వేములవాడ: బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును రద్దు చేశామని తెలిపారు. పాత బకాయిలను కూడా రద్దు చేశామని, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొంటున్నదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
‘తెలంగాణలో ఇన్ని రకాలుగా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే.. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూడలేదా..? ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలలను కల్లోలిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసి.. ఎంత మంది యువకులను కాల్చిచంపిండ్రు..? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండె. ఎమర్జెన్సీ పెట్టి ఎంత మందిని జైళ్లల్ల పెట్టిండ్రు..? ఏమన్న మంచి జరిగిందా..? వెనుకట ఎవన్నో తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే.. బాగా మెక్కి రోజూ మీ ఇంట్లో ఇట్నే జరగాలె అన్నడట. ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ మళ్లా ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటే ఎవరి కొంప ముంచడానికి..? ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్టీ రామారావు వచ్చినంక రూ.2కే కిలో బియ్యం పథకం ఎందుకు తెచ్చినట్టు నాకు అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి రాజ్యమేలిందనేగా ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకం తెచ్చింది’ అని సీఎం అన్నారు.
‘తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. కర్ణాటక నుంచి ఇంకో కాంగ్రెసాయన డీకే శివకుమార్ వచ్చి మేం మా రాష్ట్రంల 5 గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్తున్నడు. మరె ఈ మూడు గంటలు, ఐదు గంటలు కరెంటు ఇస్తే వ్యవసాయం ఎట్ల సాగాలె. రైతులు మళ్ల రాత్రిపూట కరెంటు కోసం బావుల కాడికిపోయి సావాల్నా..? ఇంకో మాట ఏమంటున్నరు..? ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తరట. భూమాత పోర్టల్ తెస్తరట. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి మేం ధరణి పోర్టల్ తీసుకొస్తే.. మళ్ల భూమేత కోసం వాళ్లు భూమాత పోర్టల్ తెస్తరట. ఇయ్యన్నీ మీరు బాగా గమనించాలె. కాంగ్రెస్ మాటలపై గ్రామాల్లో బాగా చర్చించాలె. లేకపోతే మోసం జరుగుతది’ అని చెప్పారు.
‘ప్రజా సంక్షేమం విషయంలో గానీ, రైతుల విషయంలో గానీ, అభివృద్ధి విషయంలో గానీ బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటది. రమేశ్ గారు ఎమ్మెల్యేగా వేములవాడ చుట్టూ రింగు రోడ్డు వేయించిండు. మన బద్ది పోశమ్మ గుడికాడ ఇరకాటం ఉండె. రూ.19 కోట్లతో ఒక ఎకరం జాగ తీస్కొని విశాలం చేయించిండు. వేములవాడ మందిరం గూడా చాలా ఇరకాటం ఉండె. ఇప్పుడు 30 ఎకరాల జాగ తీస్కొని విశాలంగా చేసుకుంటున్నం. రాజన్న మన ఇంటి ఇలవేల్పు కాబట్టి, అందరం మొక్కుతం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మూలవాగు వెంట కూడా చాలా అభివృద్ధి చేసేది ఉన్నది. యాత్రికుల కోసం కాటేజీలు నిర్మించే పని ఉన్నది. అది గూడా చేసుకుందాం. కలికోట సూరమ్మ చెరువును గూడా వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్తున్నా’ అన్నారు.
‘మల్కపేట రిజర్వాయర్ పూర్తిచేసుకుని ఒక టీఎంసీ నీళ్లు గూడా నింపుకున్నం. ఈ ప్రాంతం కోసం ఎన్నో పోరాటాలు చేసిన క్రీస్తు శేషులు సీహెచ్ రాజేశ్వర్‌రావు పేరునే ఈ రిజర్వాయర్‌కు పెట్టుకున్నం. ఎన్నికల తర్వాత నేనే వచ్చి దాన్ని ప్రారంభిస్తా. ఈ ఏరియాలో బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. కరువు కాటకాలకు ఆలవాలంగా ఉన్న వేములవాడ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నది. కాబట్టి ఇసుంటి సమయంలో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్ల మోసపొతం. లక్ష్మినరసింహారావు మంచి వ్యక్తి, చవుకున్నవాడు, వేములవాడ నియోజకవర్గ ముఖ చిత్రం మార్చాలన్న ధ్యేయంతోనే తాను ఎన్నికల బరిలో దిగిన అని చెప్తున్నడు. కాబట్టి మీరు ఆయనను మంచి మెజారిటీతో గెలిపించాలని నేను మనవి చేస్తున్నా’ అని సీఎం కోరారు.