తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేశారని అన్నారు. మే 28న సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ పై వివక్షను నాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డయని సిఎం అన్నారు. తెలంగాణ సాధనాపోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి వుందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నామని సీఎం కెసిఆర్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.