ఎన్నికలప్పుడు ఆరు చందమామలు తెస్తం.. ఏడు సూర్యుళ్లను తెస్తమని తియ్యటి మాటలు చెప్పేటోళ్లను నమ్మి ఓట్లేయొద్దు. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం.. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగినట్టు మన బతుకులు ఆగమైతయ్. కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉన్నది. ధరణి, రైతుబంధు తీసేస్తమనేవారు, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమనేవాళ్లతో చాలా ప్రమాదం. రైతుల గతి ఏమైతదో ..!
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రాణాలకు తెగించి కొట్లాడి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన బీఆర్ఎస్ను ప్రజలంతా గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే రైతుల భూములపై హక్కులు తీసేస్తామని, వ్యవసాయానికి 3 గంటలే కరెంటు ఇస్తామని, రైతుబంధును బంద్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివారి చేతుల్లో తెలంగాణ పెడితే అన్నదాతలు మళ్లీ ఆగమాగం అవుతారని అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం, పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రైతుబంధు 16 వేలు అవుతుందని, కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధే మాయమైతదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు మళ్లీ అప్పులపాలయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రైతులోకం మంచిగా ఉండాలని వ్యవసాయ స్థిరీకరణ చేపట్టినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. రైతుకు భూమి, నీళ్లు ఉండాలనుకొని స్వపరిపాలనలో నీటి తీరువాలు శాశ్వతంగా రద్దు చేశామని తెలిపారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి తీరువాలను ముక్కుపిండి వసూలు చేశారని గుర్తుచేశారు. రైతుకు అండగా, పెట్టుబడి సాయంగా ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వని విధంగా రైతుబంధు ఇస్తున్నామని, దానిని త్వరలోనే రూ.16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. రైతుబీమా కింద రైతులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటివరకూ లక్ష కుటుంబాలకు బీమా సదుపాయం లభించిందని వివరించారు. 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొంటున్నామని తెలిపారు. ‘పీసీసీ అధ్యక్షుడు అహంకారంతో 10 హెచ్‌పీ మోటర్లు వాడుకోవచ్చు అంటున్నాడు. రాష్ట్రం మొత్తం 33 లక్షల మోటర్లున్నయి. మరి 33 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు ఎవడు కొనాలి? వీని అయ్య కొంటడా? 10 హెచ్‌పీ మోటర్లు గుంజుడు వెడితే బోరు పొకలల్ల నీళ్లుంటయా? రైతులకు ఉండేదే 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ. అవన్నీ తీసేస్తం అంటున్నాడు. ప్రజలే ఆలోచించుకోవాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్‌పార్టీ కల్లబొల్లి మాటలను నమ్మవద్దని సూచించారు. మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్లొచ్చేసరికి మన ఇల్లు కాలుతది అన్నట్టు అయితదని హెచ్చరించారు.
50 ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు భూముల మీద పెత్తనం వారి వద్దే పెట్టుకున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ధరణి రూపంలో రైతులకు ఇచ్చింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లా ఆ హక్కులు తీసుకుంటరు. బీఆర్ఎస్కు ఓటేస్తే రైతుల వద్దే ఉంటాయి. నేను ప్రాణంపెట్టి పోరాడిన కాబట్టి ఈ హక్కులను పోగొట్టుకోవద్దని రైతులను కోరుతున్నా.
-సీఎం కేసీఆర్
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలు కృష్ణానది బేసిన్లో ఉన్నందున ఈ జిల్లాలకు కృష్ణానది నీళ్లే రావాలని, నీటి కేటాయింపు కూడా ఉందని, ఈ నీటికోసం పాలమూరు -రంగారెడ్డి పథకాన్ని చేపడితే కాంగ్రెస్ నాయకులు 196 కేసులు వేశారని కేసీఆర్ మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి, కాలికి పెడితే మెడకి, మెడకి పెడితే కాలికి పెట్టి దాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ కొన్ని పనులు చేశామని, ఇటీవలే అన్నీ క్లియర్ కావడంతో ఈ మధ్యనే తాను ప్రాజెక్టును కూడా ప్రారంభించానని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో మునుగోడు వద్ద రిజర్వాయర్ ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో లక్ష ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. దాదాపు 100 చెరువులు నింపుకొని వ్యవసాయానికి వాడుకోవచ్చని చెప్పారు.
రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టనందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్లు రాష్ట్రం నష్టపోయిందని కేసీఆర్ తెలిపారు. అయినా తాను రైతుల మేలుకోసం మోటర్లకు మీటర్లు పెట్టాలన్న మోదీ ఆదేశాలను బేఖాతరు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేస్తే.. అందులో తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? అన్ని ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూలు పెట్టాలని చట్టం ఉన్నదని, తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఎంత ఆందోళన చేసినా.. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణకు ఒక్క నవోదయ స్కూలు కూడా కేంద్రం మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఒక్క నవోదయ స్కూలు, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోగా రాష్ర్టానికి రావాల్సిన రూ.25,000 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రజలను ప్రశ్నించారు. అందుకే విచక్షణతో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. 1,022 గురుకులాలు ఏర్పాటు చేశామని, దేశంలో ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిన రాష్ట్రం మరొకటి లేదని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ గతంలో 19-20 స్థానంలో ఉండేదని, నేడు రూ. 3 లక్షల 18 వేలతో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం సైతం 1100 యూనిట్ల నుంచి 2,200కు పెరిగిందని తెలిపారు. 80 లక్షలమందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు అవసరమైనవారికి ఆపరేషన్లకు సిఫారసు చేసినట్టు వివరించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలు గతంలో కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ఊహించామా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్క చాన్స్ ఇవ్వాలని అంటున్నరు. వాళ్లకు ఒక్క చాన్స్కాదు.. ప్రజలు ఇప్పటికే 10, 11 చాన్స్‌లు ఇచ్చారు. 50 ఏండ్లు పాలించి.. ప్రజల కోసం ఏం జేసిండ్రు. కనీసం కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీళ్లయినా తెచ్చియ్యగలిగిండ్రా?
-సీఎం కేసీఆర్
దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరిజనబంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి ప్రగతిని పట్టించుకోలేదని విమర్శించారు. ‘తెలంగాణ రాక ముందు లంబాడీ బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలంటే పట్టించుకోలేదు. మేము తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచుకున్నాం. దళితబంధు మాదిరిగానే గిరిజన బిడ్డల్లో భూమి, ఉద్యోగం లేనివారికి గిరిజనబంధు ఇస్తామని గతంలో చెప్పాం. తప్పకుండా అమలు చేస్తాం. విడతలవారీగా అందరికీ దళితబంధు అమలుచేస్తాం’ అని చెప్పారు. ఈ దేశంలో ఏ ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా దళితులు, గిరిజనుల గురించి ఆలోచించారా? అనేది ఒక్కసారి గుర్తుచేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నాడు ఏ పేదలను, ఏ పేద వర్గాల ప్రజలను పట్టించుకోలేదని, కాబట్టి మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. కేవలం పదేండ్లలో బీఆర్ఎస్ చరిత్రలో విననటువంటి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ఏది రాయి? ఏది రత్నం? అనే చర్చ పెట్టాలని, బీఆర్ఎస్ ప్రజా మ్యానిఫెస్టోను ఎన్నికలలోపు ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, మన గెలుపును ఎవ్వడూ ఆపలేడని అన్నారు. ఎన్నికల తర్వాత రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.
50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ ధైర్యంగా ఒక్క పని చేసిన పాపానపోలేదని కేసీఆర్ మండిపడ్డారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నా కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రోడ్ల మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రెండు రోడ్లు తప్ప ఆయన చేసిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే హాలియాకు డిగ్రీ కాలేజీ, వంద పడకల దవాఖాన కల నెరవేరినట్టు చెప్పారు. ఇప్పటికీ జానారెడ్డి సీఎం పదవిపై పంచరంగుల కలలు కంటున్నారని, అది నెరవేరేది కాదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనాటికి నాగార్జునసాగర్ ప్రాంతంలో పశువులకు గడ్డికూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాడు అసెంబ్లీ సాక్షిగా రెండేండ్లలోపు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ప్రకటన చేశాం. అప్పుడు జానారెడ్డి లేచి.. కేసీఆర్ మీరు రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో కరెంటు ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసేసి, బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని చెప్పాడు. ఇప్పుడు మాట తప్పాడు. వాస్తవానికి ఏడాదిన్నరలోపే కరెంటు ఇచ్చినం’ అని కేసీఆర్ గుర్తుచేశారు. అయినా మళ్లీ బుద్ధిలేకుండా నోముల భగత్‌పై జానారెడ్డి నిలబడ్డారని, ఉప ఎన్నికల తరహాలోనే మళ్లీ జానారెడ్డికి బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రెండు ఎత్తిపోతల పథకాలను కూడా ప్రారంభించుకున్నామని, మిగిలినవి కూడా పూర్తి చేసి, వాటి ప్రారంభానికి కూడా తానే వస్తానని మాట ఇచ్చారు.
