Palamuru | ‘అవ్వా! పైలం.. లచ్చుమక్క మా యవ్వను జర అర్సుకో..’ముంబయి బస్సు ఎక్కుతున్న పాలమూరు బిడ్డ చెప్పిన కన్నీటి వీడ్కోలు!
‘గీ పూట గంజి తాగి పండుకో బిడ్డా!రేపు ఇమానంగ జొన్నగట్క సేసిపెడ్త గదా!!’పొద్దుగూకితే ఇంటింటి నుంచి వినిపించే ఆకలి కేకలు ఇవి.
ఆ గడ్డన పుట్టిన మనిషి వలస శాపం అనుభవించాల్సిందే!ఇవన్నీ నిన్నటి గోసలు. కరువు రక్కసికి చిక్కిన పాలమూరు గుండెకోత.. కడుపుతరుక్కుపోయే గీతాలై వినిపించినా, కథలై పలకరించినా ఆనాడు కనికరించిన నాథుడు లేడు.
దశాబ్దాలుగా ఇక్కడ తిష్ఠ వేసిన కరువు తెలంగాణ వచ్చాక పరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం.. పాలమూరు ప్రజలు కలలోనూ ఊహించని రీతిలో ఆ ప్రాంతం తీరుతెన్నులను మార్చేసింది. నేలంతా ఈనిందా అన్నట్టుగా లక్షలాది ఎకరాల్లో ధాన్యసిరి చిందులేస్తున్నది.
ఇప్పుడు పరాయి రాష్ర్టాల నుంచి వలసొచ్చిన వారికి అన్నంపెడుతున్నది. ‘నింగిచూరులోని చుక్కలన్ని జారి.. నేలదారిలోన నీటిపూలై పారి.. వరదపొంగు నీరు వలికిన ఏరు.. ఎత్తిపోతల ఏటి తాళమేసింది.. పాలమూరును తాకి పరవశించింది’ అన్న గోరటి వెంకన్న పాట.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్ఎస్ప్రభుత్వం తెచ్చిపెట్టిన అదృష్టాన్ని ఎలుగెత్తి చాటుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు నుంచి ఏటా 14 లక్షల మంది వలస పోయేవారని అధికారిక లెక్కలు చెబుతు న్నాయి. సాగునీరు లేక.. ఉపాధి కరువై.. బరువెక్కిన గుండెతో మహానగరాలకు తరలి పోయేవారు అక్కడి ప్రజలు. అప్పటి ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి ముంబయి బస్సులు నడిచేవి. ప్రతి బస్సూ కిటకిటలాడేది. ఊరూరుకూ, ఇంటింటికీ ఆపుతూ బస్సు టాప్ ఎక్కి మరీ భారంగా ముంబయి బాటపట్టేవాడు పాలమూరు బిడ్డ. కన్నోళ్లు కన్నీటి పర్యంతం అవుతుంటే.. పుట్టిపెరిగిన ఊరును విడిచిపెట్టి.. కన్నీటి సుడులు ఆపుకోలేక.. ‘ఇదేం బతుకురా భగవంతుడా!’ అనుకుంటూ పయనమయ్యేవాడు.
అంతదూరం పోయినా వాళ్ల జీవితాలు కొంతైనా మారింది లేదు. పాలమూరు నుంచి తెగిపడ్డ బిడ్డలు ముంబయిలో అడ్డామీద పొద్దుతిరుగుడు పువ్వుల్లా అల్లాడిపోయేవాళ్లు. ఊళ్లో పది ఎకరాలు ఉన్న ఆసామీ, పదిగుంటలున్న బక్కరైతూ అందరూ అక్కడ కూలీలే! పని దొరికిన రోజు ఒక్కపూట తినేవాళ్లు. లేకుంటే పస్తులే. పండుగకు ఊరికి వెళ్లేనాటికి ఓ పది రూపాయలు కూడబెట్టాలన్న తపన వారిది. ఆకాశహర్మ్యాలపై ప్రాణాలకు తెగించి పని చేసేవాళ్లు కొందరైతే, పాచిపనులు చేసేవాళ్లు ఇంకొందరు. పూరి గుడిసెల్లో దయనీయంగా బతుకీడ్చేవాళ్లు. వలస జీవులు తరలి వెళ్లడంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారి నాటి పాలకుల అసమర్థతను వెక్కిరించేవి.
