CM KCR | పూటపూటకో పార్టీ మారేవారికి అవకాశం ఇస్తే ప్రజలు ఓడిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేరు ప్రజలను కోరేది ఒకటే.. ఎవరి వైఖరి ఏంటో గమనించి ఓటింగ్‌లో పాల్గొనాలి. ఎవరో చెప్పారనో.. ఎవరో ఏదో ఇచ్చిండని మోసపోయి ఓట్లు వేయద్దు’ అని పిలుపునిచ్చారు.
అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వాళ్ల పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి మాటకూడా మార్చేవారు మనమధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ గవర్నమెంట్ ఏం చేసింది.. ప్రజల కోసం ఆలోచించింది.. మళ్లీ మేనిఫెస్టో.. వాగ్ధానం ప్రజల ముందుపెట్టింది ఆలోచించి ఓటు వేయాలి. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం. కమ్యూనిస్టులు చాలాకాలం ఎమ్మెల్యేలుగా ఉన్న పని చేసిన ప్రాంతం. ఉద్యమాలు జరిగిన ప్రాంతం. నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో, ప్రజల కోసం.. ప్రజల బాగు కోసం.. కులం, మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పని చేశారో వారిని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తరు తప్పా.. డబ్బు కట్టల అహంకారంతో వచ్చేవాళ్లకు, పిచ్చి రాజకీయాలతో వచ్చేవాళ్లకో.. మాటలు మార్చేవారికో.. పూటపూటకో పార్టీలు మారేవారికి అవకాశం ఇస్తే.. వాళ్లు గెలస్తురు తప్పా ప్రజలు ఓడిపోతారు’ అన్నారు.
‘ఎన్నికల్లో క్వాలిటీ రావాలి. ప్రజాస్వామ్యంలో నీతి, నిజాయితీకి పట్టంకట్టే పరిస్థితి రావాలి. అప్పుడు ప్రజలకు వాస్తవమైన సేవ, లాభం జరుగుతుంది. విజ్ఞతతో ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచించాలి. తెలంగాణలో సంక్షేమం ప్రారంభించాం తెలంగాణలో.. పెన్షన్లు గతంలో తెలంగాణలో 70, 40, 200 ఉండేది. మనం మొదట వెయ్యి తర్వాత రూ.2వేలు చేసుకున్నాం. మొన్న ప్రకటించుకున్నాం. ఈ దఫా గెలిపించిన తర్వాత రూ.3వేలకు పెంచుకొని.. రూ.5వేలకు పెంచుతామని ప్రకటించడం జరిగింది. ఎన్నికల కోసం అఘాతం.. జగన్నాథం హామీలు నేను ఇవ్వడం లేదు. తెలంగాణ సంపద ఎట్లెట్ల పెరిగితే.. ఆర్థికంగా బలోపేతం అయితే.. అది ప్రజలకే పంచాలి.. ప్రజల సొత్తు కాబట్టి. ప్రజలకు పంచాలనే విధానంతో ముందుకెళ్తున్నాం’ అన్నారు.
‘కల్యాణలక్ష్మిని మొదట రూ.50వేలతో పెట్టుకున్నాం. తర్వాత రూ.75వేలు.. మళ్లీ రూ.లక్షా16లకు తీసుకుపోయాం. సంపద పెరిగిన కొద్ది అట్లట్ల చేసుకుంటామని చెప్పాం. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకు ముందు రైతులను పట్టించుకున్నోడు లేడు. రైతు సచ్చినా.. బతికినా అవస్థలను పట్టించుకున్న వారు లేరు. కో ఆపరేటివ్ లోన్ కట్టలేదనో.. ఇంకో లోన్ కట్టలేదనో.. దర్వాజలు తీసుకుపోయారు తప్పా.. రైతులకు ఏ ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. నీటి తీరువాలు వసూలు చేశారు. కరెంటు బిల్లులు వసూలు చేశారు. మోటార్లు కాలిపోతే మనదిక్కు చూడలేదు. గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. ఇవాళ వ్యవసాయరంగం.. రైతాంగం.. ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని.. రైతు సంక్షేమం జరగాలని పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం.