CM KCR | ఒకేరోజు నాలుగు సభలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరును సుడిగాలిలా చుట్టేశారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట ప్రచార సభలు పాలమూరు గుండెచప్పుడును వినిపించాయి. భారీగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్ వెంటేనని నినదించారు. పాలమూరు 50 ఏండ్ల బాధలకు బాధ్యులెవరో వివరిస్తూ సాగిన అధినేత కేసీఆర్ పదునైన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు కరువుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు గోస తప్పదని, ఇందుకు మన పక్కనే ఉన్న కర్ణాటకే ప్రత్యక్ష ఉదాహరణ అని హెచ్చరించారు. కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని, కరెంటు కోతలతో నీళ్లులేక పంటలు ఎండుతుండటంతో అక్కడి కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. ‘విద్వత్ ఉన్నటువంటి గద్వాల, వనపర్తి సంస్థాలతో ఒకనాడు పాలుగారిన జిల్లాగా పేరొందిన పాలమూరును సమైక్య రాష్ట్రంలో కరువు గతిపట్టించారు.
కృష్ణా నది పక్కనే పారుతున్నా గుక్కెడు నీళ్లకు నోచుకోలేదు. గద్వాల జిల్లాను గబ్బుపట్టించారు. కృ ష్ణా, తుంగభద్ర మధ్యలో ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటూకాకుండా ఆగం చేసి.. కరువు ప్రాంతంగా మా ర్చిన పార్టీ కాంగ్రెస్సే. జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రులు కూడా పునాదిరాళ్లు వేశారు తప్ప కశికెడు నీళ్లు కూడా తెచ్చిన పాపానపోలేదు. తెలంగాణ ప్రాజెక్టులను నాటి ఆంధ్ర పాలకులు రద్దు చేసి నా ఏ కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. అనంతపురం వరకు మా కృష్ణానీళ్లు తీసుకోపో అని మంగళహారతులు పట్టారు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్వరాష్ట్రంలోనే కరువు వెతలు తీరాయని వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పచ్చదనం పరుచుకుంటున్నదని, పాలమూరు ఎత్తిపోతలు పూ ర్తయితే ఇక ఢోకా ఉండదని తెలిపారు. పచ్చబడ్డ తెలంగాణను కరగనాకేందుకే కాంగ్రెస్, బీజేపీల ఆరాటం తప్ప ప్రజల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకద్ర, మక్తల్, గద్వాల, నారాయణపేటలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు మాయమవుతుందని, ధరణిని తీసేస్తారని.. అదే జరిగితే మళ్లీ పైరవీకారులు, దళారుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు. ఓటేసే ముందు ఆలోచించాలని, బీఆర్ఎస్నే అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మీ బిడ్డ కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించండి
కాంగ్రెస్ రాజ్యంలో నెట్టెంపాడు 20 వేల ఎకరా లు కూడా పారేది కాదని, ఇవాళ 1.60 లక్షల ఎకరాలకు పారుతుందని కేసీఆర్ తెలిపారు. రేలంపాడు రిజర్వాయర్ పెద్దగా చేసి నీళ్లు తీసుకెళ్తే ఇవాళ కొంచెం గద్వాల పచ్చబడ్డదని, గట్టు మండలానికి కూడా నీళ్లు కావాలని ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అడిగితే గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గద్వాలను జిల్లా కేంద్రం చేసుకున్నామని, అద్భుతమైన కలెక్టరేట్‌తోపాటు అన్ని ఆఫీసుల సముదాయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాకముందు గద్వాల ఎట్టుండేదో? ఇప్పుడు ఎట్లున్నదో? ఒకసారి ఆలోచించాలని సూచించారు. గద్వాల ప్రజల బిడ్డ కృష్ణమోహన్ రెడ్డిని గతం కంటే మరో 10 వేల ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Kcr 01
ఆయకట్టులో మక్తల్ నంబర్ 1
సంగంబండ రిజర్వాయర్, బీమా ప్రాజెక్టు ఎన్నో ఏండ్ల కలని, కాంగ్రెస్, తెలుగుదేశం పాలకులు గెలికి అక్కడ పెట్టారు తప్ప వేటినీ పూర్తి చేయలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే వాటిని పూర్తిచేశామని, సంగంబండ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లతో మక్తల్, కృష్ణమండలం, మాగనూరు, నర్వ, అమరచింత తదితర మండలాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయని, నేడు తెలంగాణలో అతి ఎక్కువ ఆయకట్టున్న నియోజకవర్గాల లెక్కతీస్తే మక్తల్ నంబర్ వన్ స్థానంలో ఉందని సంతోషం వ్యక్తంచేశారు.
