కరీంనగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): నల్ల చట్టాలు వద్దని నిరసన తెలుపుతున్న రైతులను చంపుతున్న బీజేపీకి ఓట్లు ఎలా వేస్తారని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుడిచేతితో ఇస్తున్న రైతుబంధు పథకం గ్రాంటును డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎడమ చేతితో లాగేసుకుంటున్నదని చెప్పారు. రైతు వ్యతిరేక పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈటలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు మున్నూరు కాపులు నిర్వహించిన ఆత్మీయ సన్మానానికి ఆయన ముఖ్యఅథిగా హాజరై మాట్లాడారు. రైతు బిడ్డలైన మున్నూరుకాపులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చి రైతుల గోస తీర్చారని పేర్కొన్నారు. రైతు శిస్తు రద్దు చేసిన కేసీఆర్.. రైతుబంధు తో రైతులకే శిస్తు చెల్లిస్తున్నారని వివరించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు ఎక్కించి చంపేస్తున్నారని, ఈ పార్టీ నేతలు రైతులను తీవ్రవాదులతో పోల్చుతున్నారని, అలాంటి పార్టీలో చేరి హుజూరాబాద్ నుంచి పోటీచేస్తున్న ఈటలకు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. తాను చెప్పేవి అబద్ధాలైతే తమ పార్టీకి ఓట్లు వేయొద్దని, రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం తాము పనిచేస్తున్నామని గుర్తిస్తే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. గెల్లు శ్రీనివాస్యావ్ను గెలిపించాలని, ఆయన గెలిస్తే ఇటు తాను అటు గంగుల కమలాకర్ దగ్గరుండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మున్నూరు కాపుల కోరికలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి తీరుస్తానని స్పష్టంచేశారు.
ఆర్టీసీని కాపాడుతున్న సీఎం: బాజిరెడ్డి
ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదని, రూ.వెయ్యి కోట్లు ఇస్తాం.. అమ్మేయమని కేంద్ర ప్రభుత్వం బేరం పెట్టిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లకు తలొగ్గితే అంబానీకో, అదానికో ఆర్టీసీని కట్టబెట్టేదని ఆరోపించారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి రక్షించిన విషయాన్ని గుర్తుచేశారు. గెల్లును గెలిపించుకుంటే మున్నూరుకాపుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారానికి కృషి: గంగుల
నియోజకవర్గ మున్నూరుకాపుల చుట్టూ ఇన్నాళ్లు ఈటల ఒక ముళ్ల కంచెను వేశారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మున్నూరుకాపు బిడ్డనైనా తనకు ఇక్కడ బంధువులు, ఆత్మీయులు ఉన్నారని, తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు కనీసం అభినందనలు తెలిపేందుకు కూడా ఈటల సమ్మతించలేదని గుర్తుచేశారు. కొందరు ఫ్లెక్సీలు పెడితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరించారని ఆరోపించారు. ఈటల మోసాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆయన వేసిన కంచెలను తొలగించారని, ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో తనకు బాధ్యతలు అప్పగించారని, గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించడం ద్వారా తనకు బలాన్ని ఇస్తే మున్నూరుకాపుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్‌తో కలిసి వెళ్లి సీఎం తో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దానం నాగేందర్, కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, జనవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్
కుడిచేతితో ఇస్తున్న రైతుబంధు పథకం గ్రాంటును డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎడమ చేతితో లాగేసుకుంటున్నది. రైతు వ్యతిరేక పార్టీ నుంచి
పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను చిత్తుగా ఓడించాలి.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తాడు
నల్ల చట్టాలను తెచ్చి బీజేపీ రైతులను గోస పెడుతున్నది. ఈటల గెలిస్తే ప్రజలకు ఏ చేస్తారు. మంత్రిగా పని చేసిన రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. గొల్ల కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి గొర్రెల పంపిణీ చేపట్టారు. బీజేపీ.. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి, సామాన్యుల నడ్డి విరుస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గ నిరుపేద ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకోవాలి.
దళితుల దరిద్రాన్ని తుడిచేస్తున్న కేసీఆర్
దళితబంధుతో సీఎం కేసీఆర్.. దళితుల శతాబ్దాల దరిద్రాన్ని తుడిచి వేస్తున్నారు. దళితులను ధనవంతులుగా మార్చేందుకు దళితబంధును తెచ్చారు. ఈ పథకం దళితుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాదిగ ఉపకులాలు ‘కారు’ గుర్తుకు ఓటేసి మన ఆత్మగౌరవం చాటుకోవాలి. మాట మీద సీఎం కేసీఆర్ నిలబడినట్టుగానే, మనం కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నాం.