CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సంపద పెంచి.. పేదలకు పంచడమే బీఆర్ఎస్ సర్కారు విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో 90 శాతానికిపైగా ఎన్నికల ప్రణాళికలో లేనివేనని తెలిపారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను 99.99 శాతం అమలు చేస్తూనే, ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. గత పాలసీలన్నీ ఇక ముందూ కొనసాగిస్తామని .. వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కొత్త పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. గత పథకాల విశిష్టతలను, సాధించిన ఫలితాలను వివరించారు. కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాల ప్రాధాన్యతను స్కీముల వారీగా తెలిపారు. అవి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే..
బీసీ వృత్తి పనివారికి చాలా చక్కగా సహకారం అందిస్తున్నాం. చదువుకునే పిల్లలు చదువుకుంటున్నారు. విద్యాలయాలు, స్కాలర్షిప్లు అందిస్తున్నాం. గొర్లపంపిణీ, చేపల పంపిణీలో రికార్డు సృష్టించాం. ఒకనాడు తెలంగాణకు ప్రతి రోజూ 16 వేల గొర్రెలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతయ్యేవి. ఈ రోజు ఆ పరిస్థితి తారుమారైంది. ఇవాళ తెలంగాణ భౌగోళికంగా చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ర్టాలను తలదన్నేలా మాంసం ఉత్పత్తిలో నంబర్ 1 స్థాయికి ఎదిగింది. అదే పద్ధతిలో రూ.33 వేల కోట్ల విలువైన చేపలు ఉత్పత్తి చేసి ముదిరాజ్, గంగపుత్ర సోదరులు ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతున్నారు. భవిష్యత్తులో కూడా వారికి కావాల్సిన సహాయం అందిస్తా. ఈ మధ్యనే విశ్వకర్మలు, రజకులు, నాయీబ్రాహ్మణులు, భవన నిర్మాణ కార్మికులకు కుటుంబానికి రూ.లక్ష అందించే కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో కూడా అవన్నీ యథావిధంగా కొనసాగుతాయి.
తెలంగాణ ఏర్పాటునాటికి తాగునీరు, సాగునీరులేక కరువుతో అల్లాడుతూ, వలసలపాలై, బతుకుదెరువు కోసం అన్నమో రామచంద్రా అని దేశం నలమూలలకు లక్షల మంది తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొనిపోయిన పరిస్థితులు చాలా హృదయవిదారకంగా ఉండె. కరెంటు లేదు.. ఇరిగేషన్ సౌకర్యం లేదు.. కొత్త రాష్ట్రం.. కొత్తకుండలో ఈగ జొచ్చిన పరిస్థితి. తెలంగాణ అసలు ఆదాయ వ్యయాలు అంచనా లేకుండె. కొత్త రాష్ట్రంలో ఏ రకమైన ట్రెండ్స్ ఉంటాయి? పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? దేశ వ్యవస్థ, అంతర్జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? అనేవి తెలియవు. అలాంటి పరిస్థితుల్లో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సలహాదారుగా ఉన్న ఆర్థిక నిపుణుడు, మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ జీఆర్ రెడ్డి, బీపీఆర్ విఠల్ వంటి అనేక మంది ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి, 2-3 నెలలు మేధోమథనం చేశాం. కొత్త రాష్ట్రం ప్రయాణం, ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ఎక్కడికి చేరుకోవాలి? ఏ దశకు ఏ పరిస్థితులు రావాలి? అనే అంచనా వేసుకుని తెలంగాణ ప్రయాణాన్ని ప్రారంభించినం.