పాలకుర్తి చైతన్యవంతమైన, పోరాటాల గడ్డని, పోరాట వారసులంతా అదే చైతన్యాన్ని చూపాలని సీఎం కేసీఆర్ కోరారు. ఐదురోజుల కోసం అమెరికా నుంచి వచ్చేటోళ్లు కిరీటం పెట్టరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘ఇది పోరాటాల పురిటి గడ్డ .. దైవభక్తి ఉన్న గడ్డ.. పోతన పుట్టిన గడ్డ.. బందగీ.. దొడ్డి కొమురయ్య.. చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ పాలకుర్తి గడ్డ.. మీరంతా ఆ పోరాటానికి వారసులు. పాలకుర్తిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అమెరికా నుంచి విమానంలో వచ్చి ఐదురోజులు మురిపించేటోడు మనకు కిరీటం పెడుతారా? టోపీపెట్టి మళ్లీ విమానం ఎకుతారు తప్ప వాళ్లేం చేయరు. పొద్దున్నుంచి రాత్రి వరకు మీ మధ్యలో ఉండే వ్యక్తి.. మీ కోసం తండ్లాడే వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్‌రావ్.. ఆయననే గెలిపించాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన.. ప్రాణాలకు తెగించి పోరాడిన పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలోనే లక్షా 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అనేక చెక్‌డ్యాంలు నిర్మించి, కాళేశ్వరం, దేవాదుల పెండింగ్ పనులు పూర్తిచేసి భూములకు సాగునీటినందించినట్టు చెప్పారు. ‘ఉద్యమ సమయంలో అనేక సార్లు పాలకుర్తికి వచ్చా ను. నాడు ఎస్సారెస్సీ కాలువల్లో గడ్డి చెట్లు మొలిచి కూలిపోయి ఉండే. నీళ్లు వస్తాయనే ఆశ లేకుండే. మీ ఎమ్మెల్యే దయాకర్‌రావు.. పంచాయతీరాజ్ మంత్రి. పంచాయతీలు.. గ్రామల్లో బీటీ రోడ్డు ఎట్లా ఉన్నాయో.. మిషన్ భగీరథ నల్లా నీళ్లు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు. దయాకర్‌రావు పేరు దయాకర్‌రావు కాదు.. చెక్డ్యాంలరావు. చెక్‌డ్యాం లు కట్టడంతో భూగర్భజలాలు పెరిగినయి. భూములు సాగవుతున్నాయి. ఇదివరకు పాలకుర్తి నుంచి వేలాది మంది వలసపోయారు. పశువులకు గడ్డి లేక కబేళాలకు అమ్ముకున్న పరిస్థితి నాటు ఉండేది. మంచినీళ్లు, సాగునీళ్లకు ఇబ్బందులు.. కరెంట్ కష్టాలు.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకుర్తిలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి కూలీలు వచ్చి ఇదే పాలకుర్తిలో వరినాట్లు వేస్తున్నారు. దేవాదుల పూర్తిచేసి కాళేశ్వరం కట్టి నీళ్లు తీసుకువస్తే ఇవాళ లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. అద్భుతమైన పంటలు పం డుతున్నాయి. ఇప్పుడిప్పుడే ముఖం తెలివి అయితున్నాం. మరింత తెలివికి రావాలి. మళ్లీ వెనకిపోవద్దు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. దయాకర్‌రావును గెలిపిస్తే.. పాలకుర్తికి ఇంజినీరింగ్ కాలేజీ ఉరికి ఉరికి వస్తదని.. గ్రామానికి 100-150 చొప్పున ఇండ్లను మొదటి రెండేండ్లలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఓటేసే ముందు అభ్యర్థుల గురించి, వారి వెనుకున్న పార్టీల గురించి ఆలోచించాలి. పార్టీల చరిత్ర, నడవడిక చూడాలి. వారికి అధికారం ఇస్తే ఏం చేశారు? ఏం చేస్తారు? అనే చర్చ జరగాలి. ఎవరో చెప్పింది వినకుండా రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది? అని ఆలోచన చేసి ఓటు వేస్తేనే ప్రజలు గెలుస్తారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం.
