CM KCR | సిద్దిపేట యుద్ధభేరి మోగించింది. సంక్షేమ‘కారు’డి వెంటే తానున్నానని రణగర్జన చేసింది. జనసముద్రాన్ని చూసి కేసీఆరే.. ‘నియోజకవర్గ ఊళ్లల్లో ఎవరైనా ఉన్నరా? మొత్తం ఇక్కడనే ఉన్నరా?’ అంటూ ఆశ్చర్యపోయారు. ‘రక్తం.. మాంసం.. బుద్ధి.. అన్నీ ఇచ్చి నన్ను కనీపెంచిన సిద్దిపేట మాతృభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అంటూ భావోద్వేగానికి లోనై చెప్తున్నప్పుడు ఆయన కంఠం కృతజ్ఞతాజేగంట మోగించింది. ‘మా నవాబ్సాబ్, మా తోరణాల చంద్రారెడ్డి బావ’ అని కేసీఆర్ ఊర్లు, పేర్లు చెప్తూ ఇంటింటితో తన బంధాన్ని ప్రస్తావించడంతో సభా ప్రాంగణం పులకించిపోయింది.
హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట వెతలే తెలంగాణ ఉద్యమానికి పునాది అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘చింతమడకలో ఉన్నప్పుడు.. నా కన్నతల్లికి ఆరోగ్యం దెబ్బతింటే.. మా ఊర్లోని ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలిచ్చి సాదింది. అంతటి అనుబంధం ఈ సిద్దిపేట గడ్డతోటి ఉంది’ అని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సిద్దిపేటలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. సిద్దిపేటతో తనకున్న అనుబంధాన్ని, గత అనుభవాలను స్మరించుకొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలకు సిద్దిపేటలో ఎదురైన అనుభవాలే ప్రేరణ అని వివరించారు. హరీశ్‌రావును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి గత రికార్డులను తిరగరాయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నియోజకవర్గంలో ప్రజలెవరైనా ఉన్నారా.. అంతా ఇక్కడే ఉన్నారా? అన్నంతగా వచ్చిన అశేష జనవాహినిని, లెక్కించడానికి వీలుకానంత సంఖ్యలో వచ్చిన ప్రజలను చూసి సంతోషిస్తున్నా’ అని కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో కాలుమోపిన సందర్భంగా ‘జననీ జన్మ భూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అంటూ శ్రీరామచంద్రుడు చెప్పిన సూక్తిని వివరిస్తూ.. సిద్దిపేటతో తనకున్న ఆత్మీయ అనుబంధాలను నెమరేసుకున్నారు. ‘సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. పెద్దగజేసింది. చదువుజెప్పిది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను రాజకీయ నాయకుడిని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ సిద్దిపేట’ అని గర్వంగా చెప్పుకొన్నారు.
రంగనాయక్సాగర్నుంచి సిద్దిపేటకు నీళ్లిచ్చి కరువును పారదోలే క్రమంలో.. సిద్దిపేటను ఈ స్థాయికి తీసుకొచ్చిన వేళ.. నాడు ఎన్నో కష్టాలు అనుభవించినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. నాడు సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ల కరువొస్తే.. 28 వార్డుల్లో వార్డుకొక ట్యాంకర్ పెట్టించినట్టు తెలిపారు. నాలుగు బోర్లు వేసే వాహనాలను తీసుకెళ్లి వంద బోర్లు వేస్తే.. వాటిలో రెండింటిలో ఎక్కడో నీటి తేమ వచ్చిన దాఖలాలను గుర్తు చేసుకొన్నారు. ఆ వెతలను చూసి ఆనాడే లోయర్ మానేర్ డ్యాం నుంచి నీళ్లు తెచ్చుకొని..జలజాతర చేసుకున్నట్టు చెప్పారు. ఈరోజు తెంగాణ మొత్తం మిషన్ భగీరథ అమలవుతున్నదంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి ఆదర్శమని చెప్పారు.
