దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ రాజకీయ సరళిలోనూ గుణాత్మక మార్పురావాలన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అగ్నిపథ్ అనే స్కీం తెచ్చి బీజేపీ సర్కారు దేశ యువత భవిష్యత్‌తోపాటు దేశాన్ని ప్రమాదంలో నెడుతున్నదన్నారు. దేశం మీద ప్రేమ రావాలంటే సైన్యంలో కనీసం ఆరేళ్లైనా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. మనది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్మీ అని, అలాంటి సైన్యంతో బీజేపీ సర్కారు ఆటలాడుతోందని మండిపడ్డారు. ఇండో చైనా బోర్డర్ ప్రయోగశాల కాదని, దానితో దేశానికే ముప్పు అని తనకు మాజీ లెఫ్టినెంట్ జనరల్స్ చెప్పారన్నారు. ఇలాంటివి ఆలోచించకుండా నరేంద్ర మోదీ సర్కారు అగ్నిపథ్ అనే దిక్కుమాలిన స్కీం తెచ్చిందని దుయ్యబట్టారు.
ఎనిమిదేళ్లలో బీజేపీ సర్కారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తాము గెలిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్‌మనీ మొత్తం వాపస్ తెస్తానన్నారని, ఇప్పుడు అది డబుల్ అయ్యిందని తెలిపారు. మోదీ అసమర్థత వల్లే విదేశీ బ్యాంకుల్లో మన నల్లధనం రెట్టింపైందని మండిపడ్డారు. ఈ దేశానికి మాటలు చెప్పే ఇంజిన్ వద్దని, పనిచేసే ఇంజిన్ కావాలన్నారు. బీజేపీ సర్కారు చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని విమర్శించారు. వీళ్లు హిందుత్వం పేరు చెప్పి రాజకీయ లబ్ధిపొందుతున్నారని, వీరిగురించి కార్‌పాత్ర మహారాజ్ అనే గురువు బుక్‌కూడా రాశాడని చెప్పారు.
కాశీలో మోదీ రాజకీయ క్రీడ..
కాశీ..హిందువులకు పవిత్రస్థలమని, తమ చివరిదశలో అక్కడే గడపాలని అంతా అనుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాంటి పవిత్ర స్థలాన్ని కూడా మోదీ తన రాజకీయం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. నట్టుబోల్టులతో కాశీలో ఘాట్లు నిర్మించారని, మధ్యగోపురం మెయిన్ పిల్లర్ పడిపోయిందని చెప్పారు. ఇదే విషయంపై ఉత్తర భారతదేశంలో లొల్లి నడుస్తున్నదన్నారు. నరేంద్ర మోదీజీ హిందూ సంస్కృతిని గౌరవించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
మొన్నటిదాకా కశ్మీర్‌ఫైల్స్ అనే సినిమాతో గోల్మాల్ రాజకీయాలు చేశారని, ఇప్పుడు కశ్మీరీ పండిట్లు రోజూ ధర్నా చేస్తుంటే కనిపించడం లేదా? అని బీజేపీ సర్కారును సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మీ రాజకీయ వికృతక్రీడకోసం వారిని బలితీసుకుంటారా అని ప్రశ్నించారు. దేశ ఆర్థిక ప్రగతికి ప్రధానే గొడ్డలిపెట్టు అయితడా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటడా? అని నిలదీశారు. డబుల్ ఇంజిన్ ఎందుకు సావనీకా? గంగలో పోనీకా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశానికి నరేంద్ర మోదీ ఒక్క మంచి పనన్నా చేశారా? అని ప్రశ్నించారు. జీడీపీ పోయింది.. రూపాయి పడిపోయింది..నిరుద్యోగం పెరిగింది.. ఇవి వాస్తవాలు కాదా? అని అడిగారు. ఇంకా సిగ్గులేకుండా ఏక్నాథ్ శిందేలను తెస్తామంటారా? అని మండిపడ్డారు. దేశప్రజలంతా దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
దేశం ప్రమాదంలో ఉంది..
బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో ఉందని, దీని ఆపాల్సిన బాధ్యత యువత, మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులదేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ రాజకీయాలనుంచి బీజేపీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ వద్ద సమాధానం లేదన్నారు. మోదీ నుంచి సమాధానం రాదని, ఎందుకంటే ఆయన దగ్గర సమాధానాలే లేవని యశ్వంత్ సిన్హా అన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సమాధానం చెప్పకపోవడం మేధావితత్వమా? అని ప్రశ్నించారు. రేపు మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని, ఎల్ఐసీని అమ్మనివ్వమని పేర్కొన్నారు. గుజరాత్ మోడల్ డూప్లికేట్ అని, గోల్మాల్ చేసి మోదీ ప్రధాని అయ్యాడని చెప్పారు.
నరేంద్ర మోదీ పాలనలో కార్పొరేట్లకు మాత్రమే లాభం జరిగిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మోదీ ఒత్తిడి వల్లే అతడి స్నేహితుడికి పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడే చెప్పారని, ఇదే విషయంపై శ్రీలంకలో ప్రస్తుతం అగ్గి రగులుతోందన్నారు. శ్రీలంకలో దేశం ఇజ్జత్ పోతున్నదని మండిపడ్డారు. భారత ప్రధానిస్థాయి దిగజారిందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాలని నిలదీశారు. ఈ అరాచకాలను, దుర్మార్గాలను ఇంకా భరిస్తే దేశం సర్వనాశనమైతదన్నారు. చెడగొట్టడం.. కూలగొటట్డం ఈజీ అని, పునర్మిర్మాణం కష్టమని పేర్కొన్నారు.
దేశంలో కొత్త పార్టీ రావొద్దా?
టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారితే తప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ ఎస్ పెట్టినప్పుడు విమర్శించినోళ్లు ఇప్పుడేడున్నరు? అని అడిగారు. దేశమేమన్నా బీజేపీ నాయకులకు రాసిచ్చామా? అని ప్రశ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంటని నిలదీశారు. భారతదేశంలో కురిసే వర్షపాతం లక్షా 40వేల టీఎంసీలని, నదులనుంచి 70వేల టీఎంసీలు మనం తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం దేశం ఎత్తుకున్నది 22వేల టీఎంసీలు మాత్రమేనని, మిగతాదంతా సముద్రంపాలే అవుతున్నది సీఎం కేసీఆర్ వివరించారు. ఇంత పెద్ద దేశంలో భారీ ప్రాజెక్టులు అవసరం లేదా? అని ప్రశ్నించారు.
జింబాజ్వేకు 6,500 టీఎంసీల రిజర్వాయర్ ఉన్నప్పుడు మనకు ఉండొద్దా? అని సీఎం కేసీఆర్ అడిగారు. ఎప్పుడూ ఏదో మూల కరువు వస్తది.. పిచ్చోళ్లలాగా ఎర్రిమొహాలు వేసుకుని చూద్దామా? అని ప్రశ్నించారు. భారతదేశ విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలని, 50శాతం అంటే 40 కోట్ల ఎకరాల వ్యవసాయ అనుకూల భూమి ఉందన్నారు. మరి ఇక్కడ ప్రపంచంలోనే ఉజ్వలమైన వ్యవసాయం ఉండాలి కదా? అని అడిగారు. టీఆర్ఎస్ లాంటి సర్కారు దేశంలో ఉంటే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చన్నారు. ఇందుకోసమే కేసీఆర్ తపనపడుతుండు అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ చేతులెత్తి మొక్కుతున్నా.. చెడుపై పోరాటం చేయండి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.