CM KCR | నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిస్వార్థపరుడు.. అలాంటి వ్యక్తి గెలిస్తే మన నిజామాబాద్‌కు ఎంతో లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్ పట్టణం ఎలా ఉండేనో మీరందరూ చూశారు. నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉందో ఆలోచించండి. స్మశానవాటికలు, చెరువుల సుందరీకరణలు, రైల్వే బిడ్జి కింద నీళ్లు ఆగి ఇబ్బంది పడేది.. ఆ సమస్య పరిష్కారం కోసం రూ. 25 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టించారు. పట్టణం కోసం రూ. 100 కోట్లు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఐటీ సెంటర్‌కు కూడా తీసుకొచ్చారు. నిజామాబాద్‌కు లాస్ట్ టైం వచ్చినప్పుడు.. ప్రత్యేకంగా పట్టణానికి రూ. 100 కోట్లు మంజూరు చేశాను. ఇందూరు కళాభారతి కోసం రూ. 55 కోట్లు మంజూరు చేశాను. నిజామాబాద్ పాత కలెక్టరేట్ జాగాలో ఇందూరు కళాభారతి నిర్మాణం అవుతోంది. పోలీసు కమిషనరేట్ బ్రహ్మాండంగా ఉంది. అవన్నీ మీ కండ్ల ముందున్నాయి. ఇవన్నీ మీరు గమనిస్తున్నారు. గతంలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టుకున్నాం. మంచి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇలా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారు. గత ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రాల్లో ఐటీ కేంద్రాలు నెలకొల్పుతున్నాం. మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేట వంటి పట్టణాల్లో ఐటీ సెంటర్లు వచ్చాయి. 24 గంటల హై క్వాలిటీ కరెంట్ ఉందని కంపెనీలు వస్తున్నాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కరెంట్ మూడు గంటలు ఇస్తే కంపెనీలు రావు.. ఇవన్నీ ఆలోచించండి అని కేసీఆర్ సూచించారు.
గణేష్ గుప్తా ఒక మంచి వ్యక్తి. స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. పేదవాడు కాదు.. ఆయన నిరుపేద కాదు. ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వారికి ప్రజల డబ్బు అవసరం లేదు. నిస్వార్థంగా పని చేసే గుప్తా లాంటి వ్యక్తి గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మీ అందరి ఆశీర్వచనంతో ఇందూరు కళాభారతిని నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. కానుకగా ఇస్తాను అని కేసీఆర్ పేర్కొన్నారు.