బీఆర్ఎస్ పార్టీ క్యారెక్టర్ ఏమింటంటే.. 2014లో, 2018 ఏదయినా కావచ్చు.. మ్యానిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికల రూపంలో చెప్పింది 10 శాతమే. ఆచరణలోకి తీసుకొచ్చిన పథకాలు 90 శాతం. మ్యానిఫెస్టోలో లేనివాటిని.. ఎప్పటికప్పుడు పరిపాలన క్రమంలో ఎదురవుతున్న అనుభవాలను, స్వీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం. అందుకు కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతుబంధు, రైతుబీమా, విదేశీ విద్య స్కాలర్షిప్స్.. ఇట్లాంటి ఎన్నో పథకాలు ఇందుకు నిదర్శనం. ఏ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఆ పథకాలను ప్రకటించలేదు. కానీ మేం పరిపాలన క్రమంలో క్రోడికరించుకొని విధాన నిర్ణయాలు తీసుకొని గత పది సంవత్సరాల్లో మ్యానిఫెస్టోల్లో ప్రకటించనివే 90 శాతం అమలుచేశాం. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న దళితులు, గిరిజన సోదరులు, మైనార్టీలు, 50 శాతం జనాభా ఉండి వృతి పనులను తమ బాధ్యతగా స్వీకరించిన బీసీ కులాల అవసరాలు, ఆశలు దృష్టిలో పెట్టుకుని పనిచేశాం. మాకన్నా ముందు 10 ఏండ్లు పాటించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీల కోసం రూ.970 కోట్లు ఖర్చు పెడితే, మేం తొమ్మిదిన్నరేండ్లలో మేం రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. మైనార్టీలకు అమలు చేస్తున్న పథకాలన్నీ మ్యానిఫెస్టోలో లేనివే. ఎప్పటికప్పుడు మైనార్టీలను సంప్రదిస్తూ అమలు చేస్తున్నవే.
పదేండ్లలో మేం రూపొందించిన, పెంచిపోషించిన గంగా జమున తెహజీబ్ సంస్కృతి బీఆర్ఎస్ విజయాల్లో అన్నింటికంటే గొప్పది. తెలంగాణ ఒక సెక్యులర్ సమాజంగా ఉండాలనే పట్టుదలతో చాలా డీసెంట్‌గా, ఒక్క మతకల్లోలంగానీ, ఆరాచకం, వేధింపులుగానీ లేకుండా అందరి పండుగలను సమానంగా గౌరవిస్తూ, ప్రభుత్వ పరంగా సహాయం చేస్తూ వస్తున్నాం. దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా చాలా చక్కటి సెక్యులర్ సమాజాన్ని సృష్టించటం మాకు గర్వంగా ఉన్నది. ఎక్కడైతే సమతుల్య అభివృద్ధి ఉంటుందో? ఎక్కడయితే అందరికీ అవకాశాలు లభిస్తాయో అక్కడ అల్లర్లు, గొడవలు, చిల్లర చితకా పంచాయితీలు ఉండవు. అందుకు నిదర్శనం తెలంగాణ.
పదేండ్లలో ఒక్క చిన్న గొడవ కూడా లేదు. ఇందుకు తెలంగాణలోని అన్ని వర్గాలను అభినందిస్తున్న.. సెల్యూట్ చేస్తున్న. ఈ మధ్యనే వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ రెండు ఒకే రోజు వచ్చాయి. రెండింటినీ ఒకే రోజు నిర్వహించడం బాగుండదని, ముస్లిం సమాజమే ముందుకు వచ్చి మిలాద్ ఉన్ నబీని పోస్ట్‌పోన్ చేసి ప్రపంచానికే గొప్ప ఆదర్శాన్ని అందించినది తెలంగాణ సమాజం. ఈ శాంతి, సహకారం, పరస్పరం గౌరవించుకునే పద్ధతి, పరమత సహనాన్ని పాటించే పద్ధతి ఇలాగే కొనసాగిస్తూ తెలంగాణ సమాజం ముందుకు పోవాలని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆకాంక్షిస్తున్నా. దళిత సోదరుల కోసం పెట్టిన దళితబంధులాంటి పథకాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ భారత ప్రభుత్వమూ అమలు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఈ పాటికే దళితుల పరిస్థితులు మారిపోయేవి. చాలా మేధోమథనం చేసిన తరువాత రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించే దళితబంధును తీసుకొచ్చినం. దానిని అదేవిధంగా కొనసాగిస్తాం. దళిత సమాజం బాగుపడేంతవరకూ అది ఉంటుంది.
రాష్ట్రంలో 11 లక్షల మందికి ఇండ్లులేవని ఇంటింటి సర్వేలో తేలింది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ నిరంతరం కొనసాగుతుంది. డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. దీంతోపాటు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం. జాగాలున్నవారికి గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ, జాగాలు లేనివారికి ప్రభుత్వమే జాగాలు సమకూర్చాలని నిర్ణయించాం. రాబోయే రోజుల్లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకుపోతాం.
