ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకులకు డబ్బుందన్న అహంకారం. ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలం అనుకుంటరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయరట. ప్రజలు తలుచుకుంటే వాళ్ల సంగతేంది? దుమ్ములేపరా? నాలుగు పైరవీలు, నాలుగు కాంట్రాక్టులు చేసుకుని.. డబ్బు మదంతో ప్రజలనే కొంటం.. ప్రజాస్వామ్యాన్నే కొంటమని అహంకారంతో మాట్లాడుతున్నరు. నమ్మితే దెబ్బతింటం.. ఎటూ కాకుండా పోతం.
2014లో ఓడిపోయి తుమ్మల ఇంట్లో మూలకు కూసుంటే నేను పిలిచి మంత్రి పదవి ఇచ్చిన. ఎమ్మెల్సీని చేసిన. పాలేరులో ఉపఎన్నిక వస్తే నిలబెట్టి, గెలిపించిన. ఇదంతా ప్రజలకు తెలుసు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మలకు అప్పగిస్తే.. పార్టీకి ఆయన చేసింది గుండుసున్నా. ఒక్క ఎమ్మెల్యేనూ గెలిపించలేకపోయిండు. బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా? తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలె.
-సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘కొందర బహురూపుల నాయకులున్నరు. పదవుల కోసం పార్టీలు, మాటలు మారుస్తున్నారు. డబ్బుమదంతో ప్రజాస్వామ్యాన్ని కొంటామని అంటున్నరు. డబ్బుతో ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలమని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్వబోమని సవాళ్లు విసురుతున్నరు. ప్రజలంతా అనుకుని గెలిపిస్తే ఎవరు అసెంబ్లీ వాకిలి తొక్కుతరో.. ప్రజలు దుమ్ములేపితే ఎవరు అసెంబ్లీలో అడుగుపెడుతరో ప్రజలకే తెలుసు. నోట్ల కట్టల అహంకారంతో నాలుగు పైరవీలు, నాలుగు కాంట్రాక్టులు చేసుకుని డబ్బు మదంతో ప్రజలను కొంటాం.. ప్రజాస్వామ్యాన్నే కొంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనిని రాజకీయం అంటారా?’ అని కాంగ్రెస్‌పై ముఖ్యమత్రి కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైందో కర్ణాటకలో రుజువైందని, కరెంటు లేక పొలాలు ఎండుతున్నాయని అన్నారు. ఏమార్చేటోళ్లకు ఓటేస్తే ప్రజలే ఓడిపోతారని, పనిచేసిన బీఆర్ఎస్నే రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని, సంక్షేమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల అభ్యర్థులు కందాళ ఉపేందర్‌రెడ్డి, శంకర్‌నాయక్, అరూరి రమేశ్‌కు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అనేక అవమానాలు ఎదుర్కొని, చివరికి చావునోట్లో తలపెట్టి, భారత రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని దారికితెచ్చి తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు. మాటకు కట్టుబడకుండా భంగంచేసి కాంగ్రెస్ దోఖాచేసినా, అలుపులేని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. స్వరాష్ట్రంలో అన్నివర్గాలను కాపాడుకుంటూ, అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పారు. కరెంటు, మంచినీళ్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, 60 ఏండ్ల గోసను పదేండ్లలో తీర్చామని వెల్లడించారు. ‘రైతు సచ్చినా.. బతికినా గతంలో వారి అవస్థలను పట్టించుకున్నోళ్లు లేరు. పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. కో ఆపరేటివ్ లోన్ కట్టలేదనో.. ఇంకో లోన్ కట్టలేదనో తలుపులు ఊడబీకి, దర్వాజలు తీసుకెళ్లారు తప్ప.. రైతులకు ఏ ప్రభుత్వం రూపాయి ఇవ్వలె. నీటి మోటర్లు కాలిపోతే మన దిక్కుచూడలేదు. గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. వ్యవసాయ రంగం, రైతాంగం, కచ్చితంగా స్థిరీకరణ జరగాలని, రైతు సంక్షేమం జరగాలని పట్టుదలతో మేం నిర్ణయాలు తీసుకున్నాం. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. ఆషామాషీగా రైతుబంధు పెట్టలేదు. రైతుబంధును ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ ప్రశంసించారు. శభాష్ చంద్రశేఖర్ బాగా చేశావ్.. అని కొనియాడారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ఎక డా లేదని, భేష్ పథకమని ఐక్యరాజ్యసమితి కితాబిచ్చింది’ అని సీఎం కేసీఆర్ వివరించారు. నేడు దేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ అయ్యిందని, ధాన్యం దిగుబడిలో నంబర్ వన్‌లో పంజాబ్ ఉంటే.. రెండో స్థానంలో తెలంగాణ ఉన్నదని వివరించారు.
