CM KCR | మందమర్రి : చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నా కొడుకు లాంటివాడు.. 60 వేల మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సుమన్ ప్రతిపాదించిన అంశాలన్నింటినీ సానుభూతితో పరిశీలిస్తాం. మంజూరు చేస్తాం. సుమన్‌ను ఈ ఎన్నికల్లో 60 వేల మెజార్టీతో గెలిపిస్తే మందమర్రికి డిగ్రీ కాలేజీ తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిండు, జైలుకు వెళ్లిండు. తెలంగాణ తెచ్చేదాకా కొట్లటాడిండు. మీ ఆశీర్వాదంతో మొదలు ఎంపీ అయిండు. ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే అయిండు. సుమన్ రాకముందు, సుమన్ వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. వర్షాలు, వరదలు వస్తే చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయేవి. 22 బ్రిడ్జిలు కట్టించారు. ఇంకో 20 కడుతున్నారు. రోడ్లు వేసుకున్నాం. సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. ఐటీఐ బిల్డింగ్ కట్టుకున్నాం. ఒక తపనతో తెలంగాణ ఉద్యమ సాధనలో ఉన్న వ్యక్తి కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. సుమన్ రెండు పనులు చేస్తడు. ఇక్కడ మీకు సేవ చేస్తడు. పార్టీ కోసం హైదరాబాద్‌లో ఉండి సేవ చేస్తడు. నా కొడుకు లాంటి వాడు.. పార్టీ వ్యవహరాలు చూసుకుంటున్నాడు. సీఎం చేయి కిందనే ఉంటాడు కాబట్టి ఆయనను గెలిపిస్తే మీకు మంచి బెనిఫిట్ జరుగుతుంది. సూట్‌కేసులు పట్టుకొని వచ్చేవారిని నమ్మకండి. సూట్‌కేస్ గాళ్లు కావాల్నా.. పని కోసం తపన పడే సుమన్ కావాల్నా.. ఆలోచించాలి. ఇది కార్మిక ప్రాంతం. ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.