ఆదివాసీ గిరిజన సోదరులకు రికార్డు స్థాయిలో వాళ్లు కోరిన రెండు పనులు చేశాం. అర్ధశతాబ్దం నుంచి ఏ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోలేదు. ఎవరూ వారి వినతులను పరిశీలించలేదు. కానీ బీఆర్ఎస్ సర్కారు గోండు, కోయ గూడెలను, లంబాడా తండాలను స్వయం ప్రతిపత్తిగల పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. వాటికి వాళ్లే సర్పంచ్‌లుగా ఉండే అధికారాలిచ్చాం. ఈ రోజు గిరిజన గూడాల్లో స్వయం పాలన నడుస్తున్నది. పోడుభూములను కూడా వారికి పంచివ్వడం జరిగింది. పోడు పంట్టాలను చాలా చక్కటి పద్దతితో ఇవ్వడమేగాకుండా పోడు సందర్భంగా జరిగిన ఘర్షణల వల్ల పోలీసులు పెట్టిన కేసులను ఎత్తేశాం. వెంటనే ఆ భూములకు రైతుబంధు, రైతుబీమా సదుపాయం కల్పించాం. తద్వారా వారు సమున్నతంగా, గౌరవంగా బతుకుతున్నారు. గిరిజన సోదరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. వారికిచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. ఆ ప్రకారంగా భవిష్యత్తులో కూడా వారి అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుంది. ఇదే స్ఫూర్తితో కృషి చేస్తాం.
రెసిడెన్షియల్ స్కూల్స్ మంచిఫలితాలిస్తున్నాయి. అగ్రవర్ణాలవారు కూడా గురుకులాలు కావాలంటున్నారు. అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు (రెసిడెన్షియల్ స్కూల్స్) ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. రెసిడెన్షియల్ విద్యావిధానం సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ విద్యావిధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. చాలాచోట్ల వీటిని ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. వీటిని మరిన్ని పెంచడంతోపాటు రాబోయే రోజుల్లో జూనియర్ కాలేజీలన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలుగా తీర్చిదిద్దాలని, ఇంకా మంచిగా కొనసాగించాలని నిర్ణయించాం.
గత పాలసీలన్నీ కొనసాగిస్తాం
తెలంగాణ ఏర్పడ్డనాడు అలముకున్న పరిస్థితులు తెలుసు. ఈ రోజు అనేక రంగాల్లో, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ఎదిగింది. తలసరి ఆదాయంలో, విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్. ప్రతి ఇంటికి నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు, అవసరమైన వర్గాలకు పంచాలని నిర్ణయించుకున్నాం. దానిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రం ఎదగాలంటే శాంతిభద్రతలు ఉండాలి. బెస్ట్ ఎకనామీ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ తీసుకున్నాం. దాదాపు 50-60 శాతం ప్రజలు నిమగ్నమైనది వ్యవసాయ రంగం. అందులో భారతదేశంలో పంజాబ్‌ను తలదన్ని తెలంగాణ ఎదగడం గొప్ప విషయం. తెలంగాణ ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేస్తూ దేశానికే తలమానికంగా పంటలు సాగుచేస్తున్నారు. గత పదేండ్లలో అమలుచేసిన పథకాలన్నీ ఇకముందు కూడా కొనసాగిస్తాం. వాటికి సందర్భోచిత ఉద్దీపనలు చేస్తాం. ఇప్పుడు కొన్ని విషయాలు కొత్తగా చెప్పాం. బీఆర్ఎస్ తిరిగి గెలిచిన తరువాత ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో మేం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. కొన్ని తెల్లవారే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ హామీలన్నీ అమల్లోకి తెస్తాం.
