గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలె. రూపాయి ఇయ్యలె. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే, పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ అదంతా దుబారా అంటున్నారు. వాళ్లనేం చేయాలె?
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీవి వట్టి మాటలేగానీ.. చేతలుండవని, దద్దమ్మ కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దళితవర్గాలను, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నది తప్ప.. వారికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఏండ్లపాటు వంచించి, వేలాది మందిని బలితీసుకొన్న అనంతరం గత్యంతరం లేని పరిస్థితుల్లో, బీఆర్ఎస్ పోరాటానికి తలొగ్గి తెలంగాణ ఇచ్చింది తప్ప మరేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ మాటలు చెప్తది తప్ప ఎప్పటికీ అమలు చేయదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ అమలు చేయడం లేదని ఉదహరించారు. ‘గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ఇస్తుంటే పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రైతుబంధు దుబారా అంటున్నారు. వాళ్లను ఏం చేయాలె’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అక్కడితో ఆగకుండా రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ వాళ్లే ఎన్నికల కమిషన్‌కు షికాయత్ చేశారని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు ఇస్తామని కర్ణాటకలో ఓట్లు దొబ్బారని, ఇప్పుడు 5 గంటలు మాత్రమే, అదీ రెండు దఫాలుగా ఇస్తున్నారని మండిపడ్డారు. అయినా సిగ్గులేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణ రాష్ర్టానికి వచ్చి గొప్పలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఆయన కృషి వల్లే నేడు రైతులు కాలు మీద కాలు వేసుకుని పంటలు పండించుకుంటున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో స్పీకర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు సాయంతో రైతులు పంటలు పండిస్తూ తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు. స్వరాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, సాగునీరు పుష్కలంగా లభిస్తుండటంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేశానని, చేతకాని ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరికి ఓటేస్తే ముగ్గురు ఎమ్మెల్యేలుగా చేస్తున్నారని అంటున్నారని, కానీ వాస్తవంగా ప్రజలు ఒక్కరికి ఓటువేస్తే ముగ్గురం కూలీలుగా మారి సేవలందిస్తున్నామని స్పష్టం చేశారు. బాన్సువాడలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.
రైతుబంధు, దళితబంధు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ షికాయత్ చేసింది. మాజీ పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్లు రైతుబంధు దుబారా అంటున్నారు. వాళ్లను ఏం చేయాలి? ప్రజలే ఆలోచన చేయాలి.
-సీఎం కేసీఆర్
విచక్షణతో ఓటేయండి
ఎన్నికలు వచ్చిన్పపుడు ఆగమాగం కాకుండా.. ఆలోచన చేసి విచక్షణతో ఓటేయాలని, లేదంటే పరిస్థితి అంతా ఉల్టా పల్టా అవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. ‘పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? తెలంగాణరాక ముందు ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది’ అనేది చర్చించాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడినాడు దారి, తెన్నులేదని, అయినా ఆర్థికవేత్తలను సంప్రదించి ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వివరించారు. రైతుబంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఇప్పుడిప్పుడే రైతుల ముఖాలు తెల్లబడుతున్నాయని అన్నారు. రైతు ఏవిధంగా చనిపోయినా వారం తిరగకముందే రూ.5 లక్షలు ఇచ్చి అన్నదాత కుటుంబం ఆగంకాకుండా చూస్తున్నామని వివరించారు.
రుణమాఫీ చేసుకున్నామని, సబ్స్టేషన్లు కట్టుకున్నామని, నాణ్యమైన కరెంట్ ఇస్తుండటంతో ఇప్పుడు మోటర్లు కాల్తలేవని వెల్లడించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఉద్ఘాటించారు. ఏ రంగమైనా కావచ్చు.. పేదలు, రైతులు, నీళ్లు, కరెంటు అన్ని రంగాల్లో ఉజ్వలమైన ప్రగతి సాధించామని వివరించారు. భారతదేశంలో 70 ఏండ్ల నుంచి ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర పెద్దపెద్ద రాష్ర్టాల ముందు మనది చాలా చిన్న రాష్ట్రమని, పదేండ్ల క్రితమే ఏర్పాటైన రాష్ట్రమని, అయినా వాటన్నింటినీ తలదన్ని రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో, 2,200 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు.