బిహార్ కూలీలు..
వెతలు తీరేలా
తరతరాలుగా మారని వెతలు.. తెలంగాణ రాకతో మూకుమ్మడిగా తీరిపోయాయి. పాలకుడు పట్టుబడితే ఎంతటి గట్టి ప్రయోజనం చేకూరుతుందో నేటి పాలమూరును చూస్తే తెలుస్తుంది. అర్ధశతాబ్దిగా పట్టుకున్న దారిద్య్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది పాలన సమూలంగా, కూకటివేళ్లతో సహా కూల్చివేసింది. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి బీడు భూములకు జీవం వచ్చింది. ఏండ్లుగా గొంతెండిన చెరువులు ఉప్పొంగి అలుగు పారాయి. ఇసుక దిబ్బలతో ఎడారిని తలపించిన వాగులు, వంకలు వరదలకు వంతపాడాయి. జలసిరిని చెక్‌డ్యాంలు ఒడిసిపట్టడంతో పాతాళం దిగువకు పడిపోయిన భూగర్భ జలాలు ఇలాతలానికి చేరువయ్యాయి.
ఇంతలా ఎలా మారింది?
తెలంగాణ రాకతోనే పాలమూరుకు మంచిరోజులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆ జిల్లాకు పట్టిన సుదీర్ఘ గ్రహణం వీడింది. కాంగ్రెస్ పాలకులు మధ్యలోనే వదిలేసిన భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో కృష్ణమ్మకు పాలమూరు చిరునామా తెలిసింది. ఉప్పొంగిపోయింది. బిరబిరా ఉరికింది. కాల్వలు దాటింది, చెరువులు చేరింది, పొలాలను తడిపింది. ప్రభుత్వం ఎక్కడికక్కడ మినీ లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంలు నిర్మించడంతో జిల్లాలో సాగు ఆరింతలైంది. మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా 2,945 చెరువులను బాగు చేసింది. 75 చెక్‌డ్యాంలు కట్టించింది. 2014లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద సాగు అయిన విస్తీర్ణం 2.28 లక్షల ఎకరాలైతే.. 2023 నాటికి అది 11.18 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పుడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం దీన్ని మరింత పెంచనుంది. సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పాలమూరు-రంగారెడ్డి’ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న ఐదు జలాశయాల ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందనుంది.
ఇప్పుడు ఎలా ఉంది?
నీళ్లు తెచ్చి ఇచ్చిన నాయకుడే సాగుబడిలో సాయమూ అందించాడు. రైతుబంధు, ఉచిత విద్యుత్ పథకాలు పాలమూరు రైతుకు వెన్నుదన్నుగా నిలిచాయి. అరకలన్నీ కదం తొక్కడంతో మెరకల్లో వరి వెన్నువిరుచుకొని నిలబడింది. చెలకల్లో పాలకంకి నవ్వింది. జొన్నచేలకు సుదూర తీరాల నుంచి పక్షులు వలస వచ్చాయి. పక్షులే తరలిరాగా.. బతుకు కోసం ముంబయి పోయిన బిడ్డలు ఇంకా అక్కడ ఎందుకు ఉంటారు? ఒక్కొక్కరుగా వచ్చారు. బృందాలుగా వచ్చారు. కర్షకుల స్వేదానికి ప్రతిఫలంగా నేలతల్లి పుట్లకు పుట్లు ధాన్యాన్ని కానుకగా ఇచ్చింది. కార్మికులకూ ఉపాధి దొరికింది. ఇన్నాళ్లూ సింహద్వారాన్ని పట్టుకుని వేలాడిన తాళం కప్పలు ఇంట్లో ఓ మూల గూట్లో దూరాయి. పల్లేర్లు మొలిచిన పల్లెల్లో కన్నీటి జాడ కనుమరుగైంది.