అసైన్డ్ భూములు గతంలో ఇచ్చారు. వారికి సంపూర్ణ రైట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. భూములకు డిమాండ్ పెరిగింది కాబట్టి వారికి హక్కులు కల్పిస్తే వాటిని అమ్ముకొని మరొకచోట కొనుకున్నే వీలుంటుంది. అసైన్డ్ భూములు కలిగినవారికి ప్రస్తుతం అమ్ముకునే సదుపాయం లేదు. దళితుల నుంచి కూడా ఆంక్షలు తొలగించాలని డిమాండ్స్ వస్తున్నాయి. అందరు దళిత ప్రజాప్రతినిధులతో చర్చించి అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో మరో స్కీమ్ తీసుకురావాలని ఆలోచన చేశాం. ఏటా రాష్ట్రంలో 3 కోట్ల టన్నులకుపైగా ధాన్యం పండుతున్నది. హాస్టళ్లలో పిల్లలకు ఇప్పటికే సన్నబియ్యం పెట్టుకుంటున్నాం. అంగన్వాడీలకు కూడా ఇటీవలే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తాం. ప్రతి రేషన్ కార్డుదారుడికి వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెల నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో ఇక దొడ్డుబియ్యం సమస్య తీరిపోతుంది.
ప్రమాదవశాత్తూ వికలాంగుడైనా, ఆరోగ్యం పాడైన, విధివంచితులు, వృద్ధాప్యం వచ్చినవారు, భర్తలు చనిపోయినవారు, ఒంటరి మహిళలు తదితరులను ఆదుకునేందుకు ఆసరా పెన్షన్ పథకాన్ని రూ.1,000తో ప్రారంభించాం. ఇప్పుడు రూ.2,016 ఇస్తున్నాం. పెరిగిన ఖర్చులకు అనగుణంగా ఇప్పుడు రూ.5,000కు పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలో మార్చి తరువాత రూ.3,000 చేస్తాం. ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ ఐదేండ్లలో రూ.5,000కు పెంచుతాం. ఇలా చేయడంవల్ల ప్రభుత్వంపై ఒకేసారి భారం పడదు. కల్యాణలక్ష్మి పథకం పెట్టిననాడు రూ.50,000తో ప్రారంభించి, రూ.75 వేలకు పెంచాం. ఇప్పుడు రూ.1 లక్షా పదహారు ఇస్తున్నాం. ఆసరా పెన్షన్లకు చాంపియ న్ బీఆర్ఎస్ ప్రభుత్వం. పదుల్లో, వందల్లో ఉ న్న ఈ పథకాన్ని వేలల్లోకి తీసుకెళ్లిన ఏకైక ప్ర భుత్వం బీఆర్ఎస్ సర్కారు. దివ్యాంగుల పెన్షన్‌ను ఇటీవలే రూ.4,016కు పెంచుకున్నాం. దీన్ని రూ. 6,000కు పెంచుతాం. రాష్ట్రంలో రూ.5.35 లక్షల దివ్యాంగులున్నారు. మార్చి తరువాత వీరి పెన్షన్‌ను రూ.5,000కి పెంచు తాం. ఏటా రూ.300 చొప్పున పెంచుకుంటూ ఐదేండ్లలో రూ.6,000కి తీసుకుపోతాం.
హమాలీలు, మిల్లర్లు, ట్రేడర్లు తదితరులకు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి చేరింది. రైతుబంధు పథకం ద్వారా ఖారుకు ఎకరానికి రూ.5,000 చొప్పున ఏటా రూ.10,000 ఇస్తున్నాం. దీనిని దశలవారీగా రూ.16,000కు పెంచుతాం. మొదటి ఏడాది రూ.12,000కు పెంచి ఐదేండ్లలో రూ.16,000లకు చేర్చుతాం. పటిష్ఠమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
సౌభాగ్యలక్ష్మి పేరుతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయించాం. మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ గౌరవ భృతి ఇస్తాం.
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినా కేంద్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోతున్నది. దీంతో కట్టెలపొయ్యిలు పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన కుటుంబాలకు, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రూ.400కే ఇవ్వాలని నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలుచేస్తాం.
