CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘సిద్దిపేటకు భారీగా తరలివచ్చిన ఆత్మీయులైన సిద్దిపేట అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లకు హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను నాయకున్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని గర్వంగా మనవి చేసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్ దేశమే ఆశ్చర్యపడేలా.. అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం ఈ గడ్డ పుణ్యమే. నన్ను ఇంతవాన్ని చేసిన మాతృభూమి, కన్నతల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నా’ అన్నారు.
‘నన్ను ప్రతిసారి విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనని మనవి చేస్తున్నా. ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు వందలాది మంది ఉన్నారు. అనేక జ్ఞాపకాలు, ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. కొండంరాజ్పల్లి మాదన్న ఎక్కడ ఉన్నడో.. మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో. నాకు డిపాజిట్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఇలా అనేక మంది అనేక మంది ప్రతి గ్రామంలో వంద, మూడు వందల పేర్లు పెట్టి పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ సిద్దిపేట గడ్డ. ఆ నాడు అంత అద్భుతమైన పద్ధతిలో ఈ గడ్డను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా తిప్పలు పడ్డాం. ఒక సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే.. దామోదర్‌రావు, ఎంపీకి రంగనాయక్ సాగర్ నుంచి హెలికాప్టర్ నుంచి చూపించాను. సిద్దిపేటలో మంచినీళ్ల కరువు వస్తే వార్డుకో ట్యాంకు పెట్టి.. మిత్రులను వెంటేసుకొని బయలుదేరాం. సాయంత్రం వరకు ప్రయత్నం చేసి వంద బోర్లు వేస్తే నీళ్లు రాలే. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. మంచినీళ్ల కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు. లోయర్ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. ఈ రోజు మిషన్ భగరీథ తెలంగాణ మొత్తం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది. ఇక్కడి అనుభవమే అక్కడిదాకా.. బ్రహ్మాండంగా పని చేసింది’ అన్నారు.