సత్తుపల్లి: ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బీఆర్ఎస్ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారమా..?
సభలో ఆయన ఏమన్నారంటే.. ‘ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు కరటక దమ్మదగ్గులున్నరు. బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..? సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్వాన్లా శాసనసభలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర్రావు ఖమ్మం పహిల్వాన్లా లోక్సభలో అడుగుపెట్టడా..? ఒక్కొక్కనికి ఎంత అహంకారం. నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’ అని తెలిపారు.
‘ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు. పార్టీల మధ్య పోరాటం. గత దశాబ్దాలుగా ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. పదేళ్లకు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఏండ్లు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.. ఇప్పుడు పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీకు తెలియదా..? అందుకే ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. కూరగాయలను కొనేటప్పుడు కూడా పుచ్చులు ఏరిపారేసి మంచివి తీసుకుంటం. అలాంటిది మన నాయకున్ని ఎంచుకునేటప్పుడు అటువంటి విచక్షణ చేయగూడదా..? కాబట్టి బాగా ఆలోచించి ఓటేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి’ అని సీఎం సూచించారు.