కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022పై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడటం.. దేశాన్ని అమ్మేయడమే బీజేపీ ప్రభుత్వానికి తెలుసని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఎల్ఐసీని కూడా అమ్మేస్తామని బడ్జెట్లోనే కేంద్రం స్పష్టం చేసింది. నష్టం వస్తే అమ్మాలి కానీ.. మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
బ్యాంకుల అప్పులు తీసుకొని వేల కోట్లు, లక్షల కోట్లు ముంచిపోయినోళ్లకు సబ్సిడీలు ఇస్తున్నారు. రీఫార్మ్ పేరు మీద కరెంట్ సంస్కరణల పేరు మీద ఇతరుల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడమే. మత పిచ్చి లేపుడు.. దాంతో రాజకీయ పబ్బం గడుపుకొనుడు. ప్రజలకు మత పిచ్చి లేవాలే.. దాని నుంచి నాలుగు ఓట్లు రాబట్టుకోవాలె. దేశ ఆస్తులన్నీ అమ్మాలి. దాని కోసం డ్రామా చేయాలి. ఇదే గోల్మాల్ గోవిందం. పచ్చి అబద్ధాలు.. అని కేసీఆర్ దుయ్యబట్టారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే అధ్వానమైన స్టేజ్‌లో భారత్ ఉంది. 101వ స్థానంలో భారత్ ఉంది. దానికి డబ్బా కొట్టుకునుడు. ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. గ్లోబల్ ఇండెక్స్‌లో ఇంత ఘోరంగా ఉంటే.. 65 వేల కోట్ల ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. రైతులు ఇంత సమ్మె చేసినా.. ధర్నాలు చేసినా ఎంఎస్పీ ప్రస్తావన లేదు. వ్యవసాయానికి పెంచలేదు. ఆరోగ్యానికి పెంచలేదు. సంక్షేమానికి పెంచలేదు. విద్యకు పెంచలేదు. ఇంకెవరికి పెంచావు. రేకు డబ్బాలో రాళ్లు ఏసి ఊపినట్టు తప్పితే ఎవరికి మేలు చేశారు అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.