ఆ నీటితోనే నేడు 150 చెరువులను నింపుతున్నామని, మక్తల్ పూర్తిగా పచ్చబడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి మాట గట్టిగా ఉన్నా మనసు మాత్రం వెన్నలాంటిదని తెలిపారు. తండ్రి నర్సిరెడ్డి తరహాలోనే రామ్మోహన్‌రెడ్డి మంచి ప్రజా నాయకుడిగా ఎదిగారని, ఆయన బాటలోనే నడుస్తున్నారని వివరించారు. రామ్మోహన్‌రెడ్డిని గెలిపిస్తే ఆత్మకూరు రెవె న్యూ డివిజన్‌సహా ఇతర అన్ని డిమాండ్లను నూరుశాతం పూర్తిచేస్తామని, ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే ఉత్తర్వులు జారీచేస్తామని భరోసా ఇచ్చారు. గతంకంటే మరో 10 వేల ఎక్కువ మెజార్టీతో రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలని, ఎన్నికలైన తర్వాత తానే స్వయంగా మక్తల్ విచ్చేసి ఒకరోజంతా పార్టీ నాయకులు, అధికారులతో గడిపి మక్తల్‌కు కావాల్సిన పనులన్నీ చేసిపెడతానని హామీ ఇచ్చారు.
పథకాల సాయం కూడా పెంచుతాం
తెలంగాణ రాకముందు మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్లు లేవని, వలసలు, కరువులు, భయంకరమైన పేదరికం ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడు-నాలుగు నెలలు ఆర్థిక నిపుణులతో మేధోమథనం చేసి ఒక ప్రణాళిక వేసుకుని పింఛన్లను వెయ్యికి పెంచామని, ఆ తర్వాత 2 వేలు చేశామని, కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా 50 వేలతో మొదలు పెట్టి లక్ష చేశామని వివరించారు. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న రీతిలోనే, ఉద్యోగుల వేతనాలను పెంచుతున్న తరహాలోనే సంక్షేమ పథకాల కింద అందించే సాయాన్ని పెంచుతూ పోతున్నామని తెలిపారు.
ఎన్నికల తర్వాత మార్చిలో పింఛన్లను తొలుత రూ.3 వేలకు పెంచనున్నామని, ఐదేండ్లలో 5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నదని, ఈనేపథ్యంలోనే రాష్ట్రంలోని 93 లక్షల మంది రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యాన్ని అందించనున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అని, రాష్ట్రంలోని ప్రతి దళితకుటుంబానికి రూ.10 లక్షలు అం దించేవరకూ పథకం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని, అందరూ మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
మనం గొడగొడ ఏడ్సుకుంట వలసపోయిన నాడు ఒక కాంగ్రెస్, బీజేపోడు ఎవడన్నా జై తెలంగాణ అన్నడా? మన చెవులతో విన్నామా? మనం జై తెలంగాణ అంటే.. మనల్నే జైళ్లో ఏసిన్రు. చంపినరు. కొట్టినరు. లాఠీచార్జీలు చేసి అనేక కేసులు పెట్టినరు. కానీ.. ఏనాడూ జై తెలంగాణ అనలేదు.
-సీఎం కేసీఆర్
స్వరాష్ట్రంలో తీరిన కరువు
స్వరాష్ట్రంలో పాలమూరు రూపురేఖలు మార్చినట్టు సీఎం కేసీఆర్ వివరించారు. నాటి మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేల సాయంతో పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామని వివరించారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నారాయణపేట, మహబూబ్‌నగర్, కొడంగల్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్ అన్ని ఎగువ ప్రాంతాలకు సైతం నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, కాలువల తవ్వకం పనులు టెం డర్ల దశల్లో ఉన్నాయని, ఎన్నికల తర్వా త ఏడెనిమిది మాసాల్లో పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.
వచ్చిన తెలంగాణ గట్టున పడాలె. పల్లెలు సల్లగా ఉండాలె. వ్యవసాయం స్థిరీకరణ జరగాలె. దానికోసం రైతుబంధు స్కీమ్ తీసుకొచ్చాం. అయినప్పటికీ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడుతున్నారు. రైతుబంధు దుబారానా? రేవంత్ 4 గంటల కరెంట్ వేస్ట్ అని, 3 గంటలు ఇస్తే సరిపోతుందని అంటున్నాడు. వాళ్లను నమ్మి ఓటేస్తే కరెంట్, రైతుబంధు మాయమైతది. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలె.