పక్కనున్న మహారాష్ట్రలో రోజుకు 8 నుంచి 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్లో కూడా లేనివిధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. అవినీతిలేకుండా చేస్తున్న కృషి, తండ్లాట వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూసుకొని, విచక్షణతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. పొరపాటున ఓటేస్తే కరెంటును కాటగలుస్తదని, రైతుబంధుకు రాంరాం పలుకుతరని హెచ్చరించారు.
పదేండ్లలో 5 వేల కోట్లతో అభివృద్ధి : హన్మంత్ షిండే
అత్యంత వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే హన్మంత్ షిండే చెప్పారు. 65 ఏండ్లలో కానరాని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించామని వెల్లడించారు. జుక్కల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ పదేండ్లలో నియోజకవర్గంలో రూ.5,500 కోట్లు వెచ్చించామని వివరించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు పురుగోతిలో ఉన్నాయని తెలిపారు. 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గం పాడి పంటలతో కళకళ లాడుతుందని వివరించారు. మరోమారు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
అభివృద్ధి పథంలో జుక్కల్
ఒకనాడు జుక్కల్‌తోపాటు తెలంగాణ అంతటా మంచినీళ్లు, సాగునీళ్లు లేవని, వస్తయనే నమ్మకం కూడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. జుక్కల్ ప్రాంతంలో చాలా మంది బోర్లు వేసి అప్పుల పాలయ్యారని తెలిపారు. ఎంతో వైభవంగా ఉన్న నిజాంసాగర్ సమైక్య పాలనలో ఎట్ల ఎండిపోయిందో అందరికీ తెలుసని, ఆ ఎండిన నిజాంసాగర్లోనే ఉద్యమ సమయంలో మీటింగ్ పెట్టుకున్నామని గుర్తుచేశారు.
ఎండాకాలం వస్తే జుక్కల్ ప్రాంతంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని పోవాల్సిన దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. జుక్కల్‌కు పిల్లను ఇవ్వాలంటే బయపడేటోళ్లని, ఇప్పుడు ఒకనాటి కరువు దూరమైందని వివరించారు. త్రివేణి సంగమంలాంటి ప్రాంతంలో జుక్కల్ ఉందని, ఎక్కువ మంది వార్కరి పాండురంగ భక్తులు ఉంటారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గడిచిన పదేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని వివరించారు. చెరువులు బాగుచేసుకున్నామని, చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నామని, మిషన్‌భగీరథతో తాగునీటి కష్టాలు తొలగిపోయాయని, పేదలకు పింఛన్లు, రైతులకు రైతుబంధు పెట్టుకున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే హన్మంత్ షిండే నేతృత్వంలో జుక్కల్ ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. షిండే చాలా అద్భుతమైన, ప్రేమగా ఉండే మనిషని వివరించారు. మరో గొప్ప వ్యక్తి ఎంపీ బీబీ పాటిల్ అని, వారి సారథ్యంలో జుక్కల్ ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని కొనియాడారు. నాందేడ్ హైవే రోడ్లు వచ్చాయని, లెండి ప్రాజెక్టు రావాల్సిన అవసరముందని వివరించారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై మహారాష్ట్ర చేతులు ఎత్తేసిందని, తెలంగాణ ప్రభుత్వమే త్వరలోనే పూర్తి చేస్తుందని, దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే యాసంగికి నీళ్లు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.
