Kamareddy | (కామారెడ్డి నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనమైంది. ఉప్పొంగిన జనంతో ఉర్రూతలూగింది. ఎటుచూస్తే అటు సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటల దాకా పలుచగా జనంలో కనిపించిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానం 2 గంటల కల్లా ఇసుకవేస్తేరాలనంత జన కెరటమైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినప్పటి నియోజకవర్గం తనకు తానే తరించిపోయిందని గురువారం ప్రజా ఆశీర్వాద సభ నిరూపించింది. యువకులు, మహిళలు, ముస్లిం మైనారిటీ, వృద్ధులు, వర్తక, వ్యాపారవర్గాలు.. సబ్బండ వర్ణాలు తరలిరావడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. కేసీఆర్ రాకముందు నుంచే వచ్చిన జన ప్రవాహం ధూం..ధాం ఆటపాటలతో ఉర్రూతలూగింది. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి తండోపతండాలుగా సభకు పోటెత్తారు. సభాస్థలికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పోలీసులు వాహనాలను నిలిపివేసినా సరే కాలినడకన బారులు తీరి ఆటపాటలతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అశేషంగా జనం తరలిరావడంతో సీఎం కేసీఆర్ నిర్దేశిత సమయం కన్నా ముందే సభాస్థలికి చేరుకున్నారు.
ఈ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభల్లో ఇప్పటిదాకా చేసిన ప్రసంగాలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డిలో చేసిన ప్రసంగం (సిద్దిపేట, సిరిసిల్ల మినహాయింపు) ఉద్యమ అనుభూతుల మేళవింపుగా సాగింది. తెలంగాణ ఉద్యమం, తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని సీఎం కేసీఆర్ వివరించడంతో కామారెడ్డి ఉద్విగ్నతకు లోనైంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి దాకా కామారెడ్డి ప్రజలతో తనకున్న వీడదీయరాని అనుబంధాన్ని కేసీఆర్ నెమరువేసుకున్నారు. ఉద్యమ తొలినాళ్లలో కామారెడ్డికి బ్రిగేడియర్‌గా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘కామారెడ్డికి నాకు పుట్టుక నుంచే సంబంధం ఉన్నది’ అని కేసీఆర్ చెప్తున్నప్పుడు సభా ప్రాంగణం పిన్‌డ్రాప్ సైలెన్స్ మోడ్‌లోకి వెళ్లింది. ‘బీబీపేట మండలం కోనాపూర్ గ్రామం ఇప్పుడు దాన్ని పోసానిపల్లె అంటరు. మా అమ్మ పుట్టిన ఊరు’ అని, రైల్కట్ట దగ్గర బాదల్సింగ్ మార్వాడీసేఠ్, అడ్తి వ్యాపారి నిమ్మల జిబ్బారెడ్డి అని చెప్తుండగానే ఒక్కసారిగా సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ సభకు నిధులను సమకూర్చేం దుకు తాను దేశాయి బీడీ ఫ్యాక్టరీలో కూలీపని చేసిన సందర్భాన్ని చెప్పగా.. ‘కామారెడ్డి గడ్డ కేసీఆర్ అడ్డా’, జై తెలంగాణ.. జై తెలంగాణ’అని నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ ఒక్కొక్క ఊరిపేరు, ఒక్కొక్క ఉద్యమకారుడి పేరును గుర్తుచేసుకున్నప్పుడు సభాప్రాంగణం ఉద్విగ్నతో నిండిన ఉత్సాహంతో ఊగిపోయింది. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మారుమోగిపోయింది. ‘కామారెడ్డికి వస్తే కేసీఆర్ ఒక్కడే రాడు. చానావస్తది. ఇది కేసీఆర్ మాట’ పేర్కొనగానే ‘మీ మాటే శాసనం’ అంటూ సభాప్రాంగణం ముందు ‘వీఐపీ’ గ్యాలరీ నుంచి పెద్దపెట్టున ప్రతిస్పందన వచ్చింది.
కామారెడ్డి ప్రజా ఆశీర్వాదసభ జాతరను తలపించింది. గులాబీ జెండాలతో రెపరెపలాడింది. సభా ప్రాంగణానికి ఎటూ మూడు కిలోమీటర్ల దూరంలో ఎటుచూస్తే అటు జనమై ప్రతిధ్వనించింది. గులాబీ వనంలో జోష్ తొణికిసలాడింది యువత, మహిళలు, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆసాంతం చెవులొగ్గి విన్నారు. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు పార్టీ కార్యకర్తలకంటే యువకులు పెద్దఎత్తున ఈలలు, నినాదాలతో మారుమోగించారు. ఉర్దూలో కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టగానే ‘జీత్ గయా భాయ్ జీత్ గయా… కేసీఆర్ జీత్‌గయా, జీత్ గయా భాయ్ గయా దిల్ సే కార్ జీత్ గయా’ అంటూ చప్పట్లతో సభాప్రాంగణం హోరెత్తింది.
కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ సూపర్‌హిట్ కావడం, తమ అంచనాలకు మించి జనం సభకు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పట్టరాని సంతోషం వ్యక్తమవుతున్నది. ‘కేసీఆర్ ఒక్కసారి వస్తేనే ఇట్లుంటే ఎప్పటికీ వస్తే ఇంకెట్లుంటదో చూడున్రీ’ అని మాచారెడ్డి మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తన ఆనందానికి అవధుల్లేవని పేర్కొన్నాడు. రాత్రి కొద్దిగా వాన చినుకులు పడ్డవి.. తెల్లారితే సభ ఎట్లనో అనుకున్నం కానీ షాన్‌దార్ అయిందని మరో కార్యకర్త పేర్కొన్నారు. ‘గంతపెద్ద సార్ (కేసీఆర్) దీవెన కోసం వచ్చిన’ అన్న మాటొక్కటి చాలు మాకు నాడు ఉద్యమం కోసం ఇల్లిల్లూ తిరిగినట్టే రేపటి నుంచి మనిషి మనిషిని కలుస్తం. సారొస్తే కామారెడ్డి ఎంత అభివృద్ధి అయితదో చెప్తం’ అని బీఆర్ఎస్ నాయకులు తమ ఉద్యమస్ఫూర్తిని చాటుకోవటం విశేషం.