హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా ఉద్యమిద్దామని చెప్పారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని నిప్పులు చెరిగారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. విభజన చట్టం హామీలను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతు వేసే ప్రతి గింజకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా షబ్ కమిటీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరయ్యారు.