ప్రజలంతా వలస జిల్లాకు నేడు పక్కరాష్ర్టాల నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా పాలమూరుకు ఇప్పుడు రెండు లక్షల మంది వలస వస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. పాలమూరు రైతులు పొరుగు నుంచి వచ్చిన కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చే కూలీలతో నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5వేల లెక్కన కైకిలి ఇస్తున్నారు. కోతల సమయంలోనూ వారికి ఉపాధి కల్పిస్తూ, వారికి అన్నం పెడుతున్నారు.
మొత్తంగా ముఖ్యమంత్రి ముందుచూపుతో పాలమూరు జిల్లా వలసలు ఆగిపోవడమే కాకుండా.. ఇక్కడికే వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పాలమూరు తీరు మారింది. ఈ ఊరు మీద కట్టే పాట కూడా మారింది. ‘ఆనాడు పాలమూరంటే రెండు కండ్లల్ల కన్నీరు..ఇప్పుడు తాగునీరు.. సాగునీరు పాలమూరుకు రెండుకండ్లు.. పాలమూరు అంటే పాడిపంటల పాలసముద్రం.. పచ్చని పైరుల ఆకుపచ్చ రత్నం’అని కవులు కీర్తించే స్థాయికి పాలమూరు ఎదిగింది.
పెద్దమందడిలో వరినాట్లు వేస్తున్న పశ్చిమ బెంగాల్ కూలీలు
ఆగిన వలసలు..
నాగరికతకు ఆలవాలమైన జలరాశి పలకరించడంతో బరువు బతుకుల పాలమూరు పరువు ప్రతిష్ఠాత్మకంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా డిపోల నుంచి ముంబయికి వెళ్లే బస్సులన్నిటినీ నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. పాలమూరు జిల్లా నుంచి వలసలు ఆగిపోయాయి అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది?
‘పాలమూరు-రంగారెడ్డి’లో..
పాలమూరు పొలాల్లో మాత్రమే కాదు.. ఇక్కడి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లోనూ పొరుగు రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రాజెక్టులోని 18 ప్యాకేజీల్లో దాదాపు 8వేల మంది పనిచేస్తున్నారు. పోలేపల్లి సెజ్‌లో 8 ఏండ్లుగా పనిచేస్తున్న సుమారు 4 వేల మంది బీహార్, ఒడిశా, ఇతర రాష్ర్టాలకు చెందిన వాళ్లు ఇక్కడే స్థిరపడ్డారు. బాలానగర్, రాజాపూర్తోపాటు ఇతర పరిశ్రమల్లో వెయ్యి మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రైసుమిల్లుల్లో లోడింగ్.. అన్లోడింగ్ చేయడానికి ఏటా బీహార్ నుంచి సుమారు 4వేల మంది వచ్చిపోతున్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో పనిచేయడానికి బీహార్ నుంచి వచ్చిన 500 మంది కూలీలు ఇక్కడే స్థిరపడ్డారు. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా నుంచి వచ్చిన వాళ్లు జాతీయ రహదారుల వెంట దాబాలు పెట్టుకొని జీవనోపాధిని పొందుతున్నారు.
పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి!
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు, పరేషాన్ కావొద్దు. ఎవడో చెప్పిండని ఓటెయ్యొద్దు. మా బావమరిది చెప్పిండు, మా అన్న చెప్పిండు, మా మేనమామ చెప్పిండు అని ఎవరికి పడితే వారికి ఓటేయొద్దు. ఓటు మన తలరాతను మారుస్తది. మన రాష్ట్ర దిశను, దశను మారుస్తది. ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధం ఓటు. ఎన్నికలు అంటే పార్టీలు గెలుచుడు కాదు. ప్రజలు గెలవాలి. అదే నిజమైన ప్రజాస్వామ్య విజయం.
…? వెంకటేశ్వర్ రావు, మహబూబ్‌నగర్