హైదరాబాద్, జనవరి14 : రాష్ట్ర ప్రజలకు, రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని సంతోషం వ్యక్తంచేశారు. పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పండుగ వాతావరణం నెలకొల్పినట్టు తెలిపారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభు త్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థంగా ఎదురొంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
సుఖసంతోషాలతో విరాజిల్లాలి
గవర్నర్, మంత్రుల సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలని కోరారు. ప్రతి ఇల్లూ సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని కాంక్షిస్తూ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.