-సీఎం కేసీఆర్
‘జానారెడ్డి కుటుంబం గెలవడం వల్ల ఇక్కడ జరిగిందేమీ లేదు.. జరగబోయేది కూడా ఏం ఉండదు. నాగార్జునసాగర్ అభ్యర్థిగా నోముల భగత్ మీకు మంచి చేస్తాడు. భగత్ యువకుడు.. మీ వాడు.. బలహీన వర్గాల బిడ్డ’ అని కేసీఆర్ తెలిపారు. ‘భగత్ తండ్రి నోముల నర్సింహయ్య ఓ కమ్యూనిస్టు యోధుడు, మంచివాడు. అకస్మాత్తుగా ఆయన చనిపోతే, ఆయన కొడుక్కే టికెట్ ఇచ్చినం. నాడు నేను వచ్చి భగత్ సేవచేస్తాడని చెప్పితే భగత్‌ను గెలిపించారు. ఇప్పడూ చెప్తున్నా.. భగత్ మంచి ఉత్సాహం ఉన్నవాడు, ఎల్ఎల్బీ చేసిన విద్యావంతుడు. వినయం ఉన్నటువంటి భగత్ వస్తే కులం, మతం లేకుండా నాగార్జునసాగర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. భగత్‌ను గుండెలకు హత్తుకొని, ఆయన్ని గెలిపించండి.. మీ అభివృద్ధి నా బాధ్యత. మీ భవిష్యత్తుకు భరోసా నాది. భగత్ అడిగిన అన్ని పనులు చేయిస్తాం’ అని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కూడా 100 పడకల దవాఖానను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుమారు రూ. 700 కోట్లతో ఇబ్రహీంపట్నంలో అనేక రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశామని, ఇంకా పలు రోడ్లు అభివృద్ధి కావాలని కోరుతున్నారని అన్నారు. రీజినల్ రింగురోడ్డు కూడా ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్తున్నదని, దీంతో ఇబ్రహీంపట్నం ముఖచిత్రమే మారిపోతుందని తెలిపారు. కలెక్టరేట్, కోహెడ పండ్ల మార్కెట్, లక్ష ఉద్యోగాలు కల్పిస్తున్న ఫాక్స్‌కాన్ పరిశ్రమ తదితర అన్నీ ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటవుతున్నాయని వివరించారు.
ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోవడంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పట్టుబట్టి హైదరాబాద్‌కు వెళ్లే మెట్రోనీటితో ఆ చెరువును నింపిచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చెరువు ఎగువభాగంలో 36 కిలోమీటర్లమేర వాగులో ఏర్పాటు చేసిన ఇసుక ఫిల్టర్ల వల్ల చెరువు నిండడంలేదని గుర్తించి, కిషన్‌రెడ్డి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారని, దీంతో ఇప్పుడు చెరువు నిండుకుండలా తయారైందని అభినందించారు. తన గ్రామం వద్ద 600 ఎకరాలు ఉన్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారని, అక్కడ కాలుష్యంలేని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని చెప్పారు. తప్పకుండా అక్కడ పరిశ్రమలు వస్తాయని హామీ ఇచ్చారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో దళితులు ఎక్కువగా ఉన్నందున తమకు దళితబంధు పథకం కింద ఎక్కువమందికి మంజూరు చేయాలని కిషన్‌రెడ్డి కోరారని, తప్పనిసరిగా ఇబ్రహీంపట్నంను స్పెషల్ కేసుగా పరిగణించి ఎక్కువ మోతాదులో మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కిషన్‌రెడ్డి గెలిస్తే ఇవన్నీ జరుగుతాయని భరోసా ఇచ్చారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.