హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ తీరుతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన సేవలందిస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 1200-1500 మంది డాక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన సేవలందిస్తున్నారు. వీరి కాంట్రాక్టు పొడిగింపునకు సంబంధించి ఏప్రిల్లో జీవో రావాల్సి ఉండగా.. జూలై వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కామారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి 20 మంది సీనియర్ రెసిడెంట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను టెర్మినేట్ చేస్తూ సదరు కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేయడం వారిలో మరింత భయాందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు ఉత్తర్వులు లేనందున విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై వైద్యులు మండిపడుతున్నారు. మూడు నెలలుగా కాంట్రాక్టు పొడిగింపు జీవో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జీవో లేదనే సాకుతో వైద్యులను ఉద్యోగాలను నుంచి తొలగిస్తున్నాయని వాపోయారు.
ఖాళీలు ఉన్నా.. కనికరం లేదు
మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్లో ఇప్పటికే వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను తొలగించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి, మెరుగైన వైద్య విద్య అందేందుకు కృషి చేస్తున్న వైద్యులను ఇలా అవమానకరంగా తొలగించడంపై వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో నాణ్యమైన వైద్య విద్య, రోగులకు చికిత్స ప్రశ్నార్థకంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యేంత వరకు అనుభవం కలిగిన కాంట్రాక్టు సిబ్బంది అందుబాటులో ఉండ టం తప్పనిసరి అని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నదని చెప్తున్నారు. మరోవైపు వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టు వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.