కల్వకుర్తి: మహబూబ్‌నగర్ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో ఇవాళ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పాలనలో పేదరికం, వలసపోవుడు, బతుక పోవుడే ఉండెనని అన్నారు. లాంబాడీ బిడ్డలు హైదరాబాద్‌లో ఆటోలు నడుపాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పాలనలో అనేకమైన బాధలు అనుభవించినమని గుర్తుచేశారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చినం. పారిశ్రామిక విధానాన్ని, ఐటీ రంగ విధానాన్ని అద్భుతంగా తీసుకపోతున్నం. మరె కాంగ్రెసోళ్లు ఏమంటున్నరు..? కేసీఆర్ అనవసరంగ రైతుబంధు ఇస్తున్నడు అని మాట్లాడుతున్నరు. రైతు బంధు వేస్టా..? కాదు గదా..? కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, జైపాల్ యాదవ్‌ను మళ్లీ గెలిపిస్తే రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచుతం. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు చాలు అంటున్నరు. నిజంగా మూడు గంటల కరెంటు సరిపోతదా..? మరె 24 గంటల కరెంటు కొనసాగాలంటే ఏం జెయ్యాలె. ఇక్కడి నుంచి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలె. జైపాల్ యాదవ్ కమిటెడ్ పర్సన్. నా వెంటపడి రెండు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకొచ్చిండు. దాంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యింది. పాలమూరు ఎత్తిపోతల నుంచి ఈ నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నయ్’ అని చెప్పారు.
‘50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇయ్యక, నీళ్లు ఇయ్యక కరువు రాజ్యమేలింది. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది. ఉద్యమం చేసినోళ్లను కాల్చి చంపింది. అనేక బాధలు పెట్టింది. ఇప్పుడు పేదలకు, రైతులకు ఉపశమనం కల్పించి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నది. కల్వకుర్తి దగ్గరి నుంచి రింగ్ రోడ్డు గూడా వస్తున్నది. దాంతో నియోజకవర్గ పరిస్థితే మారిపోతుంది. ఇక్కడి 40 తండాలను గ్రామ పంచాయితీలు చేసుకున్నం. గిరిజన బిడ్డల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకున్నం. యాదవ సోదరులకు గొర్రెలను పంచినం. ఇవన్నీ మీ కండ్ల ముందు ఉన్నయ్. కాంగ్రెసోళ్లు ఏమీ చెయ్యలే. ఇప్పుడు వాళ్లే మళ్ల అధికారంలోకి వస్తం అంటున్నరు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తం అంటున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ధరణిని తీసేస్తే ఏమైతది..? మళ్లీ దళారీ రాజ్యం వస్తది. లంచాలు ఇస్తెనే పనులు జరిగే రోజులు వస్తయ్. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కాట గలుస్తది. రైతుబంధుకు రామ్రామ్. దళితబంధుకు జైభీమ్. కాబట్టి అన్నీ ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా’ అన్నారు.
‘కల్వకుర్తికి కొత్తగా వస్తున్న ఫార్మా పరిశ్రమ కూడా ఇక్కడి ప్రజలకు మేలు చేస్తది. బీసీలకు టికెట్లు రాని కాడ రాలేదు. వచ్చిన కాడనన్న గెలిపియ్యాలె. కల్వకుర్తిలో బీసీ బిడ్డలంతా ఓటేసి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలె. జైపాల్ యాదవ్ ప్రజల మనిషి. ప్రజల మధ్య ఉంటడు. ప్రజల శ్రేయస్సు కోరేవాడు. ఆయన గెలిస్తే మీకు లాభం జరుగుతది. ఆయన కోరిన ప్రకారంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి 1.50లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది. మరికొన్ని పనులకు సంబంధించి జైపాల్ యాదవ్ నాకు మెమొరాండం ఇచ్చిండ్రు. ఆ పనులన్నీ తప్పకుండా చేసి పెడుతనని నేను మనవి చేస్తున్న. కాబట్టి జైపాల్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలె’ అని కోరారు.