CM KCR | వికారాబాద్‌లో చెల్లని రూపాయి జహీరాబాద్‌లో చెల్లుతుందా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేసే ఆయనది వికారాబాద్. మనదగ్గర లీడర్లు లేరని వికారాబాద్ నుంచి సేపోయి తెచ్చుకోవన్నా ? ఏం అవసరం ఉన్నది మనకు? ఒక్కమాట ప్రజలు చెప్పాలి. వికారాబాద్‌లో చెల్లని రూపాయి జహీరాబాద్‌లో చెల్లుతుందా? వాళ్లకే వికారం అనిపించి వాళ్లే అక్కడి నుంచి వెళ్లగొట్టారు. రెండుసార్లు ఓడగొట్టారు. మళ్లీ జహీరాబాద్‌లో చెల్లుతదా? లోకల్ లీడర్ మాణిక్‌రావు కావాలా..? వికారాబాద్ ఆయన కావాలా? ఇది జహీరాబాద్ ప్రజల ఆత్మగౌరవ పరీక్ష ఇది’ అన్నారు.
‘లోకల్ మనిషిని వదిలి పరాయోడిని గెలిపిస్తే మనకు ఏమన్నా ఇజ్జత్ ఉంటదా? మాణిక్‌రావు సౌమ్యుడు. చాలా పద్ధతి మనిషి. ఎవరినీ నష్టపెట్టేవాడు కాదు. అందరితో కలిసి ఉండేవాడు. ఎమ్మెల్యేగా గెలువంగనే హైదరాబాద్లోపోయి పడేటోడు కాదు. ప్రజల మధ్యనే ఉంటడు. మంచి వ్యక్తి అయిన మణిక్రావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. నేను చెప్పిన విషయాలపై ఆలోచించి.. ప్రజల్లో చర్చ పెట్టాలి. మంచి ఏరోజుకైనా మంచే అవుతుంది. చెడు చెడే అయితది కాబట్టి జాగ్రత్త!.. ఇక్కడుండే సమస్యలన్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. హరీశ్‌రావు మంత్రి ఉన్నడు మీకు. మీరందరూ సహకరించి.. జహీరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్‌రావును గెలిపించండి. అన్ని పనులు చేసే బాధ్యత నేను, హరీశ్‌రావు తీసుకుంటున్నమని తెలియజేస్తున్నా’నన్నారు.