హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం మాట్లాడే అవకాశం ఉన్నది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ప్రగతి భవన్లో కేసీఆర్ భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా వరద పరిస్థితులు.. ఇప్పటి వరకు అధికారులు చేపట్టిన సహాయక చర్యలు, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.