-సీఎం కేసీఆర్
చేతికి ఓటేస్తే కరెంటు మాయం?
పక్కనే ఉన్న కర్ణాటకలో దారుణమైన పరిస్థితులున్నాయని, అక్కడి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారని కేసీఆర్ తెలిపారు. అయినా అక్కడి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి తాము 5 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారని, 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ర్టానికి వచ్చి 5 గంటల కరెంటిస్తామని మాట్లాడేందుకు ఇజ్జతన్నా ఉండాలని నిప్పులు చెరిగారు. కర్ణాటక ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు 4 గంటలు కూడా కరెంటు ఇస్తలేరని వివరించారు. ‘కాంగ్రెస్‌ను మళ్లీ తీసుకువచ్చుకుని కరెంటు మా యం చేసుకుందామా?’ అని ప్రశ్నించారు. తాము గెలిస్తే ఆ ధరణిని కూడా తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలందరూ చెప్తున్నారని, మరి ధరణి తీసేస్తే మరి పరిస్థితి ఏంటి? అని ప్ర శ్నించారు. కాంగ్రెస్‌నే బంగాళాఖాతం లో విసిరేయాలని, ఆ పని చేస్తనే తెలంగాణ బాగుంటదని పిలుపునిచ్చారు.
వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషిచేస్తాం
పాత పాలమూరు జిల్లాలోనే వాల్మీకి బోయలు అతిపెద్ద సంఖ్యలో ఉంటారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. వారిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రా ప్రాంతంలోని బోయలను ఎస్టీల్లో చేర్చి, తెలంగాణ బో యలను మాత్రం బీసీల్లో చేర్చారని వివరించారు. ఆ కాంగ్రెస్ మొదటి సీఎం చేసిన పాపంవల్ల ఇప్పటికీ మనం బాధపడుతున్నామని తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఇప్పటికే తెలంగాణ శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి, కేంద్రానికి పంపినట్టు గుర్తుచేశారు. అయినా మోదీ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని, ఇప్పటికీ నిర్ణయం తీసుకోవడంలేదని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్రం మెడలు వంచి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు.
ఆళ్ల కాదు.. చెక్‌డ్యామ్ వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి చాలా గట్టోడని, ఆయన పేరు ఇక నుంచి ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి కాదని, చెక్‌డ్యామ్ వెంకటేశ్వర్‌రెడ్డి అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. పట్టుబట్టి 30 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించి.. సుమారు లక్ష ఎకరాల్లో పంటలు పండించే స్థితికి తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి యువ నేతలను గెలిపించుకోవల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. చెట్లు పుట్టలు తిరిగి కరివెన రిజర్వాయర్ కట్టుకొన్నామని, అతి త్వరలోనే కరివెన ద్వారా 70 వేల ఎకరాలకు నీళ్లు పారుతాయని, వెరసి దేవరకద్రలోని లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని భరోసా ఇచ్చారు.
ఆ పార్టీలకు ఓటేందుకెయ్యాలి?
పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించి ఉప్పెనలా పోరాడితే, చావు నోట్లో తలపెడితే గత్యంతరం లేక తెలంగాణ ఇస్తామని చెప్పి ఒప్పుకొని కూడా ఏడాది కాలయాపన చేశారని, వందల మందిని బలితీసుకొని తెలంగాణ ఇచ్చారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకించినా, జబర్దస్తీగా కాంగ్రెస్ పాలకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రల కలిపారని, వందల మందిని కాల్చి చంపారని, తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు. పదేండ్లలో రాష్ర్టానికి మోదీ చేసింది గుండుసున్నా అని, మరి ఆ రెండు పార్టీలకు ఓటెందుకు వెయ్యాలని నిలదీశారు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో కడితే.. తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలేదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, నూరుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని, మరి అలాంటి బీజేపీకి ఓటెందుకు వేయ్యాలని ప్రశ్నించారు. ఓటేసే ముందు ఆలోచించాలని, ఏమాత్రం పొరపాటు చేసినా వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లయితదని, మళ్లీ మొదటికే వస్తామని హెచ్చరించారు.