నాడు సిద్దిపేటతోసహా తెలంగాణలో ప్రజలు పడుతున్న వెతలను చూసి అధికార పార్టీని వదిలిపెట్టినట్టు కేసీఆర్ చెప్పారు. అదే ఊపులో అందరినీ వెంటేసుకొని వెళ్లి పోరాడి.. మొండి పట్టుదల, ధైర్యంతో ప్రాణాలకు కూడా తెగించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆ వెంటనే వచ్చిన ఉప ఎన్నికల్లో సమైక్యవాదులంతా వచ్చి తనకు వ్యతిరేకంగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా.. తనకు కేటాయించిన బస్సు గుర్తుకే ఓట్లు వేసి, 60 వేల మెజార్టీతో సిద్దిపేట ప్రజలు తనను గెలిపించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డే అని తెలిపారు. ఆ రోజులను ఏనాడు తాను మర్చిపోలేనంటూ సగర్వంగా చెప్పారు.
తెలంగాణను ఈ రోజు యావత్తు దేశం ఆదర్శంగా తీసుకునేలా, అబ్బురపడేలా అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నానంటే కారణం సిద్దిపేట గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం.. అన్నీ ఈ గడ్డ పుణ్యమే.
-సీఎం కేసీఆర్
తాను కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తాను లేని లోటును తీర్చేందుకు ఆరడుగుల బుల్లెట్టు హరీశ్‌ను ప్రజలకు అప్పగిస్తే.. తాను ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించారని సీఎం కేసీ ఆర్ గుర్తు చేశారు. హరీశ్‌రావు కూడా బ్రహ్మాండంగా మంచిపనులు చేసి తన మాటను నిలబెట్టి, ప్రజల గౌరవాన్ని కాపాడారని అభినందించారు. ‘హరీశ్‌రావు అటూ ఇటూ తిరుగుతడు. ఏడన్న తట్టెడు పెండ కనిపిస్తే కొంచబోయి సిద్దిపేటలో ఏసుకుంటడు’ అని ఎమ్మెల్యేలు, మంత్రుల్లో హరీశ్‌రావుపై ఓ జోకుందని చమత్కరించారు. మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి కార్యక్రమాన్ని సిద్దిపేటకు తీసుకొచ్చేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నాడని, తాను సిద్దిపేట ఎమ్మెల్యేనైనా ఆ స్థాయిలో పనిచేసేటోడిని కాదేమోనని అన్నారు. ‘ఎప్పుడు హెలిక్యాప్టర్‌లో ఆ హుస్నాబాద్ పోయినా.. ఏడికి పోయినా నంగునూర్ పెద్దవాగు మీద చెక్‌డ్యామ్‌లను చూసి బ్రహ్మాండంగా మనసు పులకించిపోతున్నది. మొన్నటికి మొన్న హుస్నాబాద్ పోతున్నప్పుడు కూడా చూపెట్టిన. ఇప్పుడు కూడా నిండుకుండళ్లా ఉన్నాయి.’ అని ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేటకు ఒక్కటే ఒక్కటి తక్కువ ఉన్నదని, అది గాలిమోటర్ రావడమేనని అన్నారు. స్వరాష్ట్రంలో సిద్దిపేటకు అధికారం వచ్చిందని, గౌరవం వచ్చిందని, మెడికల్ కళాశాల వచ్చిందని, మినీ యూనివర్సిటీ కూడా రానున్నదని, ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు అనేక ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయని, హరీశ్‌రావు పట్టుబట్టి ఐటీ హబ్‌ను తీసుకొచ్చారని వివరించారు. జిల్లా చేసుకొన్న తర్వాత అన్ని బాధలు పోయాయని, గొప్ప వర్తక, వాణిజ్య, వ్యాపార, ఐటీ, కాలుష్యంలేని పరిశ్రమల కేంద్రంగా, ధాన్యం పడించే వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. రాబోయేరోజుల్లో చాలా అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
సిద్దిపేట ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, హరీశ్‌రావు విజయంపై తనకు ఎలాంటి అనుమానం లేదని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హరీశ్‌రావుకు లక్ష మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు నెలకొల్పారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ రికార్డును సిద్దిపేట ప్రజలే మళ్లీ తిరగరాయాలని, హరీశ్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికమైతే.. సిద్దిపేట నియోజకవర్గం యావత్తు తెలంగాణకే తలమానికంగా నిలుస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట అనుభవాలే ఎన్నో పథకాలకు ప్రేరణగా నిలిచాయని చెప్పారు. బీసీల్లో ఉండే విశ్వబ్రాహ్మణులు, రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం కరెంటు ఫ్రీగా ఇచ్చామని, ఇటీవలే మాడ్రన్ సెలూన్లు, అధునాత వృత్తి పనిముట్లు కొనుగోలు కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. అది కూడా నిరంతర ప్రక్రియ అని, ప్రతి బీసీ బిడ్డకు అందుతుందని అన్నారు.
తనను ఇంతవాడిని చేసిన తన మాతృభూమికి, కన్నతల్లికి నిండుసభ సాక్షిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. తనను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన సిద్దిపేట గడ్డ రుణం ఈ జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనిదంటూ భావోద్వేగంతో చెప్పారు. సిద్దిపేట సభలో తనతో కలిసి పనిచేసిన మిత్రులు, సహచరులు, ఆత్మీయ మిత్రులు వందలాది మంది ఉన్నారని తెలిపారు. వారితో అనేక జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. కొండమరాజుపల్లి మాదన్న ఎక్కడున్నడో.. నవాబ్సాబ్ ఎక్కడున్నడో, తనకు డిపాజిట్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడున్నడో.. ఇలా ప్రతి గ్రామంలో వంద నుంచి 150 మంది వరకు ఆత్మీయులు ఉన్నారంటూ నాటి స్మృతులను గుర్తు చేసుకొన్నారు. తన ఆత్మీయులను పేరుపేరునా తలచుకొన్నారు.
సిద్దిపేటకు రానిది ఏంది? లేనిది ఏంది? గోదావరి జలాలు వచ్చినయ్. రైలు వచ్చింది. ఎండాకాలంలో చెక్‌డ్యామ్‌లు, చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి. ఒకనాడు తెలంగాణలో కన్నీరు కార్చిన సిద్దిపేటలో నేడు చెక్‌డ్యాములన్నీ పన్నీరు కారినట్టుగా మత్తళ్లు దుంకుతున్నయి. ఆ ఫొటోలు చూసుకుంటూ నేను హైదరాబాద్‌లో సంతోషపడుతున్నా.
-సీఎం కేసీఆర్
‘చింతమడకలో ఉన్నప్పుడు.. పసికూనగా అమ్మ చనుబాలు తాగే సమయంలో నా కన్నతల్లికి ఆరోగ్యం దెబ్బతిన్నది. మా ఊర్లోని ఒక ముదిరాజు తల్లి నాకు చనుబాలిచ్చి సాదింది. అంతటి అనుబంధం ఈ సిద్దిపేట గడ్డతోటి ఉంది’ అని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. సిద్దిపేటలో తాను పాదయాత్ర చేయని గ్రామం లేదని, చూడని కుంటలు, చెరువులు లేవని పేర్కొన్నారు. ‘కట్ల మాల్యాలకు పోయి శిల్కమారోని కుంట’ ఏమైంది? అని అడిగేదని, ఏ ఊరికిపోయినా సర్పంచులు ఆదరించారని చెప్పారు. నాడు మంచినీళ్లు లేని, తాగునీళ్లు లేని సిద్దిపేట.. బంగారంలాంటి భూములున్నా పంటలు పండించుకోవడానికి నీళ్లులేని సిద్దిపేటను.. నేడు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకొన్నట్టు చెప్పారు.
దళితబంధు పథకానికి ప్రేరణ కూడా సిద్దిపేటలోని రామంచకు చెందిన దళిత ఆడబిడ్డే. సిద్దిపేటలో ఉన్న సమయంలో ఓ దళిత ఆడబిడ్డ వచ్చి బిడ్డ పెండ్లి ఎత్తిపోయేట్టున్నదని ఎంతో బాధపడింది. కారణమేంటని అడిగిన. అల్లుడికి సైకిల్ పెడతా అని ఒప్పుకున్నా.. పైసలు ఎల్తలేవని చెప్పింది. నేనే రూ.1900 పెట్టి సైకిల్ కొనిచ్చా. అదీ దేశంలోని దళితుల పరిస్థితి. అలాంటి ఎన్నో సంఘటనలు నా అనుభవంలో ఉన్నాయి. అయినా దిక్కుమాలిన కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వాళ్లకోసం ఏ పనీ చేయలేదు. ఆ నేపథ్యంలోనే ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే ఉద్దేశంతో సిద్దిపేట అనుభవాలనే గుణపాఠాలుగా తీసుకుని దళితబంధుకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ దళిత సమాజం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏటా 50 వేల కుటుంబాలకో, లక్ష కుటుంబాలకో దళితబంధును తప్పక ఇస్తాం.