హైదరాబాద్, జూలై 6( నమస్తే తెలంగాణ): మార్కెటింగ్ శాఖలో మార్కెట్ కార్యదర్శుల పోస్టింగ్‌ల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. పోస్టింగ్‌లు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. పత్తి కొనుగోళ్లలో అవినీతికి సంబంధించి విజిలెన్స్ నివేదికలో పేర్లు ఉన్న వారికి కూడా కీలక స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. .
మంత్రి వద్దన్నా.. కీలక పోస్టింగ్‌లు!
2023-24 సీజన్ పత్తి కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. పలు జిల్లాల్లో మార్కెట్ కార్యదర్శులు టెంపరెరీ రిజిస్ట్రేషన్ల పేర్లతో వ్యాపారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం 118 మందికి ఈ అవినీతిలో పాత్ర ఉన్నట్టు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో పేరు ఉన్నవాళ్లకు పత్తి కొనుగోళ్లు నిర్వహించే మార్కెట్లలో పోస్టింగులు ఇవ్వొద్దని, ప్రస్తుతం ఉన్నవాళ్లను సైతం బదిలీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ, మంత్రి ఆదేశాలను మార్కెటింగ్ శాఖలో ఓ అధికారి పెడచెవిన పెట్టినట్టు తెలిసింది. ఉన్నతాధికారులకు కుంటిసాకులు చెప్పి విజిలెన్స్ నివేదికలో పేర్లున్న వారికి మళ్లీ కీలక స్థానాలు కట్టబెట్టినట్టు సమాచారం. 2023-24 సీజన్లో అవినీతి జరుగగా, విజిలెన్స్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా 2024-25 సీజన్లోనూ వారినే ఆ పోస్టుల్లో కొనసాగించినట్టు తెలిసింది. ఇలా ఏఎంసీ ఘన్పూర్, ఏఎంసీ నెక్కొండ, ఏఎంసీ కొత్తగూడెం, ఏఎంసీ సుల్తానాబాద్‌లో వారినే కొనసాగించినట్టు తెలిసింది. ఏఎంసీ జనగామలో ఓ సూపర్వైజర్ను అదే స్థానంలో కొనసాగించినట్టు సమాచారం. మంత్రి ఆదేశాల మేరకు వారికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి పాత స్థానాలను పదిలంగా ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నచ్చితే నజరానా… లేదంటే జరిమానా
ఈ మొత్తం వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ హెడ్ ఆఫీసులోని ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదికలో పేర్లు ఉన్నవారందరికీ ఒకే విధంగా పనిష్మెంట్ ఇవ్వకుండా తనకు నచ్చిన వారికి కీలక స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించిన సదరు అధికారి.. గిట్టని వారికి ఉన్న పోస్టింగ్‌లను కూడా లేకుండా చేసినట్టు తెలిసింది. సస్పెండైన ఓ సెక్రటరీకి రీఇనిస్టేట్లో కామారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వగా, సదరు సెక్రటరీని ఓడీపై కరీంనగర్‌కు పంపించినట్టు తెలిసింది. అదే విధంగా ములుగులో ఉన్న ఓ కార్యదర్శికి ఆ తర్వాత రెండు కీలక ఏఎంసీ బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. ఓ కార్యదర్శికి అప్పటికే ఉన్న ఇన్చార్జి పోస్టును కూడా పీకేసినట్టు తెలిసింది. అదేవిధంగా మరో కార్యదర్శికి కీలకమైన మార్కెట్ నుంచి తప్పించి పండ్లు, కూరగాయలు అప్పగించినట్టు తెలిసింది. మరికొందరికి పాత స్థానాల్లోనే కొనసాగేలా సాయపడినట్టు సమాచారం. ఇలా వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఉండదన్నట్టుగా మార్కెటింగ్ శాఖలోనూ తప్పు చేసిన వారిలో కొందరికి సదరు అధికారి నజరానా ప్రకటించడంతోపాటు మిగిలిన వారికి జరిమానా విధించారనే చర్చ మార్కెటింగ్ శాఖలో జరుగుతున్నది. పోస్టింగ్‌ల వ్యవహారంలోనూ భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారికి భారీ మొత్తంలోనే ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖలో ఇక భవిష్యత్తు తనదేనంటూ ఉద్యోగులందరినీ బెదరగొడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్ల అవినీతిలోనూ సదరు అధికారికి భాగస్వామ్యం ఉండే ఉంటుందనే అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.