పచ్చని పంటల నారాయణపేటే నా కోరిక
నారాయణపేట జిల్లా తెలంగాణలోనే ప్రత్యేకత కలిగి ఉన్నదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత ఏర్పాటైన రెండో మున్సిపాలిటీ నా రాయణపేటని, ఆ తర్వాతనే చాలా మున్సిపాలిటీలు ఏర్పాడ్డాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు ఉద్యమంలో నారాయణపేటలో అనేక సభలు పెట్టామని, ఆ రోజు ఎక్కడ చూసినా ఎడారిగా కనిపించేదని, పంటలు లేవని, వాన పడితే దేవుడి దయ, మొత్తం నారాయణపేట నుంచి బొం బాయికి బస్సులు, వలసలపాలైనం, కరువుల పాలయ్యామని గుర్తుచేశారు. రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తామని చెప్పామని, హామీని నిలబెట్టుకున్నామని, ఎమ్మెల్యే, ప్ర స్తుత బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట ఎంతో అభివృద్ధిని సాధించిందని ప్రశంసించారు.
నారాయణపేటను జిల్లాగా చేయడంతోపాటు మెడికల్ కాలేజీ వచ్చిందని, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలతో అనేక సంస్థలను కూడా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాజేందర్‌రెడ్డి చురుగ్గా ఉంటారని, నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు అంకితాభావం తో కృషి చేస్తున్నారని అభినందించారు. పాలమూరు ఎత్తిపోతలతో సాగునీళ్లు రానున్నాయని, జయమ్మ చెరువును కూడా నింపేందు కు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. కర్ణాటక బార్డర్‌లోని కానుగుర్తి వద్ద ఎత్తు ప్రదేశంలో రిజర్వాయర్ కట్టి లిఫ్ట్ పెట్టి నియోజకవర్గంలోని ఎత్తయిన ప్రాంతాలకు కూడా నీరందిస్తామని చెప్పారు. రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పాలమూరులో గంజికేంద్రాలు పెట్టిందే కాంగ్రెస్. జిల్లాను దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఏమీ చేయలేదు. వలసపోయినా.. గొడగొడ ఏడ్చినా.. ఎవరూ మాట్లాడలేదు. మంత్రి పదవులిస్తే నోర్లు మూశారు. కాంట్రాక్టులు పట్టుకొని పైకి వచ్చారు తప్ప ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లడలేదు. తెలంగాణ జెండా ఎత్తలేదు.
-సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పాలనలోనే పాలమూరు సర్వనాశనం
కాంగ్రెస్ పాలనలోనే ఉమ్మడి పాలమూరు సర్వనాశనం అయ్యిందని కేసీఆర్ మండిపడ్డారు. ‘పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయె.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మంమెట్టు పండలు ఎండిపా యె’ అని ఉద్యమంలో తానే స్వయంగా పాటలు రాశానని వివరించారు. ‘గంజికేంద్రాలు పెట్టిందే కాంగ్రెస్. తుంగభద్ర, కృష్ణానదులు ఒర్సుకుంటా పారే జిల్లాలో గంజి, అంబలి కేంద్రాలు పెట్టించారు. తెలంగాణ ప్రాజెక్టులను నాటి ఆంధ్ర పాలకులు రద్దు చేసినా ఏ కాం గ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు’ అని మండిపడ్డారు. 1974లో నాడు బచావత్ ట్రిబ్యునల్ నదుల నీళ్ల పంపకాలు చేస్తుంటే పాలమూరుకు చెందిన ఒక్క కాంగ్రెస్ నేత కూడా తమకు నీళ్లు కావాలని అడగలేదని అన్నారు. 40-50 ఏండ్లపాటు కరువును, వలసలను అనుభవించిన తీరును జిల్లా మర్చిపోవద్దని, ఆ గతి పట్టించిన కాంగ్రెస్‌ని తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Brs
మళ్లీ వచ్చేది కారే.. సీఎం కేసీఆరే..
దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మూసాపేట, నవంబర్ 6: కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ వచ్చేది కారే.. సీఎం కేసీఆరే అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర లో సోమవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభ లో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ లో 10 మంది సీఎం అభ్యర్థులున్నారని, సీఎం కుర్చీ కోసం కొట్లాడుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. 50 చోట్ల అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని తెలిపారు. బీఆర్ఎస్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారికి కాంగ్రెస్ టి కెట్లు ఇచ్చిందని, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, గద్వాలలో ఎవరికి టికెట్లు ఇచ్చిందో గమనించాలని తెలిపారు. బీఆర్ఎస్ వదిలేసిన వారిని పట్టుకొని మేం గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడికి దమ్ముంటే గాంధీభవన్‌లో కూర్చొని అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు. పొరపాటున కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందని చెప్పారు.