పదవుల కోసం.. అవకాశాల కోసం పార్టీలు మారి, మాట మార్చేవారు మన మధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది.. ప్రజల కోసం ఏం ఆలోచించింది.. మళ్లీ అధికారం వస్తే ఏ వాగ్దానాలను నెరవేర్చుతుంది అని ఆలోచించి ఓటు వేయాలి. డబ్బుకట్టల అహంకారంతో, పిచ్చి రాజకీయాలతో వచ్చేవారికి, పూట పూటకు పార్టీలు మారేవారికి అవకాశమిస్తే వాళ్లు మాత్రమే గెలుస్తారు. కానీ ప్రజలు ఓడిపోతారు.
– సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అన్యాయం చేసిందని తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారని, ఆయన ఓడిపోయి ఇంట్ల కూసుంటే ఏ పదవి లేకున్నా తాను మంత్రిని చేసిన విషయాన్ని విస్మరించరాదని సీఎం కేసీఆర్ చురకలంటించారు. ‘తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మంలో పువ్వాడ అజయ్మీద పోటీ చేసి, ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చుంటే మేమే గుర్తించినం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాత స్నేహితుడని, సీనియర్ నాయకుడని, ఏ పదవి లేకున్నా మంత్రి పదవిచ్చిన. ఎమ్మెల్సీ చేసి ఆదుకున్నాం. వాస్తవానికి పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చనిపోతే. ఆయన భార్యనే అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్నాం. తుమ్మల నాగేశ్వర్రావే వచ్చి నా నియోజవర్గం రిజర్వ్ అయ్యింది. తనకు అవకాశమిస్తే పాలేరులో నిలబడి సేవచేస్తానంటే టికెటిచ్చిన. మేమంతా వచ్చి దండంపెడితే బ్రహ్మాండంగా 40-42 వేల మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఇది సత్యం. ఓడిపోయి ఇంట్ల ఉంటే మంత్రి, ఎమ్మెల్సీ, పాలేరులో సీటిచ్చి గెలిపిస్తే ఐదేండ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యమిస్తే బీఆర్ఎస్ అభ్యర్థులనే ఓడించారు’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరు ద్రోహం చేశారో.. ఎవరికి ఎవరు అన్యాయం చేశారో ప్రజలకు తెలుసు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా? ప్రజలే న్యాయం చెప్పాలి’ అని కోరారు. చరిత్రంతా ప్రజలకు తెలుసని, ప్రజల ముందే అంతా జరిగిందని, ఇప్పుడొచ్చి అడ్డగోలుగా నోరుందికదా అని బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద మాట్లాడటం అరాచకమని, ఇలాంటి అరాచకాన్ని ప్రజలే తిప్పికొట్టి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల వేళ ఓట్లకోసం వస్తున్న పార్టీల వైఖరిని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ సూ చించారు. ‘మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని అంటున్నారు. విలువైన ప్రజల పన్నులను కేసీఆర్ చెడగొడ్తుండట! రైతుబంధు ఉండాల్నా..? దుబారానా..?’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘కేసీఆర్ 24గంటల కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తుండు. మూడు గంటల కరెంటు చాలు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతదా? అంటూ ప్రశ్నించారు. ‘రైతుబంధు వేస్ట్.. రైతు బీ మా వేస్ట్, 24 గంటల కరెంటు ఇవ్వొద్దు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల వైఖరి ఉన్నది. ప్రజలకు ఏదీ వద్దట.. కాంగ్రెస్ వారు మాత్రం పంచుకుని తినాలట. వారు 24 గంటలు హైదరాబాద్‌లో ఏసీల్లో ఉండాలట’ అంటూ నిప్పు లు చెరిగారు. రైతుబంధు వద్దంటున్నవారికి వచ్చే నెల 30న తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చా రు. ధరణిని రద్దు చేసి కాంగ్రెస్ మళ్లీ రైతు ల హక్కులను లాక్కోవాలని చూస్తున్నదని, అదే జరిగితే రైతుబంధు రావాలంటే వీఆర్వో దగ్గర నుంచి పెద్దాఫీసర్ వరకు అందరి చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న వాళ్లనే బంగాళాఖాతంలో పడెయ్యాలని పిలుపునిచ్చారు. బెల్లయ్యనాయక్‌కు టికెట్ ఇవ్వాలని లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు ఉద్యమం చేస్తే, కాంగ్రెస్ నేతలు దారుణంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లంబాడోళ్లకు వెయ్యి రూపాయలిచ్చి, గు డుంబా పోస్తే వాళ్లే ఓట్లేస్తరు అని రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ఇంత అహంకారంతో మాట్లాడుతారా? లంబాడీలకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యా ద ఇదేనా?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్‌ను నమ్మితే రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్.. కరెంట్ కాటగలుస్తది.. మన బతుకు వైకుంఠపాలి ఆటలో పెద్దపాము మింగినైట్లెతది.
