హైదరాబాద్ : సీఎం కేసీఆర్తో తమ బిడ్డకు నామకరణం చేయించాలని ఆ దంపతుల కల. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ దంపతుల కల ఎట్టకేలకు సాకారమైంది. వివరాల్లోకి వెళితే.. సురేష్ – అనిత దంపతులది భూపాలపల్లి మండలం నందిగామ. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. ఆ దంపతులిద్దరికి 2013లో ఆడబిడ్డ పుట్టింది.
తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే ఆ బిడ్డను పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన చొరవ తీసుకొని ఆదివారం సురేష్ – అనిత దంపతులతో పాటు తొమ్మిదేళ్ల చిన్నారిని ప్రగతి భవన్కు తోడ్కొని వచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు.. సురేష్ – అనిత దంపతులను దీవించి.. వారి తొమ్మిదేళ్ల బిడ్డకు ‘మహతి’గా నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి సీఎం దంపతులు బట్టలు పెట్టి, సంప్రదాయ పద్ధతిలో ఆథిత్యమిచారు. అలాగే బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్ని సైతం అందజేశారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంబ్రమాశ్చర్యానికి లోనైంది. ఈ సందర్భంగా దంపతులు సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.