సింగూరు నుంచి నిజాంసాగర్‌కు ఢోకా లేదని, నిజాంసాగర్ ఎప్పుడూ నిండే ఉంటదని హామీ ఇచ్చారు. దళితబంధును నిజాంసాగర్ మండలానికి పూర్తిగా అమలు చేశామని, అక్కడి దళితుల విజయగాథలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో 25 తండాలను పంచాయతీలుగా చేశామని, పీజీ, డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నామని, బిచ్కుందలో డయాలసిస్ సెంటర్, 100 పడకల వైద్యశాల పెట్టుకున్నామని వెల్లడించారు. ఎన్నికల తర్వాత మరో 3 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సౌమ్యు డు, కక్ష్య రాజకీయాలు దూరంగా, హైదరాబాద్‌లో కాకుండా నెలకు 25 రోజులు ప్రజల మధ్యనే ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి షిండేను భారీ మెజార్జీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నారాయణఖేడ్ సస్యశ్యామలం
కాంగ్రెస్ పాలనలో నారాయణఖేడ్ ఎట్లున్నది? బీఆర్ఎస్ పాలనలో ఎట్లున్నది? అనేది ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. గతంతో పోలిస్తే నారాయణఖేడ్ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి ముఖ్య కారకుడు, ప్రతిరోజూ ప్రజలే మధ్యే ఉంటూ, ప్రశాంతంగా.. సౌమ్యుడిగా పేరొందిన నారాయణఖేడ్ హీరో భూపాల్రెడ్డేనని కొనియాడారు. తనను వ్యక్తిగత పనులు ఎప్పుడూ ఏవీ అడగలేదని, నియోజకవర్గ అభివృద్ధి, కొత్త మండలాలు, నీటి ప్రాజెక్టులు వంటివే తప్ప మరొకటి అడిగిందే లేదని, అందుకే మంచి అభివృద్ధిని నారాయణఖేడ్ సాధించగలిగిందని, భవిష్యత్తులో ఇంకా బాగా జరగాలని ఆకాంక్షించారు.
నారాయణఖేడ్‌కు తాను చాలాసార్లు వచ్చానని, తాను మంత్రిగా ఉన్నప్పుడు వస్తే రేకు డబ్బాల వంటి ఇళ్లు కనిపించేవని, కానీ… ఇవాళ హెలిక్యాప్టర్‌లో వస్తుంటే ఎక్కడ చూసినా భవంతులే కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు నారాయణ్‌ఖేడ్‌కు రావాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు నారాయణఖేడ్‌లో పోస్టింగ్ కావాలని ఉద్యోగస్తులు కోరుకుంటున్నారని వివరించారు. ‘నారాయణఖేడ్ ఉపఎన్నిక సందర్భంగా మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంలో పర్యటించారు. చిమ్నీబాయి అనే లంబాడీ మహిళ నాకు మంచినీళ్లు రావట్లేదు.
మరి నేనెందుకు ఓటెయ్యాలి సార్.. మంచంలో కూర్చోబెట్టి స్థానం చేపిస్తున్నం. కింద తాంబాళం పెట్టి.. ఆ నీళ్లను పశువులకు తాగిపిస్తున్నం.’ అని చెప్పిందని కేసీఆర్ గుర్తు చేశారు. తాను ఒక్కటే హామీ ఇస్తున్నానని, బసవేశ్వర, సంగమేశ్వర రెండు ఏర్పాటు చేసుకుంటున్నట్టు గుర్తు చేశారు. సింగూరును కాళేశ్వరం ప్రాజెక్టుకుతో లింక్ చేస్తున్నామని, ఆటోమెటిక్‌గా ఏడాదంతా నీటితో కళకళలాడుతుందని, శాశ్వతమైన జలవనరుగా తయారైందని వివరించారు.
కాబట్టి దానినుంచి జహీరాబాద్‌కు, నారాయణఖేడ్‌కు లిఫ్టు పెట్టుకున్నామని, తద్వారా బ్రహ్మాండంగా నీళ్లొస్తాయని, మల్లన్నసాగర్ నుంచి వస్తున్న నీటికాలువ నర్సాపూర్ వరకు పూర్తయిందని, నారాయణఖేడ్ వరకు వస్తుందని.. దాని ద్వారా సుమారు 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు. బసవేశ్వర పూర్తై ఆ మల్లన్నసాగర్ కాలువ కూడా వచ్చేస్తే.. 1 లక్ష 80 వేల ఎకరాలకు నీరందుతుందని, నారాయణఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని భరోసా ఇచ్చారు.