– సీఎం కేసీఆర్
గతంలో మహబూబాబాద్‌కు వస్తే కాల్వల్లో చెట్లు మొలిచి ఉండేవని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయ్యిందని, లేకపోతే జన్మలో జిల్లా అయ్యేది కాదని తెలిపారు. కొత్త కలెక్టరేట్, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను తానే స్వయంగా ప్రారంభించానని గుర్తుచేశారు. ‘మహబూబాబాద్ మారుమూల గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడే కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులంతా అందుబాటులో ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తిని నేను. గిరిజన గూడేల్లో వికాసం రావాలని, గిరిజన బతుకుల్లో ఉషోదయం నిండాలని పట్టుబట్టిన వ్యక్తిని నేను. ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌లో తిరుగుతుంటే శ్రీరాంసాగర్ నీళ్లు వస్తయా? ఈ కాలువల్లో నీళ్లు పారంగ చూస్తమా? అనే సందేహం ఉండేది. నేడు మహబూబాబాద్ రూపురేఖలే మారిపోయా యి. శంకర్‌నాయక్ నాయకత్వంలో మహబూబాబాద్‌లో సుమారు 20 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చాం. పోలీసు కేసులను రద్దు చేశాం. పోడు భూములకు కూడా రైతుబంధు పైసలిచ్చాం. రైతుబీమా చేయించాం. గిరిజన ఆవాసాల్లో ప్రత్యేకంగా లైన్లు వేయించి త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాం. మహబూబాబాద్ ముద్దుబిడ్డ సత్యవతి రాథోడ్ గిరిజన మంత్రిగా ఉన్నారు. ఆమె నేతృత్వంలోనే ప్రతి గోండు, కోయ, ఆదివాసీ, లంబాడీ తండాల్లోని వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు రూ.300 కోట్లతో పనులు చేపట్టాం. గిరిజన బిడ్డల కోసం గురుకులాలు పెట్టుకున్నాం. వెన్నారం కాలువను సరిచేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం. ఆకేరు, మున్నేరుతోపాటు అనే వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. అవన్నీ నీటితో కళకళలాడుతుంటే కడుపు నిండినట్టుగా ఉన్నది. తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడున్నాయి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలవాలి. బయ్యా రం ఉక్కు పరిశ్రమతోపాటు మరికొన్ని పరిశ్రమలు కావాలని శంకర్‌నాయక్ కోరుతున్నారు. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాం గ్రెస్, దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఓట్ల కోసం మన దగ్గరికి వస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ మాయమాటలు నమ్మొద్దు. మళ్లీ గోస పడొద్దు. వాటికి ఓటుతో బుద్ధి చెప్పి, కచ్చితంగా శంకర్‌నాయక్‌ను దీవించండి’ అని కోరారు.
వర్ధన్నపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. గతంలో పేరుకే ఎస్సారెస్పీ కాలువలు ఉండేవని, తెలంగాణ వచ్చాక ఆ కాలువన్నీ బాగుచేసుకొని రెండు పంటలు పండిస్తున్నామని తెలిపారు. ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు దేవాదుల నీళ్లు తెచ్చుకున్నామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలిపారు. అరూరి రమేశ్ ప్రజల్లో ఉండే నాయకుడని, రూ.160 కోట్లు తెచ్చి వర్ధన్నపేటను మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు. కానీ కొందరు దుర్మార్గులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నేరుగా ఎదుర్కొనే దమ్ములేక రింగ్‌రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తామని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రింగ్ రోడ్డుకు ఎట్టిపరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ చేయబోమని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. గత రెండుసార్లు రమేశ్‌ను ఒకసారి 80 వేలు, మరోసారి 90 వేల మెజార్టీతో గెలిపించారని, ఈ సారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయిందని, విలీనం చేసిన 40 గ్రామాలకు సాదాబైనామా చేయిస్తామని, అభివృద్ధికి ఇబ్బంది లేదని, ఇంకా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
బెల్లయ్యనాయక్‌కు టికెట్ ఇవ్వాలని లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు ఉద్యమం చేస్తే, కాంగ్రెస్ నేతలు దారుణంగా అవమానించారు. లంబాడోళ్లకు వెయ్యి రూపాయలిచ్చి, గుడుంబా పోస్తే వాళ్లే ఓట్లేస్తరు అని రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ఇంత అహంకారంతో మాట్లాడుతారా? లంబాడీలకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద ఇదేనా?
– సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘నిన్న మొన్నటిదాకా కేసీఆర్ వల్లే మోక్షం లభించిందని మాట్లాడిన నాలుకలు ఈ రోజు ఉల్టా మాట్లాడుతున్నాయి. నరం లేని నాలుక కాబట్టే వారు అలా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారొచ్చు. కానీ సత్యం మారదు. నిజం నిప్పులాంటిది కాబట్టి నిజం నిజంలాగే ఉంటుంది. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో ప్రజలకు తెలుసు. అనేక దశాబ్దాల పాటు మా తండాలో మా రాజ్యం. మా గూడెల్లో మా రాజ్యం కావాలని అడిగితే ఎవరు కనికరించలేదు. పాదయాత్రలు చేసినా పట్టించుకోలేదు. పాలేరు నియోజకవర్గంలో 38 -40 తండాలు ప్రత్యేక గ్రామ పంచాయితీలయ్యాయి. లండాడీ బిడ్డలు సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిందెవరో ప్రజలకు తెలుసు. పాలేరులో భక్తరామదాసు ప్రాజెక్టుకు ముందు భూముల ధరలు ఎట్లా ఉండేనో.. ఇప్పుడు ఎట్ల ఉన్నాయో? అందరికీ తెలిసిందే. గతంలో ఎకరం రూ.3 -4 లక్షలున్న భూమి, ఈ రోజు రూ.40 – 50 లక్షలు పలుకుతున్నది. ఇది ఎవరి పుణ్యమో ప్రజలకు తెలుసు. పదవుల కోసం అవకాశాల కోసం పార్టీలు మారి, మాట మార్చేవారు మన మధ్యనే ఉన్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది.. ప్రజల కోసం ఏం ఆలోచించింది.. మళ్లీ అధికారం వస్తే ఏ వాగ్దానాలను నెరవేర్చుతుంది అని ఆలోచించి ఓటు వేయాలి. డబ్బుకట్టల అహంకారంతో, పిచ్చి రాజకీయాలతో వచ్చేవారికి, పూట పూటకు పార్టీలు మారేవారికి అవకాశమిస్తే వాళ్లు మాత్రమే గెలుస్తారు. కానీ ప్రజలు ఓడిపోతారు’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పనితీరును సీఎం కేసీఆర్ అభినందించారు. అసలైన నాయకత్వ లక్షణాలున్న నాయకుడని, ప్రజలతో చనువుగా, చొరవగా ఉంటారని ఉపేందర్‌రెడ్డి ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే ఉండటం పాలేరు ప్రజల అదృష్టమని అభివర్ణించారు. తరతరాలుగా అన్యాయానికి గురైన దళితులను ఆదుకునేందుకు దళితబంధును దశల వారీగా అమలుచేస్తున్నామని, సత్తుపల్లిలో అమలుచేశామని వివరించారు. ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం మాదిరిగా పాలేరు నియోజకవర్గం మొత్తం దళితబంధు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. కోట్లు, నోట్లు పట్టుకొచ్చేవారు ఏమీ చేయబోరని, అదే దళితబంధు వస్తే దళితులు బాగుపడతారని వివరించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే సాగర్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఖమ్మం జిల్లాలో కరువు పీడ శాశ్వతంగా తీరిపోతుందని, పాలేరులో కరువు తొంగి చూడబోదని అన్నారు. భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా పాలేరుకు వచ్చారని, 45 ఏండ్లల్లో 40 ఏండ్లు కరువుకాటకాలకు గురైన పాలేరుకు నీళ్లు రావడం చూసి సంతోషం వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా హామీలివ్వలేదని, తెలంగాణ సంపద ఎట్టెట్ల పెరుగుతుందో, ఆర్థికంగా బలోపేతమవుతుందో.. ఆ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచాలనే విధానంతో ముందుకు సాగుతున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మిని మొదట రూ. 50 వేలు, ఆ తర్వాత రూ.75 వేలు, ఆపై రూ. లక్షా పదహారు రూపాయలకు తీసుకుపోయామని ఉదహరించారు. పెన్షన్లు గతంలో రూ.200 ఉంటే, మొదట రూ.వెయ్యి, ఆ తర్వాత రూ.2 వేలు చేసుకున్నామని, ఈ దఫాలో గెలిచిన తర్వాత రూ.3 వేలకు పెంచుతామని, తరువాత సంవత్సరానికి రూ.500 పెంచుకుంటూ మొత్తంగా పింఛన్‌ను రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని, రైతుబీమా తరహాలోనే రాష్ట్రంలోని రూ.93 లక్షల కుటుంబాలకు బీమా చేయిస్తామని భరోసా ఇచ్చారు. రైతుబంధును తొలుత పంటకు రూ.4 వేలిచ్చుకున్నామని, ఆదాయం పెరిగిన తర్వాత రూ.5 వేలు చేసుకున్నామని, వచ్చే ఏడాది నుంచి రూ.12 వేలకు పెంచి.. క్రమంగా రూ.16 వేలకు చేస్తామని వివరించారు.