e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలి : సీఎం కేసీఆర్‌

పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగం, అటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. పార్లమెంట్‌ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షత జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ వరిధాన్య సేకరణలో స్పష్టత కోసం పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

పూటకోమాటతో కిరికిరి

వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతూ, 90లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాల్సి ఉండగా.. కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మళ్లీ పాతపాటే పడుతున్నది. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఇటు తెలంగాణ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను, అటు సీఎస్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా.. ఎటూ తేల్చక పోవడంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రానున్న యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంపై.. అట్లాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటరో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా, ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానంపై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉభయ సభల్లో తెలంగాణ గళం వినిపించాలి

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉభయ సభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరఫున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.వార్షిక ధాన్యసేకరణ క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ చేసిన డిమాండ్‌ను అభినందిస్తూనే, ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సీఎం అధ్యక్షతన సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానం పై పోరాడాలని నిర్ణయించింది.

ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో తెలంగాణ రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, ‘సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం’(Uniform National FoodGrain Procurement Policy) కోసం పార్లమెంట్‌లో డిమాండ్ చేయాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలను ఆదేశించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కే కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, కేఆర్‌ సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌సభ ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేశ్‌నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ హాజరయ్యారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement