CM KCR | పాలమూరు-రంగారెడ్డి పనులను సీఎం కేసీఆర్ కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరినాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి.. సమర్థులైన కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు.
అదే విధంగా తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం సూచించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ.4,252.53 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని ఈఎన్సీ సీఎంను కోరారు.
ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీలు శ్రీధర్ రావు, దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, శంకర్, చీఫ్ ఇంజినీర్లు హమీద్ ఖాన్, రమణా రెడ్డి, శ్రీనివాస్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.