హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశంచారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ, యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 1.20కోట్ల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే నిర్వహించనున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎంపీ కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సమీక్షించారు. ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.
వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించాలని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతో పాటు, అధ్యక్షులవారి తొలిపలుకులు, సీఎం వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశం ప్రసగం, వందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది.
వేడుకల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, అన్ని జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే అందరు ఐఎఎస్, ఏపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులను, తదితర రెండు వేల మంది ఆహుతుల సమక్షంలో వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.