CM KCR | హుజుర్నగర్ : రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజుర్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతుబంధు పదాన్ని ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని సీఎం తెలిపారు. రైతుబంధు మంచిది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడుతున్నాడు. దుబారా అని అంటున్నాడు. స్వామినాథనే హైదరాబాద్‌కు వచ్చి రైతుబంధు పథకాన్ని ప్రశంసించారు. ఇలా రైతుబంధు వద్దనే వారికి తగిన బుద్ధి చెప్పాలి. నవంబర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి అని కేసీఆర్ అన్నారు.
రైతుకు స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతోనే రైతుబంధు నగదు ఇస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు. రైతుబంధు ఇవ్వడంతో పంటలు పండించుకుంటున్నారు. కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు మొనగాళ్లు నా తెలంగాణ రైతులు. పంజాబ్ స్థానం తర్వాత మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నాం. 30 లక్షల టన్నులు పండించే స్థాయి నుంచి 3 కోట్ల టన్నులు పండించే స్థాయికి ఎదిగాం. లిఫ్ట్‌లు పూర్తయితే 4 కోట్లకు వెళ్లి పంజాబ్‌ను దాటేస్తాం. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టుడు రాజకీయం కాదు. అందుకే పార్టీల వైఖరి గురించి ఆలోచించాలి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
మూడు గంటల కరెంట్ అనేటోడు అసలు ఎక్కడన్న పొలం దున్నిండా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. నీకు ఎవుసం లేదు.. ఎద్దు లేదు.. హైదరాబాద్‌లో ఎయిర్ కండీషన్లో ఉండవడితివి. నేనేమో రైతును.. అన్నీ నాకు తెలుసు. ఇక రాహుల్ గాంధీ నాగలి దున్నిండో, ఎవుసం ఉందో తెలియదు కానీ నాకు.. ధరణిని తీసేస్తాం అంటున్నరు. ఒక రైతుకు ఏడెనిమిది భర్తలు ఉండేవారు. ఈ భాదలన్నీ నాకు తెలుసు. తెల్లారేసరికి భూములు వేరే వారి మీద ఎక్కించేవారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని భట్టి విక్రమార్క అంటున్నడని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ధరణి పుణ్యమా అని నేరుగా రైతుబంధు నగదు మీ ఖాతాలో పడుతుంది అని కేసీఆర్ తెలిపారు. రైతుబీమా కూడా నేరుగా మీకు అందుతుంది. ధాన్యం డబ్బులు కూడా ఖాతాలో పడుతున్నాయి. మరి ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుంది. మీ భూమిని ముఖ్యమంత్రికి కూడా మార్చే దమ్ము లేదు. ప్రభుత్వం తన పెత్తనం అధికారాన్ని వదులుకోని ఆ అధికారాన్ని మీకు ఇచ్చింది. ఈ అధికారాన్ని పొగొట్టుకుంటారా? అనేది ఆలోచించాలి అని కేసీఆర్ రైతులకు సూచించారు.
సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించండి.. హుజుర్‌నగర్‌కు కావాల్సినవి చేసి పెడుతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉత్తమ్ మాట్లాడితే గడ్డం తీసుకోను అని శపథం చేస్తడు. ఆయన గడ్డం తీసుకుంటే, తీసుకోకపోతే ఎంత..? నీ శపథాలు కాదు పని కావాలి. నీళ్లు, కరెంట్ కావాలి. అందుకోసం సైదిరెడ్డిని గెలిపించండి అని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.