భారతదేశంలో 70 ఏండ్ల నుంచి ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర పెద్ద పెద్ద రాష్ర్టాల ముందు మనది చాలా చిన్న రాష్ట్రం. పదేండ్ల క్రితమే ఏర్పాటైన రాష్ట్రం. అయినా వాటన్నింటినీ తలదన్ని రూ.3.18 లక్షల తలసరి ఆదాయం, 2,200 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండటం గర్వకారణం.
-సీఎం కేసీఆర్
నల్లవాగు ప్రాజెక్టు మీదుగా వస్తుంటే నిండుగా కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. రెండు పంటలు పండేటట్టు నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మంజూరు చేసే బాధ్యత తనదేనని, మాసాన్‌పల్లి రోడ్డును వందశాతం మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నారాయణఖేడ్ చరిత్రలోనే భూపాల్‌రెడ్డి ఉత్తమమైన యువ నాయకుడని, ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యే అని, అడ్డం, పొడుగు మాట్లాడే మనిషి కాదని, అందరితో కలిసి ఉంటాడని, నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజాసేవలో ఉంటారని కొనియాడారు.
భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందు తండాలెట్ల ఉండేవి.. ఇప్పుడెట్ల అయినవో ఆలోచించాలని, సుమారు 100 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని, లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, పోడు భూములకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇవన్నీ ఎవరైనా, ఎప్పుడైనా ఉహించారా? అని ప్రశ్నించారు. పదేండ్లలోనే ఎన్నో అద్భుతాలు చేశామని, భూపాల్‌రెడ్డిని ఆశీర్వదించాలని, గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆ తర్వాత తానే స్వయంగా వచ్చి బశవేశ్వర, సంగమేశ్వర లిఫ్టు ఇరిగేషన్‌ను ప్రారంభిస్తానని, స్కూళ్లు పెట్టిస్తానని, ఆ బాధ్యత తనదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కులం లేదు.. మతం లేదు. తొమ్మిదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. కరువు లేదు. బ్రహ్మాండంగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. అవన్నీ చూసి కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతున్నరు. కండ్లలో నిప్పులు పోసుకొని మనపై దాడులు చేస్తున్నరు. వారికి మీరే గుణపాఠం చెప్పాలి. ఇలాంటి దాడులను తిప్పి కొట్టాలంటే.. మనం ఓటు ద్వారానే వాళ్లకు బుద్ధిచెప్పాలి. ఇకనైనా కాంగ్రెసోళ్ల కండ్లు తెరిపియ్యాలి.
-సీఎం కేసీఆర్
నీటి గోస తీర్చిన కేసీఆర్: భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతం కోసం బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, కొత్తగా 8 చెరువులను మంజూరు చేసి నియోజకవర్గంలో సాగునీటి వనరులను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. తాగునీటి సమస్యను పూర్తిగా తీర్చారని చెప్పారు. నారాయణఖేడ్‌లో 150 పడకల దవాఖానను నిర్మించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు కల్హేర్, కరస్‌గుత్తిలో 30 పడకల దవాఖానలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని, నారాయణఖేడ్‌లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
పోచారానికి లక్ష పైచిలుకు మెజారిటీ ఇవ్వాలి..
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను అనేకసార్లు బాన్సువాడకు వచ్చా. రాష్ట్రం ఏర్పడిననాడు ఇక్కడ ఏమీ లేదు. నిజాంసాగర్ ఎండిపోయింది. సింగూరు నీళ్లు హైదరాబాద్‌కు పోతున్నాయి. వేరే ప్రాజక్టులు కాలేదు. కరెంటు ఎప్పుడో వస్తదో తెలియదు. మంచినీళ్లు, సాగునీళ్లు లేక ప్రజలు వలసలు పోయేవారు.’ అని కేసీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకన్నా బాన్సువాడ ఎక్కువగా అభివృద్ధి చెందిందని, అదే తరహాలో ఇతర నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కొనసాగిందని, ఉజ్వలమైన ప్రగతిని సాధించామని వివరించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మి తాండవించినట్టు ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా శుభప్రదమమవుతుందని, వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే రైతుబంధు, ఢిల్లీలో కొట్లాడి రైతులకోసం ఎరువులు తెచ్చేవారని కొనియాడారు.
