సిద్దిపేట, నవంబర్23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రంగారెడ్డి/వికారాబాద్/సంగారెడ్డి: జన నినాదాలతో మహేశ్వరం నియోజకవర్గం మార్మోగింది.. వికారాబాద్ జనసంద్రమైంది.. కదిలొచ్చిన ఊరూవాడ జనంతో పటాన్చెరు దద్దరిల్లింది.. జహీరాబాద్ జైకొట్టింది.. గురువారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షం కురుస్తున్నా జనం దండులా తరలిరావడంతో జన జాతరను తలపించింది. వృత్తిదారుల వేషధారణలు, బతుకమ్మ, బోనాల నృత్యాలతో కళాకారులు సందడి చేశారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.
ఈలలు, చప్పట్లతో సభాప్రాంగణం మార్మోగింది. వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్లో బీఆర్ఎస్ అభ్య ర్థి మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన సభకు అన్నిగ్రామాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. భారీ జనం చేరడంతో వికారాబాద్ పట్టణమంతా జనసంద్రంగా మారింది. నియోజకవర్గమంతటా ఒకేసారి దళితబంధు మంజూరు చేస్తామని, ఐటీని విస్తరిస్తామని హామీనివ్వగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధును పుట్టించింది కేసీఆర్ అనగా, ప్రజలంతా జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు అధ్యక్షతన జరిగిన సభతో పట్టణమంతా గులాబీమయమైంది. తండాలు, పల్లెలు, అన్ని వార్డుల నుంచి జనం గులాబీ జెండాలు, ప్లకార్డులు చేతబూని సభకు తరలివచ్చారు. వికారాబాద్‌లో చెల్లని రూపాయి.. జహీరాబాద్‌లో చెల్లుతుందా.. అని కాంగ్రెస్ అభ్యర్థి గురించి సీఎం కేసీఆర్ అనగానే చప్పట్లు మార్మోగాయి. లోకల్ లీడర్ కావాలి.. అంటూ జనం నినదించారు.
హిందీ ప్రసంగంతో ఆకట్టుకున్న జన నేత
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం పటేల్‌గూడ మైదానంలో ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు వేలాది మంది తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద సంఖ్య లో ప్రజలు హాజరయ్యారు. ముఖ్యంగా కార్మికులు, ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారు పె ద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కాంగ్రెస్ హ యాంలో పటాన్చెరు పారిశ్రామికవాడలో నె లకొన్న కాలుష్యం, తాగు, సాగునీటి సమస్యల గురించి వివరించినప్పుడు ప్రజల్లో నిజమేనన్న ఆలోచన కలిగింది. పటాన్చెరు ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు ఎల్లయ్యతో సీఎం కేసీఆర్ కరచాలనం చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తన ప్రసంగంలో ఎల్లయ్య తన ఆప్తమిత్రుడని గుర్తు చేశారు. ఉత్తరాదీలకు అర్థమయ్యేలా హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఉండే కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆనందంతో చేతులెత్తి హర్షం వ్యక్తం చేశారు. మధుప్రియ, మానుకోట ప్రసాద్ ఇతర కళాకరుల బృందాల ఆటాపాటలతో సభాప్రాంగణాల్లో జనం ఆడిపాడారు. గులాబీ జెండాలే రామక్క పాటకు ఎక్కడికక్కడ నాయకులు, గులాబీ శ్రేణులు ఉత్సాహంగా గంతులేసి ఆడారు.