మేము మొదట అధికారంలోకి వచ్చిననాడు 2014లో ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ.2,00,000 మాత్రమే ఉన్నది. దాన్ని తాము వచ్చాక రూ.5 లక్షలకు పెంచాం. అనంతరం రూ.10 లక్షలకు పెంచుకున్నాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెంచుకున్నాం. ఏటా 10,000 మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి చేరుకున్నాం. వరంగల్, హైదరాబాద్ అద్భుతమైన సూపర్‌స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. మరో సంవత్సరంలో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో హెల్త్ సేఫ్టీ నెట్ రావాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ బీమా గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతున్నాం. ఇది అర్హులైన అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన స్కీమ్ వంటిది పెట్టాలనే ఆలోచన ఉన్నది. యాజమాన్యాలతో మాట్లాడి, కొంత కాంట్రిబ్యూట్ చేసి దవాఖానలకు వెళ్లిన వెంటనే వైద్యం చేసేలా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్ట్‌ను ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశాం. ఇదే తరహాలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలోకానీ, ఇతర ఏదైనా ఆధ్వర్యంలో కానీ జర్నలిస్టులకు రూ.15 లక్షలవరకు ఎటువంటి నగదు అవసరం లేకుండా ఆరోగ్య బీమా వర్తింపజేస్తాం. దీనికి కేసీఆర్ ఆరోగ్యరక్ష అని పార్టీవారు పేరు పెట్టారు.
మన రాష్ట్రంలో 46 లక్షలమంది స్వశక్తి మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వీరు తీసుకునే రుణాలపై రీపేమెంట్ 99.9 శాతంగా ఉన్నది. కొన్నిచోట్ల వీరికోసం ఇప్పటికే మంత్రులు, ఎంపీలు సొంత భవనాలను నిర్మించారు. మరికొన్నిచోట్ల సొంత భవనాలు లేవు. వారు సొంత భవనాలు కావాలని కోరుతున్నారు. బిల్డింగులు లేనిచోట్ల దశలవారీగా వీటిని నిర్మిస్తాం.
అనాథలైన పిల్లలకు ‘ఆర్ఫాన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్’ను తీసుకొస్తాం. వారిని స్టేట్ చిల్డ్రన్‌గా పరిగణిస్తూ ఆర్ఫాన్ పాలసీని పటిష్టంగా అమలుచేస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కోరుతున్నారు. కేంద్రం ఒప్పుకోవడంలేదు. ఈ వ్యవహారం పీటముడిలాగా మారింది. ఆచరణాత్మక విధానంపై అధ్యయనం కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో రైతుబంధుతోపాటు, రైతుభీమా పథకాన్ని తీసుకొచ్చాం. లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారాలు వెళ్లకముందే రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పన చేరాయి. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత కార్మికులకు చేనేత బీమా తెచ్చాం. గీత కార్మికులకు బీమా తెచ్చినం. ఇంకా కొంత మంది అడుగుతున్నారు. రాష్ట్రంలో కోటి 3 లక్షల కుటుంబాలున్నాయని గతంలో నిర్ధారణ అయ్యింది. ఈ మధ్య కాలంలో 6-7 లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు కోటి 10 లక్షల కుటుంబాలు అవుతాయి. వీరిలో 93 లక్షల పైచిలుకు కుటుంబాలకు రేషన్‌కార్డులు ఇచ్చాం. తెల్ల రేషన్ కార్డులున్నవారికి వచ్చే ఏడాది మార్చి తరువాత వందకు వందశాతం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా’ పేరుతో జీవిత బీమా కల్పిస్తాం. దీనికి సంబంధించి బడ్జెట్ లెక్కలు తీయించాం. బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఇది వర్తిస్తది. బీమా కూడా ఎల్ఐసీ ద్వారానే చేయించాలని నిర్ణయించాం. దీనివల్ల 93 లక్షల కుటుంబాలకు అంటే రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు బీమా సౌకర్యం ఏర్పడుతుంది. ప్రతి కుటుంబానికి బీమా కోసం అవసరమయ్యే రూ.3-4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు వివరాలు సేకరించి, ఎల్ఐసీకి సమర్పించేందుకు నెలలు పడుతుంది. 5 నెలల్లో ఈ పనిని పూర్తిచేసి వచ్చే జూన్ నుంచి అమల్లోకి తెస్తాం. అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచంగా ఇది ఉంటది. ఎల్ఐసీ లాంటి సంస్థ అయితేనే ఇది సాధ్యమైతది.