Statins | ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి స్టాటిన్స్ (Statins) అనే మందులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనవిగా గుర్తింపు పొందాయి. అయితే కొంతమందిలో ఈ మందుల వాడకం వల్ల కండరాల నొప్పి, బలహీనత, తిమ్మిర్లు, అలసట వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ఈ సమస్యలకు గల కారణంపై కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. స్టాటిన్స్ తీసుకునే కొంతమందిలో కండరాలకు సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయనే అంశంపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా కండరాలు దెబ్బతిన్నప్పుడు రక్త పరీక్షల్లో కనిపించే మార్పులు ఈ రోగుల్లో ఎక్కువగా కనిపించకపోవడం వల్ల అసలు కారణాన్ని గుర్తించడం కష్టమైంది. అయితే తాజాగా ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, స్టాటిన్స్ కండర కణాల్లో వాపును ప్రేరేపించే డేంజర్ సిగ్నల్స్ ను యాక్టివేట్ చేసి కండరాల బలహీనత, కండరాల క్షీణతకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
పరిశోధనలో స్టాటిన్స్ కేవలం కొలెస్ట్రాల్ ఉత్పత్తిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన ఐసోప్రెనాయిడ్స్ (Isoprenoids) అనే ముఖ్యమైన సమ్మేళనాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తున్నట్లు తేలింది. ఈ సమ్మేళనాలు కండర కణాల సాధారణ పనితీరుకు కీలకంగా పనిచేస్తాయి. వీటి స్థాయిలు తగ్గిపోతే కండర కణాల్లోని కొన్ని ప్రోటీన్లు సరిగా పనిచేయలేక కణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని శరీరం ప్రమాద సంకేతంగా గుర్తించి వాపును ప్రేరేపించే ప్రక్రియను ప్రారంభిస్తుందని పరిశోధకులు వివరించారు. ఈ వాపుకు కారణమయ్యే ప్రధాన వ్యవస్థను ఎన్ఎల్ఆర్పీ3 ఇన్ఫ్లమసోమ్ అంటారు. సాధారణంగా ఇది శరీరంలో హానికర పదార్థాలు లేదా కణ నష్టాన్ని గుర్తించి రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. అయితే ఇది అధికంగా యాక్టివేట్ అయితే అవసరానికి మించిన వాపు ఏర్పడి కండర కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రక్రియలో క్యాస్పేస్-1 (Caspase-1) వంటి ఎంజైమ్లు యాక్టివేట్ అయి కండరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది.
అలాగే కండరాల క్షీణతకు సంబంధించిన అట్రోజిన్-1 (Atrogin-1) అనే ప్రోటీన్ స్థాయిలు కూడా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కాలక్రమేణా కండరాలు చిన్నవిగా మారి వాటి బలం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన విషయం.. స్టాటిన్స్ వల్ల వచ్చే కండరాల సమస్యలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవు. ఇప్పటికే శరీరంలో తక్కువ స్థాయిలో వాపు, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కండర కణాలు స్టాటిన్స్కు మరింత సున్నితంగా స్పందిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ మోతాదులో మందు తీసుకున్నా కండరాల క్షీణతకు సంబంధించిన మార్పులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనం సూచించింది. జన్యుపరమైన అంశాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే కండరాల పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా చాలా మంది రోగులు బలహీనత, అలసటను అనుభవిస్తున్నారని అధ్యయనం తెలిపింది. అంటే సాధారణ పరీక్షల్లో పెద్దగా సమస్య కనిపించకపోయినా కండరాల పనితీరు ప్రభావితమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. పరిశోధనలో ఐసోప్రెనాయిడ్స్ స్థాయిలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కండర కణాల్లో ఏర్పడే హానికర మార్పులు తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఎన్ఎల్ఆర్పీ3 ఇన్ఫ్లమసోమ్ను అడ్డుకోవడం వల్ల కూడా కండరాల నష్టం తగ్గే అవకాశం కనిపించింది. అయితే ఇవి ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉన్నాయని, భవిష్యత్తులో ఈ మార్గాలను లక్ష్యంగా చేసుకుని కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం నేపథ్యంలో స్టాటిన్స్ను స్వయంగా ఆపేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇవి ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన మందులుగా కొనసాగుతున్నాయి. స్టాటిన్స్ తీసుకుంటున్న సమయంలో కండరాల నొప్పి, బలహీనత లేదా దీర్ఘకాలిక అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అవసరమైతే మందు మోతాదును మార్చడం, మరో రకమైన స్టాటిన్కు మారడం లేదా ప్రత్యామ్నాయ చికిత్సలను పరిశీలించడం ద్వారా సమస్యను నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.