హైదరాబాద్ : బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయన్నారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని అన్నారు. చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలోనూ అలానే చేశామని, ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు.
తాము ఎన్నికలను పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక టాస్క్ అని సీఎం కేసీఆర్ అన్నారు. పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. భూపాలపల్లిలో వెంకట్రమణారెడ్డికి సీటు ఇస్తామంటే మధుసూదనాచారి అండదండగా ఉంటామన్నారు. తాండూరులోనూ పైలట్ రోహిత్‌రెడ్డికి ఇస్తామంటే మహేందర్‌రెడ్డి మద్దతిచ్చారని అన్నారు.
ఉన్నంతలో అన్ని సర్దుబాట్లు చేసుకుని ఎలాంటి వివాదాలకు తావులేకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేశామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా టికెట్లు వచ్చిన వాళ్లందరికీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. జాబితాలో ఉన్నవారందరూ ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి గుర్తింపు ఇచ్చి సీట్లు ఖరారు చేశామన్నారు. టికెట్లు వచ్చిన అభ్యర్థులందరూ అద్భుత విజయం సాధిస్తారని, సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.