అందుకే ఆయనకు తాను లక్ష్మీ పుత్రుడని పేరు పెట్టుకున్నానని, అది నిజమేనని, బాన్సువాడ బంగారువాడగా తయారైందని సంతోషం వ్యక్తం చేశారు. పోచారం లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, అందులో పోచారం మళ్లీ పెద్ద హోదాలో ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం బాన్సువాడకు ఢోకా ఉండబోదని వివరించారు. సమైక్య పాలకులు సింగూరును కూడా హైదరాబాద్‌కు ఇచ్చేశారని, ఫలితంగా నిజాంసాగర్‌కు నీళ్లు రావాలంటే, పంటలు కాపాడుకోవాలంటే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు కాలుమీద కాలు వేసుకొని కూర్చుంటే నిజాంసాగర్ 365 రోజులు నిండే ఉంటదని వివరించారు.
పోచారం శ్రీనివాస్ సామాన్య కార్యకర్తలా పనిచేస్తారని, జాకోరా, చందూరు లిఫ్టులు, సిద్ధేశ్వర రిజర్వాయర్ అన్నీ కట్టిస్తున్నారని, తిరిగే కాలు ఊకోదు, చేసిన చెయ్యి ఊకోదన్నట్టుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పనిచేసే అలవాటు కాబట్టి పనులకోసం తపన పడుతూ ఉంటారని వివరించారు. తన నియోజకవర్గంలో కూడా కానివిధంగా బాన్సువాడలో 11,000 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి అంటే తనతోసహా మంత్రులందరికీ ఎంతో గౌరవమని, అందరికీ మార్గదర్శకంగా ఉంటారని, వారికి ఏ లోటూరాకుండా ఉండాలనే ఉద్దేశంతో పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పారు.
పోచారాన్ని లక్షపైచిలుకు మెజార్టీతో గెలిపించే బాధ్యత బాన్సువాడ ప్రజలదేనని, ఆయనకు మళ్లీ ఉన్నత స్థానంలో సేవచేసుకునే భాగ్యం తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మీకు కావాల్సిన పనులన్నీ శ్రీనివాస్‌రెడ్డి చేస్తారని, ఎంతచేసినా అక్షయపాత్రలాగా ఆయన మళ్లీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని, ఆయన కోరిన పనులన్నీ నూరుశాతం చేయించే బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు.
నేను బతికున్నంతవరకూ సెక్యులరిజమే
మనకు కులం, మతం లేదని, తెలంగాణ గంగా జమునా తెహజీబ్ అని కేసీఆర్ అభివర్ణించారు. హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే ప్రాంతమని, కొందరు దుర్మార్గులు వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తాము అలా చేయలేదని వివరించారు. కేసీఆర్ బతికి ఉన్నంతవరకూ తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరెన్ని చేసుకున్నా దేవుడు తలిచిందే జరుగుతుందని తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేకసార్లు తాను చెప్పానని, అల్లా కే ఘర్ మే దేర్హై అంధేర్ నహీహై అని కూడా తాను చెప్పానని గుర్తుచేశారు. చివరికి అదే జరిగిందని, తెలంగాణ ఏర్పడిందని వివరించారు.
నేడు రాష్ర్టాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నామని, రాష్ట్రంలో 1000 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, అందులో 204 ముస్లింలకు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నదని వెల్లడించారు. కులమతాలకతీతంగా పరస్పరం గౌరవించుకోవడమే తెలంగాణ సంస్కృతి అని తెలిపారు. అన్ని కార్యక్రమాల్లో హిందూ, ముస్లిం, సిక్కు, జైనులను కలుపుకొని పోతున్నామని, భవిష్యత్తులోనూ అలాగే ముందుకు పోతామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.