గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 14:20:34

'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే'

'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే'

జ‌న‌గామ : ఇండియాలో ఏ రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. ధాన్యానికి మంచి ధ‌ర ఇద్దామంటే మెడ మీద క‌త్తి పెడుతున్నారు. ఈ ర‌క‌మైన చిక్కుల్లో మ‌నం ఉన్నాం. రైతుల బాధ‌లు, ఆత్మ‌హ‌త్య‌లను క‌ళ్లారా చూశాను. వాటిని చూసి బాధ‌ప‌డ్డాను. సీఎం అయిన త‌ర్వాత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నా. తెలంగాణ రైతాంగం భార‌త‌దేశంలోనే అగ్ర‌గామిగా ఉండాల‌ని ప్ర‌తిజ్ఞ తీసుకున్నాం. ఇది టెక్నాల‌జీ యుగం. అంద‌రి వ‌ద్ద స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ ఉంది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ వాస్త‌వాలు తెలుసుకోవాలి. రైతులు చ‌ర్చ చేయాలి.  

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు

క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇంకా ఉంది. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. సెకండ్ వేవ్ క‌రోనా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. తెలంగాణ రైతు లోకానికి దండం పెట్టి చెబుతున్నాను. ఈ వేదిక‌లో ప్ర‌పంచంలో, దేశంలో ఎక్క‌డా లేవు. క‌డ‌కొండ్ల‌లో రైతు వేదిక ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. రాజ్యం గెలిచినంతా సంతోష‌మైంది. కేబినెట్ స‌మావేశాల్లో చ‌ర్చ‌లు జ‌రిపి.. రైతు వేదిక‌లు నిర్మించాల‌ని సంక‌ల్పించాం. ఎన్ని వంద‌ల కోట్లు అయినా స‌రే ఖ‌ర్చు పెట్టి రైతు వేదిక‌ల‌ను నిర్మాణం చేశాం. రాష్ర్ట వ్యాప్తంగా 2601 రైతు వేదిక‌లు నిర్మిస్తున్నాం. మ‌రో వారం రోజుల్లో అన్ని వేదిక‌లు పూర్త‌వుతాయి. దాదాపుగా 600 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌న్నారు. గొప్ప ఉద్దేశంతో, అవ‌గాహ‌న‌తో ఈ వేదిక‌ల‌ను నిర్మించామ‌న్నారు. 

వ్య‌వ‌సాయ శాఖ‌లో ప్ర‌బ‌ల‌మైన మార్పులు

రాష్ర్ట స్థాయిలో వ్య‌వ‌సాయ శాఖ‌లో ప్ర‌బ‌ల‌మైన మార్సులు తీసుకువ‌స్తున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను నియ‌మించి పంట‌ల విధానంపై చ‌ర్చ చేస్తారు. మార్కెటింగ్ ప‌రంగా సూచ‌న‌లు చేస్తారు. ప్ర‌తి రైతుకు స‌మాచారం అందేలా అధికారులు ప‌ని చేస్తారు. అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ అధికారులు రైతుల‌కు పాఠాలు చెప్పి.. మెల‌కువ‌లు, సూచ‌న‌లు చెబుతారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. దీంతో రైతులు త‌ప్ప‌కుండా బంగారం పండిస్తారు. రైతు వేదిక‌ల్లో టీవీలు ఏర్పాటు చేస్తారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.