రశాంతంగా ఉంది. ఆలోచించాలి. ఇలా అనేక విషయాలు మీ కండ్ల ముందున్నాయి. దళితబంధు పుట్టించిందే కేసీఆర్. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వనపర్తికి పశు వైద్యకాలేజీ, బైపాస్ రోడ్డు, ఇతర సదుపాయాలు కల్పిస్తాం. అవన్నీ జరిగిపోతాయి. జిల్లా కేంద్రమే అయిపోయింది. నీళ్ల నిరంజనుడు కడుపు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చారు. గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతోంది. నిరంజన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలి. భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.