మెదక్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్‌ను) ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద సీఎస్ శాంతి కుమారి రిబ్బన్ కట్ చేశారు. కార్యాలయంలోపల ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచననాలు తీసుకున్నారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు తమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ కలెక్టర్‌కు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు సీఎం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.